Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాలి ముద్దు… అనగా ‘ముద్దొచ్చే ప్రజాస్వామ్యం’ అని అర్థం…

August 12, 2023 by M S R

Kiss-Chaos: రాజ్యాంగ రచనలో అణువణువునా ప్రజాస్వామ్యమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకుని…ఎదిగి… శాఖోపశాఖలై విస్తరించి…పూచి…కాయ కాచి…పంట ప్రజల చేతికి అందడమే పరమ ప్రయోజనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్ట సభలు దేవాలయాల్లాంటివి. అక్కడ చర్చలు; చర్చోపచర్చలు; ప్రశ్నలు- సమాధానాలు; పార్టీల బాలాబలాలు…అన్నీ ప్రజలకు సంబంధించినవే అయి ఉంటాయి. ఇంతకంటే లోతుగా వెళితే అది ఎన్నికల ప్రక్రియ, చట్టసభల కూర్పు, స్వరూప, స్వభావాలు; విధి విధానాల మీద పోటీ పరీక్షల పాఠం అవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం.

ప్రజాస్వామ్యంలో ముద్దు ముచ్చట గురించి విడిగా ఎక్కడా ప్రస్తావించకపోయినా…ప్రజాస్వామ్యంలో ముద్దుకు చోటే లేదనుకోవడం తొందరపాటు అవుతుంది. భాషలో క్రియా పదాలను కొంచెం మార్చుకుంటే క్రియా విశేషణాలు అవుతాయి. అలా ‘ముద్దొచ్చే ప్రజాస్వామ్యం’ మాట పుడుతుంది. నిజానికి ముద్దు నామవాచకం. వచ్చే అనే క్రియను చివర తగిలించగానే ముద్దు ముద్దుముద్దుగా క్రియా విశేషణమై ముందు నిలుచుని ముద్దులు మూటగడుతూ ఉంటుంది.

Ads

చట్టసభల్లో-
సభా మర్యాదలు పాటిస్తూ మాట్లాడ్డం
అన్ పార్లమెంటరీ భాష జోలికి పోకుండా మాట్లాడ్డం
ఆవేశంగా మాట్లాడ్డం
కోపంగా మాట్లాడ్డం
నెమ్మదిగా మాట్లాడ్డం
అర్థవంతంగా మాట్లాడ్డం
అర్థం కాకుండా మాట్లాడ్డం
కవితాత్మకంగా మాట్లాడ్డం
సహజంగా మాట్లాడ్డం
కృతకంగా మాట్లాడ్డం…ఇలా రకరకాల పద్ధతులు విన్నాం. కన్నాం.

ముద్ద ముద్దగా మాట్లాడ్డం కూడా తెలిసిందే. తాజాగా ముద్దు ముద్దుగా మాట్లాడ్డం/ ముద్దుతో మాట్లాడ్డం/ మాటలే లేకుండా ముద్దులు విసరడాలు వింటున్నాం. చూస్తున్నాం.

మణిపూర్ హింస, తెగల మధ్య యుద్ధం గురించి పార్లమెంటులో వాడి వేడి చర్చ జరుగుతోంది. సభ్యత్వం పునరుద్ధరణ తరువాత సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెట్టించిన ఉత్సాహంతో ప్రధాని మీద, అధికార పక్షం మీద విమర్శలు ఎక్కుపెట్టి మాట్లాడారు. తన ప్రసంగం తరువాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా రాహుల్ లేచి వెళ్లబోతుంటే ఆయన చేతిలో ఫైళ్లు కింద పడ్డాయి. దాంతో బి జె పి సభ్యులు ఎగతాళిగా ఘొల్లున నవ్వారు. దానికి ఆయన ప్రతిగా వారి వైపు గాల్లోకి ముద్దు ఫ్లైయింగ్ కిస్ విసిరారు.

అంతకు ముందు ఇదే సభలో రాహుల్ కన్ను కొట్టినప్పుడు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసార కెమెరా క్లోజ్ ఫ్రేమ్ పెట్టి పట్టుకుంది. కానీ ఈసారి ప్రత్యక్ష ప్రసారంలో ఈ దృశ్యాన్ని పార్లమెంటు కెమెరా క్లోజ్ ఫ్రేమ్ లో పట్టుకోకపోయినందుకు అధికారపక్షం చాలా బాధపడి ఉంటుంది. ఇకపై రాహుల్ గాంధీని క్లోజ్ ఫ్రేమ్ లో కంటిన్యూగా రికార్డ్ చేస్తూనే ఉండాలని ఆదేశాలు వెళ్లే ఉంటాయి!

నిండు సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కించపరుస్తూ రాహుల్ గాల్లోకి ముద్దు విసిరారని అధికారపక్షం అధికారికంగా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. బి జె పి సభ్యులు గేలి చేసినా…తాను ప్రేమనే పంచుతున్నానని సంకేతంగా వారి వైపు గాల్లోకి రాహుల్ ముద్దు విసిరారే కానీ…ఇందులో దురుద్దేశం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది.

బయట ముద్దు వేరు. చట్ట సభల్లో ముద్దు వేరు. కాబట్టి ఈ ముద్దు నిందార్థం, ఎగతాళి, చులకన కాదని రాహుల్ నిరూపించుకోవాల్సి ఉంటుందో? పానకంలో పుడకలా పార్లమెంటులో ముద్దు పొడుపు చర్చ ఎందుకు అనవసరంగా? అని వదిలేస్తారో తెలియదు. 22 మంది అధికార బి జె పి మహిళా ఎం పి ల ఫిర్యాదును పార్లమెంటు నైతిక విలువల (ఎథిక్స్ ) కమిటీకి నివేదించి ...ఆ కమిటీ నివేదిక మేరకు రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

అయిదు పదులు దాటిన వయసులో ఒక ముద్దూ ముచ్చటా లేని రాహుల్ ఏదో ముద్దొచ్చి గాల్లోకి సుతారంగా ప్రేమపూర్వక ముద్దును విసిరితే ముద్దులు మూటగట్టుకుని మురిపెంగా దాచుకోకుండా ఏమిటీ మోటు ప్రతిస్పందన? అని పెదవి విరవాలా?
పార్లమెంటులో అంతంత సీరియస్ డిబేట్ల మధ్య బాధ్యతగల సభ్యుడయిన రాహుల్ కన్ను కొట్టడం, ముద్దులు విసరడం ఏమిటి? మోటు సరసం కాకపొతే! అని నిట్టూర్చాలా?

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions