ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేరుగా షర్మిలతోనే మాట్లాడి, పనిలోపనిగా వీలైతే నాలుగు సలహాలు కూడా ఇచ్చేసి, సమాచారాన్ని నిర్ధారించుకుని మరీ ప్రచురిస్తాడు కాబట్టి… ఈ వార్త కూడా నిజమే అనుకుందాం… ఎక్స్‌క్లూజివ్ స్టోరీ కాబట్టి అభినందిద్దాం… సాక్షి ఎలాగూ రాయదు, ఈనాడుకు చేతకాదు… సరే, వార్త ఏమిటంటే..?
‘‘మొన్నటి ఎన్నికల్లో దారుణమైన ఓటమితో జగన్ నేల మీదకు దిగొచ్చాడు… బీజేపీ దూరమైపోయింది… కర్నాటక, తెలంగాణల్లో తన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి… కేంద్రంలో, రాష్ట్రంలోనూ తన వ్యతిరేక కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి… ఇక తప్పనిసరై కాంగ్రెస్ పంచన చేరబోతున్నాడు… ఓ జాతీయ పార్టీ సపోర్ట్ కావాలిప్పుడు తనకు… కానీ చెల్లె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలు… ఆమెతో ఆస్తుల తగాదాలున్నాయి కాబట్టి, ఆమె తనకు వ్యతిరేకంగానే పోరాడుతున్నది కాబట్టి, ఆమెతో సయోధ్య అవసరం… అందుకని ఇన్నాళ్లూ పెడసరంగా ఉన్న ఆయన ఇక విధిలేక, దిక్కుతోచక, దిగివచ్చి చెల్లెతో ఆస్తుల పంపకానికి సరేనన్నాడు… తనే సంప్రదింపులు చేస్తున్నాడు… దాదాపు ఓ కొలిక్కి వచ్చింది…’’
Ads
ఇదేనండీ వార్త సారాంశం… జగన్ మీద ఎంత ద్వేషముంటే మాత్రం… దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది వంటి వాక్యాలేమిటో, ఆ భాష ఏమిటో, ఆ రాత ఏమిటో… పదే పదే పాత్రికేయ నీతిసూత్రాలు వల్లించే ఆంధ్రజ్యోతి చెప్పకపోవచ్చుగాక… కానీ సగటు పాత్రికేయుడికి ఆ రచనశైలి ఏవగింపు… ఓసోస్, సాక్షి రాయడం లేదా అంటారా..? అది నీతిమాలినది, దానికి ఎలాగూ సంస్కారం లేదు, సో, నీదీ ఆ బాటేనా..? అదే అనుకోవాలా..?
విషయానికొస్తే… జగన్‌కు ఇప్పుడు కష్టకాలమే, నిజమే… రాజకీయాల్లో అవసరాన్ని బట్టి రాజీలు, రాయబేరాలు కూడా సహజమే… కానీ జగన్ తత్వం తెలిసినవాళ్లలో కొన్ని సందేహాలుంటాయి… జగన్‌కు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్యులతోనే నేరుగా సంప్రదింపులు చేసిపెట్టగలిగే నేతలతో సత్సంబంధాలున్నాయి… అధికారం లేకపోవచ్చుగాక, బోలెడంత సాధనసంపత్తి ఉంది… కాంగ్రెస్‌కు ప్రస్తుతం అహ్మద్ పటేల్ స్థాయిలో ఉన్న డీకే శివకుమార్‌తోనూ జగన్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి…
సో, షర్మిల మాత్రమే తనను కాంగ్రెస్ తీరానికి చేరుస్తుందని జగన్ నమ్ముతాడనేది సందేహాస్పదం… కానీ తను కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి షర్మిల అడ్డుగా నిలుస్తుందీ అనుకుంటే… ఆమెతో కాంగ్రెస్‌కు ఏపీలో వచ్చిన ఫాయిదా జీరో కాబట్టి, ఆమె మాట, ఆమె అంగీకారం నిర్ణయాత్మకం అనుకోవడానికీ లేదు… సరే, జగన్ గడగడా వణికిపోతూ షర్మిలతో రాయబేరాలకు, రాజీబేరాలకు దిగివచ్చాడనేదే నిజమని అనుకుంటే..?
వాట్ నెక్స్ట్..? యూపీఏలో చేరిపోతాడా..? లేక పార్టీ నిమజ్జనం అడిగితే చేసేస్తాడా..? చేయడు, జగన్ ధోరణిని బట్టి నిమజ్జనం సవాలే లేదు..! తనను ఎన్నిరకాలుగా సోనియా కాంగ్రెస్ వేధించిందో, ఎలా జైలుపాలు చేసిందో తను మరిచిపోతాడా..? ఒకవేళ కాంగ్రెస్‌తో ప్రజారాజ్యంలాగే కలిసిపోతే జనం క్షమిస్తారా..? తరువాత కాంగ్రెస్ తనను మందలో ఒకడిగా చూస్తుంది తప్ప ప్రయారిటీ ఇస్తుందా..? సో, యూపీఏలో చేరడం, అవసరార్థం స్నేహం చేయడం ఓ పరిష్కారం… అదీ పైపైన నటనే…
మరి ఆమె ఏం చేయాలి..? ఆ ఆస్తుల కోసమే కదా, తెలంగాణను ఉద్దరించాలని సపరేట్ పార్టీ పెట్టి, ఎవరూ పట్టించుకోక, ఎవరూ నమ్మక, చివరకు ఆ పార్టీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసి, ఏకంగా ఏపీలో పోరాటం అని మొదలుపెట్టింది… ఇప్పుడిక ఆస్తులు వచ్చేస్తే ఇక రాజకీయాల నుంచి విరమణేనా..? ‘అన్నయ్య సన్నిధి, అదే నాకు పెన్నిధి’ అని మళ్లీ సరికొత్తగా ఆ పాత బుల్లెట్ పాటే అందుకుని జగన్ పార్టీలో ముఖ్యనేత అవుతుందా..? ఇంకా నాకు ఈ ప్రజాసేవలు, పార్టీసేవలు ఎందుకులే అనుకుని, తల్లితో కలిసి కేవలం దేవుడి సేవకు పరిమితం అయిపోతుందా..? బాబాయ్ హత్య కేసు పోరాటం నుంచి వైదొలుగుతుందా..? రాజన్న రాజ్యం కలల్ని వదిలేస్తుందా..? ఆంధ్రజ్యోతి చాలా ప్రశ్నల్ని లేవనెత్తింది సుమీ..!!
Share this Article