‘‘విషం పీడ విరగడ’’ అంటూ… తెలంగాణ ఫ్లోరైడ్ విముక్తప్రాంతంగా మారిపోయింది అంటూ… ఐదేళ్లలో దాదాపు వేయి గ్రామాలను ఈ భూతం నుంచి రక్షించినట్టే అంటూ… తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్న ఘనత నిజం కాదా..? సాక్షిలో పబ్లిషైన ఓ స్టోరీ కొత్త ప్రశ్నలను, సందేహాలను జనం ముందుంచింది… నిజానికి సాక్షి పత్రికేనా ఇది రాసింది అనే డౌటొస్తుంది ఈ కథనం చూడగానే…! బహుశా వెలుగు పత్రిక అయి ఉంటుందేమోలే అనే భ్రమనూ కల్పిస్తుంది… కానీ నిజమే… సాక్షిలోనే కనిపించింది… గుడ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ… అదేం చెబుతున్నదంటే..? తెలంగాణను ఫ్లోరైడ్ భూతం వీడలేదు… అసలు నల్లగొండే గాకుండా సంగారెడ్డి, రంగారెడ్డి, జగిత్యాల, ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలకు కూడా విస్తరించింది… ఇది ఎవరో రాజకీయ నాయకులో, అల్లాటప్పా సర్వే సంస్థలో చేసిన ప్రకటన కాదు… సాక్షాత్తూ రాష్ట్ర భూగర్భజలవిభాగం 2019లో నిర్వహించిన ఓ అధ్యయనమే చెప్పింది… 2018లో మస్తు దుర్భిక్ష పరిస్థితులు ఉండి, జనం ఎక్కువగా బోరు నీటి వైపు మళ్లడంతో, తాము తీసిన శాంపిళ్లలో ఈ నిజం వెల్లడైనట్టు సదరు విభాగం చెబుతోంది… ఇదీ వార్త సారాంశం…
మరీ వెనక్కి వద్దు గానీ… గత సెప్టెంబరు… నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో అచ్చయిన ఈ కథనాన్ని చూడండి ఓసారి… అది ఏం చెబుతున్నదంటే..? తెలంగాణలో విషం పీడ విరగడ,,, ఫ్లోరైడ్ నీటి నుంచి తెలంగాణకు విముక్తి…. ఆరేండ్లుగా కొత్త ఫ్లోరైడ్ కేసు ఒక్కటీ లేదు….. ఇదీ వార్త సారాంశం… కేసీయార్ ఘనతే ఇదంతా అని తేల్చేసింది… ఇదంతా మిషన్ భగీరథ వల్లే అని కేటీయార్ ప్రకటించాడు… గుడ్… అప్పట్లో అందరమూ చప్పట్లు కొట్టి, మనకు మనమే అభినందించుకున్నాం… తెలంగాణ వస్తే ఏమొస్తుది అన్నారు కదా, ఈ మంచి జరిగింది అని ఓ కీర్తిపతాకను ఎగరేశాం… మరి అకస్మాత్తుగా ఇదేమిటి..? నిజమా..? ఫ్లోరైడ్ భూతం కొత్త ప్రాంతాలకూ కోరలు చాస్తున్నదా..? ఎవరిని నమ్మాలి..?
Ads
నిజానికి ఫ్లోరైడ్ విషం నుంచి ఇక తెలంగాణ విరగడ అయినట్టే అనే ప్రకటన అల్లాటప్పాగా ఏమీ చేయలేదు… కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఘనతను ప్రచారం చేసుకుంది… 2020 ఆగస్టు నాటికి తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న గ్రామాల సంఖ్య జీరో అని కేంద్రం ఒక అధికారిక నివేదికలో తేల్చేసింది… 2019లో భూగర్భజలవిభాగం చేసిన అధ్యయనంలో ఫ్లోరైడ్ కొత్త ప్రాంతాలకు విస్తరించినట్టు తేలితే… మరి 2020 నాటికి అసలు ఫ్లోరైడ్ ప్రభావమున్న గ్రామాలే లేనట్టుగా కేంద్రం ఎలా తేల్చింది..? ఎవరు చెప్పేది కరెక్టు…?
ఇదంతా మిషన్ భగీరథ పుణ్యమే అని కేటీయార్ అప్పట్లో ఓ ట్వీట్ చేశాడు… ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న గ్రామాలకు భగీరథ నీటిని ఇస్తున్నాం, అదే శ్రీరామరక్ష అనడం వరకూ వోకే… కానీ ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న గ్రామాలే లేవని కేంద్ర ప్రభుత్వం ఎలా తేల్చేసింది అనేది ప్రశ్న… ఫ్లోరైడ్ భూతం తొలగిపోలేదు, అది విస్తరిస్తోంది… మన బోర్లలో, మన బావుల్లో అది దాక్కునే ఉంది… ఆ నీరు విషమే అని భూగర్భజలవిభాగం చెబుతోంది… గ్రౌండ్ వాటర్ బదులు సర్ఫేస్ వాటర్ ఎప్పుడూ మంచిదే… మిషన్ భగీరథ ఆ కోణంలో సరైన ప్రాజెక్టే… కానీ అది భూగర్భజలాల్లోని ఫ్లోరైడ్ కంటెంటుకు విరుగుడు కాదు, అయితే ఫ్లోరైడ్ ఎందుకు విస్తరిస్తున్నట్టు..? అదే ఇప్పుడు జవాబు దొరకాల్సిన అంశం..!!
Share this Article