పార్ధసారధి పోట్లూరి ……. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ నేవీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కుంటోంది… రెండు యుద్ధనౌకల్ని పోగొట్టుకుంది… బోలెడు లోపాలు బయటపడుతున్నాయి… మరి అదే రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన నేవీ ఆయుధాలు, నౌకల పరిస్థితి ఏమిటి..? సేఫేనా..? ఈ ప్రశ్నల గురించి మనం మొన్న ముచ్చటించుకున్నాం కదా… ఇక చదవండి…
నల్ల సముద్రంలో రష్యన్ నావీ బలహీనతలు బయటపడ్డ సమయంలో రష్యా నుండి భారత్ కొన్న 8 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ వాటి పని తీరు ఎలా ఉండబోతున్నది ? మూడు రోజుల క్రితం నల్ల సముద్రంలో రష్యాకి చెందిన అధునాతన ఫ్రిగేట్ అడ్మిరల్ మకరోవ ఉక్రెయిన్ దళాలు చేసిన దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే ! అదే తరగతికి చెందిన 8 ఫ్రిగేట్స్ ని కూడా భారత్ దిగుమతి చేసుకున్నది. మరి వాటి పనితీరు ఎలా ఉండబోతున్నది ?
మార్చి నెల 2022 లో అంటే రెండు నెలల క్రితం భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల సంయుక్త ఉత్పాదన అయిన బరాక్ 8 మీడియం రేంజ్ సర్ఫేస్ to ఎయిర్ మిసైల్ ని [MRSAM (Medium Range Surface-To-Air Missile) విజయవంతంగా పరీక్ష చేయగలిగాయి. ఈ సిస్టమ్ మన తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ల కోసం చేసింది. మన ఫ్రిగేట్ల మీద మోహరించడానికి కృత్రిమంగా టార్గెట్ ని సృష్టించి దానిని బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా నాశనం చేయగలగింది. ఈ పరీక్ష మునపటి మోడల్ బరాక్ మిసైల్ వ్యవస్థ కంటే మరింత అడ్వాన్స్‌గా అభివృద్ధి చేశాయి భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాలు.
Ads
బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భూమి మీద నుండి, సముద్రం నుండి ప్రయోగించవచ్చు.
రష్యా ఫ్రిగేట్ల పనితీరు మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ అందిపుచ్చుకోవడం అనేది గణనీయమయిన చర్య అనే చెప్పాలి. ఒకసారి బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి వివరంగా తెలుసుకుందాం !
1. 2000 సంవత్సరంలో అప్పటి వాజపేయీ ప్రభుత్వం మొదటిసారిగా ఇజ్రాయెల్ కి చెందిన బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఆర్డర్ పెట్టింది. అప్పట్లో బరాక్ 1 మిసైల్ ఉండేది. భారత్ కి చెందిన మొత్తం 14 యుద్ధ నౌకల మీద బరాక్ 1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అమర్చారు.
2. బరాక్ 1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 10 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఆకాశం నుండి వచ్చే శత్రు విమానాలు, యాంటీ షిప్ మిసైళ్ళ తో పాటు డ్రోన్ల ని కూడా కూల్చివేయగలదు.
3. బరాక్ 1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి ఉండే రాడార్లు 360 డిగ్రీల పరిధిలో శత్రు టార్గెట్స్ ని గుర్తించగలవు.
4. బరాక్ 1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి తక్కువగా ఉండడం వలన [short range ] మరింత పరిధి కలిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ ఇజ్రాయెల్ ని అడిగినది అప్పట్లో… కానీ ఈ సారి జాయింట్ వెంచర్ కింద అభివృద్ధి చేయాలని, అదీ DRDO ని భాగస్వామి గా చేసుకొని అభివృద్ధి చేయాలని చూశారు. కానీ తగినంతమంది ఇంజినీర్లు లేకపోవడం వలన ప్రాజెక్ట్ ఆలస్యం అవడంతో ఇజ్రాయెల్ మూడు వేరియంట్లతో బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అభివృద్ధి చేసింది.
5. ఆ మూడు వేరియంట్లలో భారత్ కి కావాల్సినట్లుగా మార్పులు చేసి మరింత అభివృద్ధి చేశాయి రెండు దేశాలు. బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఇజ్రాయెల్ భాగస్వామ్యం 70% ఉండగా భారత్ భాగస్వామ్యం 30% గా ఉంది.
6. దాదాపుగా 7 ఏళ్ల క్రితమే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తొలగించి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని డిప్లయ్ చేయాలని ప్లాన్. ఇక పాత బడిన రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన SA-6 and SA-8 ని తొలగించి ఇప్పుడు బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అమర్చబోతున్నారు.
7. బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇజ్రాయెల్ తన నమ్మకమయిన ఐరన్ డోమ్ [Iron Dome ] టెక్నాలజీని ఆధారంగా చేసుకొని డెవలప్ చేసింది.
8. ఐరన్ డోమ్ టెక్నాలజీ లో ఒక ప్రత్యేకత ఉంది : అది పాలస్తీనా వైపు నుండి వచ్చే ఆన్ గైడెడ్ రాకెట్స్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్శ్ ని సమర్ధవంతంగా ఎదుర్కోగలదు… అలాగే ఐరన్ డోమ్ లో ఉండే రాడార్లు ఇజ్రాయెల్ మీదకి వచ్చే రాకెట్లు, RPG ల కదలికలని అంటే అవి వచ్చే దిశ, వేగంని బట్టి అవి జనావాస ప్రాంతాలలో పడతాయా లేక నిర్మానుష్య ప్రాంతంలో పడతాయా అని విశ్లేషించి జనావాసాల మీద పడే వాటిని గుర్తించి మిసైల్ ని లాంచ్ చేసి నాశనం చేస్తుంది… అదే నిర్మానుష్య ప్రాంతంలో పడతాయి అని అంచనా వేసిన వాటిని వదిలివేస్తుంది. ఖచ్చితంగా ఇదే రష్యన్ నావీ రాడార్లలో ఉన్న లోపం, అంటే టర్కిష్ బైరాక్టర్ TB2 డ్రోన్ల మీదనే దృష్టిపెట్టాయి కానీ మరో వైపు నుండి వచ్చే యాంటీ షిప్ మిసైళ్ళ ని ట్రాక్ చేయలేకపోయాయి.
9. ఇప్పుడు బరాక్ 8 మిసైల్ సిస్టమ్ లో ఉన్న మల్టీ మోడ్ రాడార్లు 400 km వరకు టార్గెట్స్ ని గుర్తిస్తాయి అదే సమయంలో ఏ టార్గెట్ ప్రమాదకరమో గుర్తించి ఆపరేటర్ ని అప్రమత్తం చేస్తాయి. డ్రోన్ మీదకి మిసైల్ లాంచ్ చేయాలా వద్దా అనేది ఆపరేటర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
10. మరోవైపు మన ఫ్రిగేట్ మీదకి దూసుకు వచ్చే యాంటీ షిప్ మిసైళ్ళ విషయంలో గుర్తించిన వెంటనే మిసైల్ ని లాంచ్ చేస్తుంది. ఇది మల్టీ మోడ్ రాడార్ విశిష్టత ! అంటే ఒకే టార్గెట్ మీద దృష్టి పెట్టదు లేదా దృష్టి మరల్చే ప్రయత్నాన్ని విఫలం చేయగలదు. రష్యన్ నావీకి ఇలాంటి రాడార్లు లేవు కనుకనే రెండు ప్రధానమయిన యుద్ధ నౌకలని కోల్పోయింది రష్యా ! ఇక్కడ ప్రధానంగా ఐరన్ డోమ్ టెక్నాలజీలో ప్రధాన పాత్ర పోషించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ! IA విషయంలో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్ గా ఉంది… అదే టెక్నాలజీని బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో మరింత అభివృద్ధి చేసి అమర్చింది. రాడార్ జామింగ్ లేదా ఇన్ఫ్రా రెడ్ లతో బరాక్ 8 ని మభ్యపెట్టలేవు శత్రు దేశాలు.
11. బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత ఆర్మీ, ఎయిర్ఫోర్స్ , నావీ లకి వాడబోతున్నారు. సింహభాగం ఎయిర్ ఫోర్స్ కి ఇస్తున్నారు. అన్ని ఎయిర్ ఫోర్స్ బేస్ ల దగ్గర బరాక్ 8 సిస్టమ్ లని మోహరిస్తారు… అలాగే ఆర్మీ కి చెందిన ముఖ్యమయిన బేస్ ల దగ్గర మోహరిస్తారు. ఇక నావీ విషయానికి వస్తే ప్రస్తుతం తల్వార్ క్లాస్ [రష్యన్ తయారీ ] ఫ్రిగేట్ ల మీద మోహరిస్తున్నారు…
12. రష్యన్ నావీకి లేనిది భారత నావీకి ఉన్నది బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ! అదీ అధునాతనమయిన టెక్నాలజీ తో మన ఫ్రిగేట్లు తమని తాము రక్షించుకుంటూ శత్రు దేశాల నౌకల మీద, భూభాగాల మీద దాడి చేయగలవు.
13. చైనా, పాకిస్థాన్ ల దగ్గర బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి జవాబు చెప్పే ఆయుధాలు లేవు. చైనావి అన్నీ రష్యన్ కాపీ కాట్ లు… అయితే వాటినే ఇంకొంచెం తగ్గించి పాకిస్థాన్ కి సరఫరా చేసింది చైనా కాబట్టి మన నావీకి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండబోదు.
14. ఒకవేళ టర్కీ పాకిస్థాన్ కి బైరాక్టర్ TB2 డ్రోన్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు ఎందుకంటే బరాక్ 8 ER వర్షన్ 160 km ఉంటుంది కాబట్టి దూరంగా ఉండే డ్రోన్లని కూడా కూల్చివేస్తుంది. అయితే 1 మిలియన్ డాలర్లు విలువ చేసే TB2 డ్రోన్లను కూల్చివేయడానికి 6 మిలియన్ డాలర్ల విలువ చేసే మిసైల్ ని ప్రయోగించడానికి వెనుకాడిన రష్యాలాగా మనం ఉండబోము! బరాక్ 8 ఒక్కో మిసైల్ విలువ ఎంతో తెలియదు కానీ మనం భరించగలిగే స్థితిలో ఉన్నాము. మొత్తం 2000 బరాక్ 8 మిసైళ్లు సరఫరా చేస్తున్నది ఇజ్రాయెల్ కాబట్టి రెండో ఆలోచన ఉండదు లాంచ్ చేసే విషయంలో !
Share this Article