Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒళ్లమ్ముకుంటేనేం..? గుండెలో తడి ఉండదా..? దానికీ భావోద్వేగాలుండవా..?

October 18, 2024 by M S R

.

మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు , ఆ సినిమాల కధాంశాలు , పాత్రలు , ఆ పాత్రల్లోని నటులు , సంగీతసాహిత్యాలు , దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి . మధురానుభూతిని కలిగిస్తాయి . నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ మల్లెపూవు సినిమా . It’s a musical , literary , emotional classic .

ముఖ్యంగా ఈ సినిమాలో నా మనసులో నిలిచిపోయిన పాత్ర లక్ష్మి వేసిన వేశ్య పాత్ర . చాలా బాగా నటించింది . వేశ్యగా విటులకు గాలం వేసే నటన ఎంత అద్భుతంగా నటించిందో అంత కన్నా అద్భుతంగా కవికి భక్తురాలిగా నటించింది . ఆ తర్వాత కవి వేణు పాత్రలో శోభన్ బాబు . చక్కగా నటించారు . కాస్త ఈ పాత్రకు దగ్గరగా ఉండే పాత్రనే చెల్లెలి కాపురంలో నటించారు . తర్వాత జయసుధ పాత్ర . కవికి ప్రేయసిగా చలాకీగా , తర్వాత మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోవలసి వచ్చి మాజీ ప్రియుని ఈసడింపుకు వేదన పడే పాత్ర .

Ads

ఈ మూడు ప్రధాన పాత్రల తర్వాత మనసుకు హత్తుకుపోయే పాత్రలు మాలిష్ రామదాసు , తోటి వేశ్య పాత్ర . రామదాసు పాత్రలో రావు గోపాలరావు , తోటి వేశ్య పాత్రలో కె విజయ మనసున్న మనుషులుగా బాగా నటించారు . ఇతర పాత్రల్లో శ్రీధర్ , గిరిబాబు , నిర్మలమ్మ , మాడా , కె వి చలం , అల్లు రామలింగయ్య తదితరులు నటించారు .

ఈ సినిమాలో కవి సమ్మేళనంలో ఆరుద్ర , వేటూరి కాసేపు తళుక్కుమంటారు . ఓ చిన్న పాత్రలో , సినిమాకు కీలక పాత్రలో మా నరసరావుపేట కళాకారులు A L నారాయణ కనిపిస్తారు . 1977/78 వచ్చేటప్పటికి ఆయన ఎక్కువగా కనిపించలేదు . ఇందులో బిచ్చగాడిగా రైలు ఢీకొట్టడం వలన చనిపోతారు . అందరూ కవే చనిపోయాడని అనుకుంటారు .

ఎప్పుడో 1957 లో వచ్చిన ప్యాసా అనే హిందీ సినిమాకు రీమేక్ మన మల్లెపూవు సినిమా . హిందీ సినిమాలో గురుదత్ , వహీదా , మాలాసిన్హా నటించారు . పండిత పామరులను అలరింపచేసింది . ఆ సినిమాకు ఎలాంటి భంగం కలిగించకుండా వి మధుసూధనరావు దర్శకత్వం వహించారని చెప్పవచ్చు . కోదండరామిరెడ్డి ఒక అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసారు . గురుదత్తుతో శోభన్ బాబుని పోల్చలేం . కానీ వహీదా , మాలా సిన్హాల కన్నా లక్ష్మి , జయసుధలే బాగా చేసారు .

ఇంక చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చక్రవర్తి సంగీతం . ఆ సంగీతానికి అమరత్వాన్ని ఇచ్చింది ఆరుద్ర , వేటూరి , వీటూరి సాహిత్యం . ఈరోజుకీ ఈ సినిమాలో పాటలు ఆనాటి రస హృదయులను పలకరిస్తూనే ఉంటాయి . నువు వస్తావని బృందావని ఆశగా చూసేనయా కృష్ణయా పాట . ఆ పాటలో పండరీబాయి , లక్ష్మిల నటన మరచిపోలేం .

చిన్న మాటా ఒక చిన్న మాట పాటలో సాహిత్యం , ఆ పాటలో లక్ష్మి నటన తప్పక ఆస్వాదించవలసిందే . ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది పాట మరో గొప్ప పాట . ఆ తర్వాత శోభన్ బాబు , జయసుధల రెండు డ్యూయెట్లు కూడా అందంగా ఉంటాయి . బహుశా కాశ్మీర్లో తీసారేమో ! వీటూరి వారి చకచకసాగే చక్కని బుల్లెమ్మ , వేటూరి వారి ఓహో లలితా నా ప్రేమ కవితా పాటల్లో చక్కటి సాహిత్యాన్ని ఉరికించారు ఇద్దరు కవులు . వేటూరి వారిదే మరో పాట మల్లెపూవులా వసంతం మా తోటకి వచ్చింది బాగుంటుంది .

జుంబాంబ జుంబాంబ మాలిష్ పాటను ఆరుద్ర వ్రాస్తే చక్రవర్తే పాడారు . బాగా హిట్టయిన పాట . ఎవ్వరో వీరెవ్వరో అనే వేటూరి వారి పాట మానవుడు-దానవుడు సినిమాలోని ఎవరు వీరు ఎవరు వీరు పాటను గుర్తుకు తెస్తుంది . మల్లెపూవులోని ఈ పాట ప్యాసాలో కూడా ఉంది . వేటూరి వారిదే మరో పాట ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని గుండెకు హత్తుకుపోతుంది . ఆత్రేయ గారి క్లైమాక్స్ పాట బ్రతికున్నా చచ్చినట్టే ఈ సంఘంలో అనే పాటలో ఇది మహోదయం అంటూ కాస్త ఎర్ర వాసనను కూడా తగిలించారు . ఈ పాటను వి మధుసూధనరావు బాగా చిత్రీకరించారు .

మనసు సినిమా ఇది . కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండుతాయి . 46 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా పండిత పామరులను , రస హృదయులను అలరించటమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . విశాఖపట్నంలో వంద రోజులు ఆడింది . ఈతరంలో చూడని రస హృదయులు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . సినిమా అంతా చూసే సమయం లేకపోతే పాటల వరకయినా తప్పక చూడండి . మీ మనసులను మీటుతాయి . An unmissable musical , emotional , literary classic . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions