ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు…
అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ మారలేదు కాబట్టి… మారలేడు కాబట్టి, మారడు కాబట్టి… సదరు నోట్ ఏం చెబుతున్నదయ్యా అంటే… పార్టీ రాబోయే ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా కొణిదెల నాగబాబు, అంబటిరాయుడు, పృథ్వి, జానీ, సాగర్, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను నియమించారట…
ఎవరు వీళ్లు..? అత్యంత చంచల ఆ రాయుడిని వదిలేస్తే మిగతావాళ్లు పక్కా జబర్దస్త్ బ్యాచ్… పోనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో… చివరకు తనకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లా మిగిలింది..? వాళ్లంటే చిన్నబుచ్చడం కాదు, వాళ్ల రాజకీయ అభిప్రాయాల మీద ఎవరికీ వ్యతిరేకత ఉండనక్కర్లేదు… కానీ వాళ్లకు కొన్ని పరిమితులున్నయ్… ప్రజెంట్ పాలిటిక్స్‌లో వాళ్ల స్టేటస్ ఏమిటి..? ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు, రాజకీయ కార్యాచరణ మీద వాళ్ల అవగాహన పరిధి ఎంత..?
Ads
రామగోపాలవర్మ తన సినిమాల్లో పవన్ కల్యాణ్‌ను ఓ కామెడీ కేరక్టర్‌గా పదే పదే చూపిస్తే… వ్యక్తుల్ని ఇంత చిల్లరగా టార్గెట్ చేసే వర్మ నీచమైన అభిరుచి మీద మనకు చిరాకెత్తుతుంది… కానీ మరో కోణంలో ఆలోచిస్తే… వర్మ క్రూడ్‌గా చెబుతున్నాడు గానీ తప్పేం చెప్పాడు అనిపిస్తుంది… ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ తప్ప మరో నాయకుడు కనిపించడు, పార్టీ తెర మీద, వేదికల మీద… ఓ స్థిరమైన సిద్ధాంతం, బాట, ఆచరణ, ఆదర్శం వంటివేవీ కనిపించవు…
అసలు పార్టీకి ఓ స్థిరమైన సింబల్ లేదు… పార్టీ అంటే అదీ ఓ సినిమా ప్రాజెక్టే అన్నట్టుగా… కార్యకర్తలు అంటే అభిమానులు అన్నట్టుగా… ఏ త్రివిక్రమ్ శ్రీనివాసో రాసిన నాలుగు మాటలే పార్టీ రాజ్యాంగంగా, అలాంటి స్క్రీన్ ప్లే మాత్రమే పార్టీ కార్యాచరణగా… ఎలాంటి సంస్థాగత నిర్మాణం లేకుండా సాగుతున్న రాజకీయ పార్టీ ఇదేనేమో బహుశా… జబర్దస్త్ బాపతు పంచ్ డైలాగులే రాజకీయ ప్రసంగాలు అవుతాయన్నమాట ఇకపై కూడా..!
ఏపీ పాలిటిక్స్‌లో ఓ విషాదం ఏమిటంటే… రెండు ప్రధాన పార్టీల నడుమ పెద్ద తేడా ఏమీ లేదు… ఆ రెండు కులాలు వేర్వేరు, అంతే… ఆ నాయకులు ఇటు, ఈ నాయకులు ఇటు జంపుతూ ఉంటారు… మూడో పార్టీ, మూడో నాయకుడు కనిపించని దురవస్థ… మూడో పార్టీగా కాస్త మంచి వోట్లే తెచ్చుకున్న జనసేనను చూస్తే ఇదీ సిట్యుయేషన్… టీడీపీకి బీజేపీ కావాలి, కాబట్టి పవన్ కొన్నాళ్లు బీజేపీ క్యాంపులో ఉంటాడు, టీడీపీకి కావాలి కాబట్టి తనకూ బీజేపీ కావాలి, అంతే…
బీజేపీకి కూడా ఇక్కడ ఏ దిక్కూ లేదు, ఓ నాయకుడంటూ లేడు… టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తే నాలుగు వోట్లు, నాలుగు సీట్లు… కాకపోతే కూటమితో ఎందుకు కలిసింది, దాని వెనుక మార్మిక ఎత్తుగడలేమిటి అనేది ఇక్కడ అప్రస్తుతం… ‘గ్లాసు పగులుద్ది, పగిలితేనే పదునుగా ఉంటది’ బాపతు సినిమా డైలాగుల స్థాయి నుంచి ఈ పార్టీ ఎప్పుడు ఎదుగుతుందనేది పెద్దగా చర్చనీయాంశమేమీ కాదు… కాకపోతే తెలివైన ఏపీ రాజకీయ రంగం ఒక్క ఆల్టర్నేటివ్‌ను తయారు చేసుకోలేకపోవడం అసలైన ట్రాజెడీ…
హఠాత్తుగా కాంగ్రెస్‌కు షర్మిల కావాలి… తమ కుటుంబాన్ని తొక్కీ తొక్కీ నారతీసిన కాంగ్రెస్ అంటే ఆమెకు ఈ హఠాత్ ప్రేమ ఏమిటో తెలియదు, ఆమె బీజేపీని తిడుతుంది, బీజేపీకి జనసేన కావాలి, జనసేనకు చిరంజీవి 5 కోట్లు ఇస్తాడు, అదే చిరంజీవి ఇంకా మా పార్టీలోనే ఉన్నాడు సుమా అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు నొక్కి వక్కాణిస్తాడు, ఆయన నేనెవరితోనూ లేను మొర్రో అంటున్నా సరే, పట్టుకువేలాడే దరిద్రం కాంగ్రెస్‌కు దేనికో మరి..!!
Share this Article