Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్ కూడా పాన్ ఇండియా టైప్… రాజ్యసభ ఎంపికలో విశాల దృక్పథం…

May 17, 2022 by M S R

జగన్ ఏమీ తెలియనివాడు కాదు కదా… ఉండే ఉంటుంది, ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది… తెలంగాణ బీసీ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు పంపించాలనే నిర్ణయం వెనుక తనకు, కృష్ణయ్యకు మాత్రమే తెలిసిన ఏదో సమీకరణం ఉండే ఉంటుంది… ఏమో, కృష్ణయ్యకు కూడా తెలిసినా తెలియకపోయినా జగన్ ఏదో గుప్త ప్రణాళికతోనే, అనగా సీక్రెట్ ప్లాన్‌తోనే ఈ ఎంపిక చేసి ఉంటాడు కదా… ఎటొచ్చీ ఆ సమీకరణం ఏమిటనేదే ఫాఫం, ఇప్పుడెవరికీ అంతుపట్టడం లేదు…

అంతుపట్టకపోతే నష్టమేముంది..? ఏమీ ఉండదు… రాజ్యసభకు ఎవరిని పంపించాలనేది పార్టీ అధినేత ఇష్టం… వైసీపీ జగన్ సొంత పార్టీ… ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోగలడు… పార్టీ హయ్యరార్కీలో ఒకటి నుంచి వంద స్థానాల్లోనూ జగనే… సో, కృష్ణయ్య సెలక్షన్ వెనుక ఈక్వేషన్ ఏమిటనే ప్రశ్న ఆయనకు ఎదురయ్యే సవాలే లేదు… తన రాజకీయ అడుగుల్లో కన్విన్సింగ్ కారణాలేమిటో ప్రజలకు తెలియాలి కదా అనేది అర్థం లేని ప్రశ్న… ప్రజలకు అన్నీ చెప్పి చేయాలా ఏం..? ప్రజలకు అన్నీ తెలియాలా..?!

కృష్ణయ్య గతంలో ఎప్పుడూ వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడింది లేదు, ఆయనకు అసలు వైసీపీతో సంబంధమే లేదు అంటారా..? సో వాట్..? సభ్యత్వం ఇప్పుడు తీసుకుంటాడు, ఏపీలో ఉపయోగపడకపోతేనేం..? షర్మిల పార్టీకి తెలంగాణలో ఉపయోగపడే చాన్స్ లేదా ఏం..?

కృష్ణయ్య అసలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాదు… తెలంగాణావాసి అంటారా … సో వాట్..? రాజ్యసభ ఎంపికల్లో జగన్‌ది సంకుచిత మనస్తత్వం కాదు… విశాలమైన పాన్ ఇండియా ధోరణి… గతంలో అంబానీ చెప్పిన నత్వానీకి కూడా ఇచ్చాడు కదా… ఆదానీ భార్యకు ఈసారి ఇస్తాడని అందరూ అనుకున్నారు గానీ, ఆదానీ మరెక్కడో ముందుగానే కర్చీఫ్ వేసి, సీటు రిజర్వ్ చేసుకున్నట్టున్నాడు… అలా ఆదానీతో తన స్నేహాన్ని గౌరవించుకునే చాన్స్ జగన్‌కు మిస్సయిపోయింది…

కృష్ణయ్య ఎంపికలో డబ్బు ప్రమేయం లేదు… ఉండదు… అదసలు ఆలోచనాంశమే కాదు… కానీ తను ఢిల్లీలో పొలిటికల్ లాబీయింగుకు ఏమీ ఉపయోగపడలేడు, రాజకీయేతర అవసరాలకూ అంతే… మరి దేనికి ఈ ఎంపిక అంటారా..? దేశవ్యాప్తంగా బీసీలకు సామాజిక న్యాయం సాధించే దిశలో జగన్ వేసిన ముందడుగు అన్నమాట… అలాగే రాసుకోవాలన్నమాట… అది సరే, కృష్ణయ్యకు దేశవ్యాప్తంగా బీసీల్లో అంత భారీగా పలుకుబడి ఉందా అనే ప్రశ్న మాత్రం వేయకూడదు… నో, నో, వేయకూడదు…

కృష్ణయ్య ఎంపిక ద్వారా రాబోయే ఏపీ ఎన్నికల్లో తాను ఎంత బీసీ పక్షపాతినో జగన్ గొప్పగా చెప్పుకోవడానికి వీలుంటుంది అంటారా..? కరెక్టే గానీ, ఏపీలో బీసీ నేతలు లేరా..? వైసీపీలో లేరా..? వాళ్లకు చాన్స్ ఇచ్చినా బీసీ పక్షపాతిని అని చెప్పుకోవచ్చు కదా… ఏమోలెండి, అంతుపట్టదు… అందుకే జగన్‌కు మాత్రమే తెలిసిన ఏదో పెద్ద కారణమే ఉండే ఉంటుంది… ఉండకపోతే ఎందుకు సెలక్ట్ చేస్తాడు మరి..?

ఒక బీద మస్తాన్‌రావుకు ఇచ్చాడంటే… సరే, అప్పట్లో హామీ ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, మడమ తిప్పడు కదా అనుకోవచ్చు… మరి నిరంజన్‌రెడ్డి..? తనూ తెలంగాణే… సో వాట్… తన లాయర్, రేప్పొద్దున ఢిల్లీలో రాజకీయేతర అవసరాలకూ ఉపయోగపడగలడు… సాయిరెడ్డికి మళ్లీ చాన్స్ ఉండదేమో అనుకున్నారు కొందరు, కానీ ‘‘అన్నీ తెలిసిన’’ సాయిరెడ్డిని దూరం చేసుకోవడం కరెక్టు కాదు కాబట్టి సెలక్షన్ మళ్లీ తప్పలేదు అనుకోవచ్చు…

సో, ఆ ముగ్గురి ఎంపికకు జగన్‌కు తనవైన కారణాలున్నయ్… అలాగే కృష్ణయ్య ఎంపిక వెనుక కూడా ఏవో కారణాలు ఉండే ఉంటాయి… జగన్‌ను అర్థం చేసుకోగలిగినవాళ్లకు మాత్రమే ఈ ఎంపికకు కారణమేమిటో అర్థమవుతుంది… కానీ జగన్‌ను సరైన రాజకీయ కోణంలో అర్థం చేసుకోగలిగినవాళ్లు ఎవరు..? ఎందరు..? అనేదే అతి పెద్ద ప్రశ్న కదా…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మంటల్లో మరో యూరప్ దేశం… పటిష్ట ఆర్థికదేశాలు కావు, ఉత్త డొల్ల…
  • ‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions