నిజానికి ఏబీఎన్ చానెల్ న్యూస్ డిబేట్ల సరళి, తీసుకునే పొలిటికల్ లైన్, ప్రతి వార్తకూ పార్టీ కలర్ పూసే ధోరణి, లోకాన్ని ఒక్క పార్టీ కోణంలో మాత్రమే చూసే వైఖరి మీద తటస్థ ప్రేక్షకులకు కూడా చాలా అభ్యంతరాలున్నయ్… సేమ్, ఆంధ్రజ్యోతి పత్రిక… అయితే నిన్న వైసీపీ ఎంపీ మాధవ్ ‘‘అంగప్రదర్శన’’ ఎపిసోడ్‌లో ఒక తెలుగుదేశం గొంతుగానే కాస్త అతిగా విరుచుకుపడినా సరే… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తమకు మాత్రమే ఆ దమ్మున్నట్టు చెప్పుకోగలిగింది… ఫాఫం, అంత దట్టమైన పచ్చరంగు పూసుకుని తిరిగే టీవీ5 కూడా వెలవెలాబోెయింది ఎందుకో మరి..?!
మింగలేక, కక్కలేక… ఆ వెగటు బాగోతంపై ఏమీ రాయలేక… కడుపు చించుకుంటే కాళ్లపైనే పార్టీ పరువు, బాస్ పరువు వాంతి చేసుకునేే ప్రమాదం… దాంతో ఒక పత్రికగా సాక్షి మరోసారి సిగ్గుతో తలదించుకున్నట్టయింది… పోనీ, అది ఫేక్ వీడియో అనుకుందాం… మరి ఎదురుదాడి ఏది..? ఎప్పటిలాగే చప్పిడి పథ్యం తిండిలా ఏదేదో రాసి, ఈనాడు తన ముసలితనాన్ని ఇంకోసారి ప్రదర్శించుకుంది… కొత్తగూడెం వనమా రాఘవ మీద విరుచుకుపడ్డ రీతిలో మాధవ్ జోలికి ఎందుకు పోలేకపోయింది ఈనాడు..?
ఎప్పుడూ వైసీపీ డప్పు కొట్టే ఓ ప్రముఖ వెబ్‌సైట్ కూడా మాధవ్ ఎపిసోడ్‌లో జగన్‌ను తప్పుపడుతూ మర్యాదగానే ఓ ఆర్టికల్ రాసింది… వైసీపీ మీద ఈగవాలితే చాలు కస్సున లేచి, బూతులందుకునే వీరాభిమానులు కూడా నిన్న సైలెంట్… కాకపోతే ఆంధ్రజ్యోతి చేసిన తప్పు ఒకటుంది… మాధవ్ ఎపిసోడ్‌ను అక్కడికే పరిమితం చేయకుండా… అవంతి, అంబటి, పృథ్విలనూ లాక్కొచ్చి… వైసీపీ నేతలంతా అదే టైపు అని ముద్రవేసి, పొలిటికల్ లబ్ధి కోసం ప్రయత్నించింది… అది తప్పు… జర్నలిస్టుగా గాకుండా టీడీపీ పొలిటిషియన్‌గా వ్యవహరించింది…
Ads
నిజం… తన ఘనకార్యపు వీడియో బయటపడగానే మీడియా ముందుకొచ్చిన మాధవ్ ఏదేదో అరిచాడు… రాధాకృష్ణను తిట్టాడు… కులాన్ని తిట్టాడు… తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థమైందా అనేది డౌటు… ఆ భాషేమిటి..? ఆ తిట్లేమిటి..? జిమ్ చేస్తుంటే వీడియో తీశారు అంటాడు… ఈ నగ్నప్రదర్శన సంగతేమిటీ అంటే టీడీపీ సోషల్ మీడియా బాధ్యుల్ని తిట్టిపోశాడు… మార్ఫింగ్ వీడియో అంటాడు… ఫోరెన్సిక్ పరీక్ష అంటాడు… ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిల్స్ అంటాడు…
కోర్టు ఏం చేయాలి..? వెంటనే విచారణకు స్వీకరించి, సీన్ రీక్రియేషన్‌కు ఆదేశించాలా..? తెలుగుదేశం పార్టీని, ఆంధ్రజ్యోతిని తప్పుపట్టాలా..? ఫోరెన్సిక్ పరీక్ష అంటాడు… నిష్పక్షపాత దర్యాప్తు, విచారణ కోసం చెన్నై, బెంగుళూరు పోలీసులకు అప్పగిద్దామా..? ఏపీ పోలీసుల సంగతి తెలుసు కదా… అంతెందుకు మాధవ్ గతంలో తనే పోలీస్ కదా…!! ఒక వ్యక్తిగా మాధవ్ ఏం బాగోతాలు ఆడుతున్నాడో వదిలేద్దాం…. కానీ ఒక ఎంపీగా, ఒక పార్టీ నేతగా తన ప్రతి కదలికకూ ఓ లెక్క ఉండాలి… ఓ విలువ ఉండాలి… జగన్ మొహం చూసి, మాధవ్‌కు వోట్లేసిన ప్రజలు ఏమనుకోవాలి ఇప్పుడు..?
ఇప్పుడే ఇంత దారుణంగా ఉందంటే… ఇక ఖాకీ సర్వీసులో ఉన్నప్పుడు..? ఎందరిని ఎలా వేధించేవాడు..? పదికిపైగా ప్రైవేటు కేసులట… పలుమార్లు వీఆర్‌కు పంపించారట… చెప్పింది వినకుంటే దారుణంగా కొట్టేవాడట… ఎస్, ఆ ఎంపీ స్థానానికి తన ఎంపిక పట్ల జగన్ ఫీలింగ్ ఏమిటిప్పుడు..? మాధవ్ ప్రతి మాట, ప్రతి అడుగు పార్టీ ఇజ్జత్ తీసింది, తీస్తోంది, తీస్తుంది… ఏపీ పాలిటిక్స్ అంటేనే బూతులు… మొన్న ఒకావిడ ప్రెస్‌మీట్‌లో టీడీపీ నాయకురాలిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నభూతో… సేమ్, రోత… ఇక మాధవ్ ఎపిసోడ్‌తో చివరకు తెలుగు రాజకీయ స్థాయి అంగప్రదర్శనల దాకా పోయింది… టీడీపీ, వైసీపీ ఏపీ రాజకీయాల స్థాయిని ఇంకా ఏ కొత్త ఎత్తులకు తీసుకుపోతాయో…!!
Share this Article