Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…

November 30, 2023 by M S R

Bharadwaja Rangavajhala…….   పాదరస గాత్రులు… టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ఏస్కో కోకోకోలా దగ్గర నుంచి నిన్నమెన్నటి ఊ అంటావా మావా వరకూ కూడానూ … మరి ఆ యొక్క ఐటమ్‌సాంగ్స్ కిక్కే వేరు.

ఈ కిక్కులో సగం మాత్రమే నిజానికి సగం కన్నా తక్కువే డాన్సర్ కంట్రిబ్యూషన్ అయితే మిగతా అంతా కూడానూ … పాదరసగాత్రంతో హస్కీగా ఈ పాటలు పాడే నేపధ్యగాయనీమణులకే చెందుతుంది. చెందాలి కూడానూ… అంచేత ఈ పాదరసగాత్రుల సంగతులు ఓ పాలి చూసేద్దారి …

ఐటమ్‌సాంగ్స్ అంటే… చిలిపి కవ్వింపు గీతాలనే నిఘంటు అర్ధం ఉందట … నాకు పెద్దగా తెల్దు. ఆడియన్స్ ఏ వయసువారైనా వాళ్లతో డాన్స్ చేయించడమే వాటి పరమావధి. ముందే బయటకు వచ్చే ఆడియోలో సినిమాకు క్రేజ్ తెచ్చేవి ఈ మాస్‌బీట్ ఐటమ్ సాంగ్సే.

Ads

తమ పెక్యూలియర్ వాయిస్ తో జనాన్ని సినిమా చూడ్డానికి సమాయత్త పరుస్తారు ఐటమ్ సాంగ్ సింగర్స్. అలా ఎట్రాక్ట్ చేసిన ఎర్లీ టాలీవుడ్ వాయిస్ జమునారాణి. ఆవిడ పాడిన చాలా పాటలు కుంచెం ఆ రోజుల్నాటి భాషలో చెప్పాలంటే … కైపుగా ఉండును. అందానికి అందం నేనే .. చివరకు మిగిలేది లో పాటతో సహా అనేక పాటలు …. కొంచెం … కేర్‌లెస్ నెస్ దీన్నే బరితెగింపు అని కూడా అనడం కద్దు. అది నిండిన వాయిస్‌తో వచ్చే ఐటమ్‌సాంగ్స్ సక్సస్ వెనుక ఫిమేల్ సింగర్స్ పాత్ర చాలా ఉంటుంది.

స్వేచ్చ కోరుకునేవారిని ఈ తరహా గీతాలు అబ్బురపరుస్తాయి. ప్రేక్షకుల మనసులు పురివిప్పిన నెమలిగా ఆడాల మన పాట ఇంటే అనేది కాన్సెప్టేమో అనిపిస్తుంది… అప్పుడప్పుడూ… ఈ తరహా సాంగ్స్ పాడడం అంత వీజీ కాదు.

వెస్ట్రన్ టచ్‌లో ఫోక్ టచ్ మిస్ కాకుండా డిఫరెంట్‌గా ట్యూన్ అయ్యే ఐటమ్‌సాంగ్ పాడే సింగర్లు చాలా శ్రమ తీసుకుంటారు. అప్పుడే అవి జనాలకు కనెక్ట్ అవుతాయి. మెయిన్ స్ట్రీమ్ సింగర్స్ కూడా ఐటమ్ సాంగ్స్ అదరగొట్టేసిన సందర్భాలు అనేకం.

ఆరాధనలో ఐటమ్ సాంగ్ జానకితో పాడించారు రాజేశ్వరరావు. ఆడదాని ఓర చూపులో… పాట అది … ఆ తర్వాత అనేకం పాడారావిడ … మెయిన్‌గా ఐటమ్‌సాంగ్ పాడే సింగర్స్ వాయిస్‌లో పొగరు… విగరు చాలా బలంగా పలకాలి. దీనికి కుంచెం ఓ తరహా ధిక్కార స్వరం కావాల… నిజానికి ఈ పాటల రచనలో ఒక తరహా విమన్ లిబ్ కూడా కనిపిస్తుంది.

పురుషుల దౌర్బల్యం మీద సెటైర్లూ ఉంటాయి. దేవదాసులో వినిపించే క్షేత్రయ్య పదం… ఇంత తెలసియుండి ఈ గుణమేలరా అన్నట్టు సాగుతాయి. అందువలనే ఆ పాటలు రక్తికడతాయి. ఆ వెటకారం అద్భుతంగా పలికే గాత్రం ఎల్.ఆర్.ఈశ్వరిది… గుడి ఎనక నా సామి…గుర్రమెక్కి కూర్చున్నాడు… ఇదాలోకం…

ఆ టెంపర్ మెంట్ మళ్లీ రీసెంట్ టైమ్స్ లో సింగర్ ప్రియ దగ్గర కనిపిస్తోంది. కింగ్ లో ఏ టు జడ్, మల్లన్నలో మియ్యావ్ మియ్యావ్ పిల్లీ లాంటి పాటలతో కుర్రాళ్లకు కిర్రెక్కించిన ఈ యువగాత్రం ఆ మధ్య బిజినెస్ మేన్ లో వియ్ వాంట్ బ్యాడ్ బాయెస్ అంటూ చాలా హడావిడి చేసింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా పాడాలంటే…లాంగ్వేజ్ గురించి అంతో ఇంతో స్పృహ ఉండి తీరాలి. మరి ఏం కసర్తతు చేస్తున్నారోగానీ… జనంతో మాత్రం డాన్స్ చేయించేస్తున్నారు.

వియ్ వాంట్ బాడ్ బాయ్స్… అనే కీర్తన నాకు బాగా నచ్చిందప్పట్లో … ఐటమ్ తరహా పాటలు పాడి మెప్పించిన గాయని విజయ లక్ష్మి. మాయదారి సిన్నోడు అంటూ దేవదాసులో ఇలియానా డాన్స్ చేసిన ఈ పాట ఆ టైమ్‌లో ఓ ఊపు ఊపింది. ఈ పాట పాడింది విజయలక్ష్మే. ఇది ఎల్.ఆర్.ఈశ్వరి పాట. మెలోడీ పాటల రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన సినారే సాహిత్యం ఇది. సినిమా పేరు అమ్మమాట.

అలనాటి ఐటమ్ గాయని ఎల్.ఆర్.ఈశ్వరి పాటల్ని అలవోకగా పాడేసే విజయలక్ష్మి స్వరంలో వేడి పాటలు బాగా రక్తి కడతాయి. యమగోల మళ్లీ మొదలైందిలో కూడా ఓ రీమిక్స్ సాంగ్‌ను సూపర్ ఎమోషనల్‌గా పాడేసింది విజయలక్ష్మి. బొబ్బిలిపులి కోసం రాఘవులు స్వరం కట్టిన ఏ సుబ్బారావో పాటను ఈ సినిమాలో వాడారు. తను తప్ప ఇంకెవరూ ఈ పాటకు న్యాయం చేయలేరు అన్న రేంజ్‌లో పాడేసి రక్తి కట్టించారు విజయలక్ష్మి.

స్వరంలో భాస్వరం ఉన్న వారే ఐటమ్ సాంగ్స్ పాడగలరు అని అప్పుడెప్పుడో ఆరుద్ర అన్నారు. ఎల్‌ఆర్ ఈశ్వరి గురించి ఆయన అన్న మాటలు ఐటమ్ సాంగ్స్ పాడుతున్న గాయనీమణులు అందరికీ వర్తిస్తాయి. నిజానికి ఎల్.ఆర్.ఈశ్వరితో కల్సి పాడడం మేల్ సింగర్స్ కు ఛాలెంజే. ఘంటసాల మాస్టారుకూ నాలుగైదు సార్లు ఈ గొడవ తప్పింది కాదు. అందులో ఆత్రేయ గారి రచన లేలేలే నా రాజా ఒకటి.

ఐటమ్ సింగర్‌గా స్టార్ వాల్యూ సాధించిన తొలి గాయని ఎల్.ఆర్. ఈశ్వరి. అద్దరేతిరికాడ అత్తమ్మ నాకు లాంటి పాటల్లో విచిత్రంగా వినిపించిన ఈశ్వరి గాత్రం ఆ తర్వాత తెలుగులో కౌబాయ్, క్రైమ్ సినిమాల యుగంలో రెచ్చిపోయింది. నిజానికి ఐటమ్ సాంగ్స్ హవా ప్రారంభమైంది కూడా అప్పుడే.

కౌబాయ్ , క్రైమ్ సినిమాల్లో మస్ట్‌గా ఐటమ్‌సాంగ్ ఉండేది. జ్యోతిలక్ష్మి డాన్స్.. సత్యం సంగీతం.. ఆరుద్ర రచన లేకుండా క్రైమ్ సినిమా ఉండేది కాదు. ఏస్కో కోకోకోలా పాట దగ్గర నుంచి అనేక పాటలు ఈ కాంబినేషన్‌లో వచ్చి ఒక ఊపు ఊపాయి. అమాయకుడులో పట్నంలో షాలిబండ పాటలో కుషాయ్ కుషాయ్ అనే బిట్ ఈశ్వరి కంఠంలో చాలా టెంప్టింగ్‌గా వినిపిస్తుంది.

ఎల్‌ఆర్ ఈశ్వరి పాటల్లో సూపర్‌డూపర్ హిట్ కొట్టిన పాట దేవుడు చేసిన మనుషులు సినిమాలో మసకమసక చీకటిలో. హృద్యమైన సంగీతానికి కేరాఫ్ అడ్రస్ రమేష్‌నాయుడు ఈ ట్యూన్ చేయడం ఓ విశేషం. దాన్ని కలకాలం నిల్చిపోయేలా గానం చేయడం ఎల్‌ఆర్ ఈశ్వరి ప్రతిభ.

ఎల్‌ఆర్ ఈశ్వరి తరహా గాత్రం హిందీలో వినిపించి కుర్రాళ్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆ స్వరం పేరు ఉషా ఊతుప్. పాప్, జాజ్, ప్లేబ్యాక్ ఏదైనా సరే తనదైన శైలిలో అదరగొట్టే సింగర్ ఉషా ఊతుప్. సిక్స్‌టీస్‌లోనే గళం విప్పిన ఉష ఎయిటీస్‌లో బాగా పాపులర్ అయ్యారు. ఉషా ఊతుప్ గాత్రం ఉవ్వెత్తున ఎగసిన కడలి కెరటం అలా ఫ్రీజ్ అయి ఏ క్షణంలో పడుతుందో తెలియనట్టు సాగుతుంది. తెలుగులో ఇళయరాజా కీచురాళ్లులో ఓ సూపర్ సాంగ్ ఆలపించారు ఉష.

ఎల్.ఈశ్వరి పాటలు అనేకం ఆ తర్వాత రోజుల్లో రీమిక్స్ అయ్యాయి. వాటిలో మసకమసక చీకటిలో పాట గాయని స్మితను తెలుగువారికి పరిచయం చేయడమే కాదు. ఓ ప్రత్యేక స్థానాన్నిచ్చింది. ఆ మధ్య ఎమ్‌ఎస్ రాజు సినిమా ఆటలో ఏలఏల అంటూ ఐటమ్ సాంగ్ తరహాలో స్మిత పాడిన పాట సూపర్‌హిట్ అయింది. ఇందులో స్మిత స్వయంగా నర్తించడం విశేషం.

స్మితకన్నా ముందే తెలుగులో పాప్ ఆల్బమ్ చేసిన గాయని మాల్గాడి శుభ. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చినా… అంటూ శుభ పాటలతో వచ్చిన ఆల్బమ్ హాట్ కేక్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చాక సీన్ మళ్లీ మారింది. ఐటమ్ సాంగ్స్‌కు ప్రత్యేక గాత్రాలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అలా వచ్చిన గాత్రాల్లో మాలతి ఒకరు. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ కోసం మమతామోహన్ దాస్ తో ఆకలేస్తే అని పాడించారు.

రీసెంట్‌గా మోతెక్కించిన ఐటమ్ సాంగ్ పువ్వాయ్ పువ్వాయంటాడు ఆటో అప్పారావు అంటూ దూకుడు సినిమాలో పార్వతీ మెల్డన్ నర్తించిన పాట. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట గానం చేసింది రమ్య. శ్రీను వైట్ల… మహేష్ బాబు కాంబినేషన్ లో మళ్లీ వచ్చిన ఆగడులోనూ ఈ తరహా పాటొకటి ఉంది. ఈ పాటను శృతి హసనే పాడేయడం విశేషం.

ఐటమ్ సాంగ్ డిజైనింగ్ కాస్త డిఫరెంట్ వ్యవహారమే. ఆడియన్స్ లో మాత్రం… ఐటమ్ డాన్సర్‌లే కాదు…. ఐటమ్ సింగర్స్ కూడా పాపులర్రే. ఐటమ్ సాంగ్స్ లో కూడా ఎవర్ గ్రీన్ ఉండబట్టే… రీమిక్స్ అయినప్పుడు అంత క్రేజ్. ఇవీ ఐటమ్ సింగర్స్ గురించి నా నాలుగు మాటలు … ఇక మైక్ మీకిచ్చేస్తున్నాను బాబో …. మరి మీ జ్ఞాపకాలను సిద్దాంతాలనూ పంచుకోండి … ఉంటాను మరి ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions