సినిమా బలమైన దృశ్యమాధ్యమం… దాని ప్రభావం సమాజంపై బాగా ఉంటుంది… నెగెటివ్‌గా, పాజిటివ్‌గా… కాకపోతే ప్రజెంట్ సినిమాలన్నీ సొసైటీపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించేవే… మెజారిటీ సినిమాలు…
మరి సినిమా వార్తలపై మీడియా ధోరణి ఏమిటి..? ఏమీ లేదు… ఆహాకారాలు, ఓహోరావాలు… అంతే, భజన… సినిమావాళ్లు ఇచ్చే ఫోటోలు, వివరాలను, ప్రెస్‌మీట్లు, వంద శాతం హిపోక్రటిక్ ఇంటర్వూలనే అచ్చేసి, ప్రసారం చేసి పరవశింస్తుంది మీడియా… మీరు ఏ పేపరైనా తిరగేయండి, అన్ని వార్తలూ ఒకే తీరు… మళ్లీ ఇందులో మీడియా సిండికేట్ల కథ వేరు…
నిన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఒక పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు… కల్లు కంపౌండ్‌లో హీరోహీరోయిన్లు, గ్రూపు డాన్సర్లు కలిసి చిందేస్తూ మందేస్తూ పులకరిస్తూ గెంతులేసే ఓ ఐటమ్ సాంగ్… పోనీ, ఫక్తు మసాలా మాస్ నేల క్లాస్ సాంగ్ అది… సరే, అది డైరెక్టర్ అభిరుచి స్థాయి… కానీ అందులో కేసీయార్ మార్క్ ఊతపదాల్ని యథాతథంగా అదే టోన్‌తో వాడారు…
Ads
అది అభ్యంతరకరంగా ఉందని ‘ముచ్చట’ స్టోరీ పబ్లిష్ చేసింది… అసలే కేసీయార్‌కూ తాగుడుకూ లింక్ పెట్టే రాజకీయ విమర్శలు బోలెడు… అది తనను వ్యక్తిగతంగా కించపరిచే ధోరణి… మరోవైపు తెలంగాణ అంటేనే తాగుడు అనే రీతిలో సినిమాల్లో చూపించే పైత్యం మరోవైపు… ఈ రెండింటినీ కలగలిపి మరింత నీచంగా ప్రొజెక్ట్ చేసే రీతిలో ఆ ‘మార్ ముంత, చోడ్ చింత’ అనే పాట చిత్రీకరణ సాగింది…
కేసీయార్ అంటే తాగుడు, తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చే ఈ పాటలో ‘ఏం జేద్దామంటవ్ మరి’ అనే హుక్ లైన్ యాడ్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి..? ఇలాంటి పాటలు లేదా సీన్లు లేదా కథలు వస్తున్నప్పుడు తెలంగాణ సొసైటీ నుంచి ప్రతిఘటన అవసరం… సినిమాను సినిమాలాగే చూడాలనే నీతి అన్నివేళలా వర్తించదు… కానీ అన్నీ ఆంధ్రా పత్రికలే కదాా, మెజారిటీ టీవీలూ అవే కదా… ఒక్కరూ దీన్ని తెలంగాణ కోణంలో చూడలేకపోయారు, వాక్యం కూడా రాయలేకపోయారు…
చివరకు తెలంగాణ టీవీలు, తెలంగాణ పత్రికలు కూడా..! ఎందుకు..? సినిమావాళ్ల ఎదుట సాగిలబడటం..!? కేసీయార్ మాటల్ని ఓ చౌకబారు పాటలో ఇరికించి, పరోక్షంగా తననూ కించపరచడం కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక మాత్రమే స్పందించింది… ఫస్ట్ పేజీలోనే పూరి జగన్నాథ్ పైత్యం అంటూ విరుచుకుపడింది…
అంతేకాదు, గతంలో ఇదే దర్శకుడు కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో కూడా తెలంగాణ ఉద్యమంపై విషాన్ని, అక్కసును ప్రదర్శించాడని గుర్తుచేసింది… (బీఆర్ఎస్ నేతలు ఎవరూ అధికారికంగా స్పందించినట్టు చదవలేదు, చూడలేదు…) ఆ పాట రాసిన కాసర్ల శ్యామ్, పాడిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ కళాకారులే… వారిని నిందించే పనిలేదు, ఇలాంటివి దర్శకులు, సంగీత దర్శకులు నిర్బంధంగా చేయిస్తుంటారు… మణిశర్మ నిందార్హుడు…
ఇక్కడ అభ్యంతరం ఏమిటీ అంటే… ఒక తెలంగాణ ప్రముఖ నాయకుడిని ‘తాగుడు ప్రతినిధి’గా కించపరచడంగా భావించాలా..? లేక మొత్తం తెలంగాణ సొసైటీని, తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసే పైత్యంగా పరిగణించాలా..? వెక్కిరిస్తున్నా కిక్కుమనలేని తెలంగాణ సమాజం భావదారిద్య్రంగా చూడాలా..?! ఈ సినిమా వాళ్లు కూడా రిలీజు సమయంలో టికెట్ల రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు… ఈ ప్రభుత్వ స్పందనను వేచి చూడాల్సి ఉంది..!! తాగుడును హైలైట్ చేసే ఈ సినిమా వాళ్లు కూడా డ్రగ్స్ మీద ఓ షార్ట్ వీడియో తీస్తారేమో… ఐరనీ..!!
Share this Article