ఇది ఎవరి కథ..? సోపన్ నర్సింగ గైక్వాడ్ అనే సుదీర్ఘ కక్షిదారు అవస్థ కథా..? లేక భారతీయ న్యాయ వ్యవస్థ కథా..? ఒక్కసారి ఈ వ్యాజ్యం పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం…
1968… సోపన్, వయస్సు 55 ఏళ్లు, మళ్లీ చదవండి, అప్పుడు ఆయన వయస్సు 55 ఏళ్లు… తనది మహారాష్ట్ర… ఒక రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒక ప్లాట్ కొన్నాడు… కానీ కొన్నాళ్లకే తెలిసింది, దాన్ని తనకు అమ్మిన ఒరిజినల్ ఓనర్ ఏదో బ్యాంకులో తాకట్టు పెట్టి గతంలోనే లోన్ తీసుకున్నాడని…
1969… ఒరిజినల్ ఓనర్ తన లోన్ తిరిగి చెల్లించకపోవడంతో సదరు తాకట్టు పెట్టుకున్న బ్యాంకు సోపన్‌కు నోటీసులు పంపించింది… సోపన్ కోర్టుకెక్కాడు… ఆ లోన్‌తో తనకు సంబంధం లేదని…
Ads
1982… అంటే భూకొనుగోలు తరువాత 14 ఏళ్లకు ఓ ట్రయల్ కోర్టు తనకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది… ఒరిజినల్ ఓనర్ కోర్టుకెక్కాడు… సోపన్ వయస్సు ఇప్పుడు 69 ఏళ్లు… అనగా 1982లో అని…
1987… అంటే భూకొనుగోలు తరువాత 19 సంవత్సరాలకు ఓనర్ అప్పీల్‌కు వెళ్లాడు… ట్రయల్ కోర్టు తీర్పుకు భిన్నంగా, అంటే ఓనర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది… సోపన్‌కు షాక్… సోపన్ వయస్సు ఇప్పటికి 74 ఏళ్లు… తన పోరాటం నడుస్తూనే ఉంది…
1988… అంటే కేసు మొదలైన 20 ఏళ్ల తరువాత సోపన్ హైకోర్టును ఆశ్రయించాడు… సోపన్ వయస్సు 75 ఏళ్లు… ఏళ్లు గడిచిపోతున్నయ్… న్యాయం సుదూరంగా కూడా గోచరించడం లేదు…
2015… అంటే కేసు మొదలై 47 ఏళ్లు… సోపన్ గైక్వాడ్ పండు ముసలి ఇప్పుడు… వయస్సు వందేళ్లు దాటిపోయాయి… 102 ఇప్పుడు… బాంబే హైకోర్టు తన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది… సోపన్ లార్జ్ బెంచ్‌కు అప్పీల్ చేశాడు…
2019… అంటే అప్పటికి ఈ సమస్య మొదలై 51 సంవత్సరాలు… బాంబే హైకోర్టు పెద్ద బెంచ్ తన సెకండ్ అప్పీల్‌ను కూడా తోసిపుచ్చింది… ఫైలింగులో ఆలస్యం వంటి ఏవో సాంకేతిక సాకులు చూపించింది… కేసు వాయిదాకు రాలేదనీ ఆరోపించింది… తన లాయర్లు కేసు వాయిదా రోజున కోర్టుకు హాజరు కాలేదనే సంగతే సోపన్‌కు తెలియదు… అప్పటికి సోపన్ వయస్సు 106 సంవత్సరాలు…
2021… అనగా ఈ కేసుకు 53 ఏళ్ల వయస్సొచ్చింది… సోపన్ తన పోరాటాన్ని ఆపదలుచుకోలేదు… అప్పటికి 108 ఏళ్లు నిండాయి… ఐతేనేం, ఆ భూమిని సంపూర్ణంగా తనది అనిపించుకోవాలనే కోరిక… సుప్రీంకోర్టుకు వెళ్లాడు…
12 July 2021… సుప్రీంకోర్టు తన మొర వినడానికి, కేసు విచారించడానికి అంగీకరించింది… అదే మహాభాగ్యం… న్యాయమే వస్తుందో, ఓడిపోతాడో తరువాత సంగతి… కనీసం సుప్రీంకోర్టు కేసు స్వీకరిస్తానని చెప్పింది…
12 July 2021… 108 ఏళ్ల వయస్సులో సోపన్ గుండె మొరాయించింది… ఇక చాల్లే అని చెప్పి ఆగిపోయింది… సోపన్ ఈ లోకమే విడిచి వెళ్లిపోయాడు… ఈ అన్యాయం ఏమిటో దేవుడినే అడగాలని అనుకున్నాడు… తన ఊరి నుంచి తన మరణవార్త తన లాయర్లకు చేరడానికీ లేటైంది… సుప్రీంకు తన మరణవార్తను తెలిపారు తన లాయర్లు…
అనగా… 55 ఏళ్ల వయస్సులో భూమి కొంటే… 108 ఏళ్లు న్యాయపోరాటం తరువాత కూడా తనకు న్యాయం దక్కలేదు… ఇప్పటికీ ఆ భూమి మీద తనకు సంపూర్ణ యాజమాన్య హక్కు దఖలు పడలేదు… భారతీయ న్యాయవ్యవస్థలో అసలు రోగమేమిటో అపెక్స్ బాడీ సుప్రీంకోర్టు ఆలోచించాలి… లేదా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకోవాలి… వేలు, లక్షల కేసులు ఏళ్లుగా విచారణలోనే… దిగువ నుంచి పైదాకా అనేక దశల్లో న్యాయం అటూఇటూ మొగ్గుతూనే ఉంటుంది…
కేంద్రప్రభుత్వం జుడిషియల్ కమిషన్ తీసుకొస్తాం అంటేనే సుప్రీం తన కొలీజియం తనిష్టం అని అడ్డుకుంటుంది… ఇక కేంద్రప్రభుత్వం న్యాయవ్యవస్థకు ప్రతిపాదించే చికిత్సల్ని సుప్రీం ఆమోదిస్తుందా అనేది పెద్ద ప్రశ్న… ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సోపన్ నర్సింగ్ గైక్వాడ్ కేసు తన కథా..? లేక మన న్యాయవ్యవస్థ కథా..? ఇంతకన్నా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ బోలెడు ఉండవచ్చుగాక… కానీ ఇదొక మచ్చు మెతుకు…
ఇది అలా అలా వెబ్ గాలిలో కొట్టుకొచ్చిన సోషల్ మీడియా ఫేక్ స్టోరీ కాదు… ఇండియాటుడేలో వచ్చిన స్టోరీ… ఇదుగో లింక్… https://www.indiatoday.in/india/story/108-year-old-maharashtra-man-dies-just-before-sc-admits-land-dispute-plea-1831108-2021-07-22
Share this Article