.
. ( సేకరణ, అనువాదం: విశీ (వి.సాయివంశీ) …. గుడి ఏనుగు – పీరియడ్స్ – ఓ సంఘటన
(నటి సంధ్య జాగర్లమూడి పలు తెలుగు, తమిళ సీరియళ్లలో నటించారు. 2006లో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి ఓ తమిళ ఇంటర్య్యూలో చెప్పిన విషయాలు ఇవి..)
Ads
… 2006లో ఓ తమిళ సీరియల్ టైటిల్ సాంగ్ కోసం గుడిలో ఓ ఏనుగు దగ్గర షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో ఏనుగు నన్ను తన తొండంతో తోసేసి, నా మీద కాలేసి తొక్కేసింది. నేను నా ప్రాణాలు పోయాయనే అనుకున్నాను.
నేనింక బతకననే నిర్ణయానికి వచ్చేశాను. కానీ తీవ్ర గాయాలతో ఎలాగో బయటపడ్డాను. కొంతమంది నన్ను ఎత్తుకొని తీసుకెళ్లారు. నేను భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాను. ఆ సమయంలో ఒక డ్యాన్సర్ నా రొమ్ము మీద చెయ్యి వేశాడు. ప్రాణాలు పోయే స్థితిలో కూడా నా మీద అలాంటిది జరగడం నేను తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని నెలల పాటు నేను చికిత్స తీసుకున్నాను.
ఆ తర్వాత జనంలో నా గురించి రకరకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. నేను పీరియడ్స్‌లో ఉన్న సమయంలో గుడికి వెళ్లాను కాబట్టి, ఆ పాపానికి పరిహారంగా ఏనుగు నన్ను గాయపరిచిందని కొందరు అన్నారు. నేను పీరియడ్స్‌లో ఉన్నానా, లేదా అనేది వాళ్లకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా నన్ను అడిగారా? ఏం తెలుసు వాళ్లకి? ఒక ఆడదానికి పీరియడ్స్ వచ్చాయని ఆమె చెప్పకుండా మిగిలినవాళ్లకి ఎలా తెలుస్తుంది?
ఆ తర్వాత ఆ ఘటన గురించి విజయ్ టీవీలో స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఏ కారణం వల్ల ఏనుగు నన్ను తోసిందని కొందరు నిపుణులు కూర్చుని మాట్లాడారు. నేను వేసుకున్న డ్రెస్ నచ్చక ఏనుగు నన్ను తోసి ఉండొచ్చని అన్నారు. అదంతా చూసి నాకు చిరాకేసింది. నన్నొక మాట అడిగి ఉండొచ్చు, లేదా అక్కడ ఏం జరిగిందో అడిగి తెలుసుకోవచ్చు. అదేమీ లేకుండా వాళ్లలో వాళ్లే ఇలాంటి ఊహలు చేయడమెందుకో అర్థం కాలేదు.
ఏనుగు నన్నెందుకు తోసిందో ఆ తర్వాత తెలిసింది. ఆ సీన్‌లో ఏనుగు తొండానికి పది రూపాయల నోటు ఇస్తే, అది తీసుకుని నా తల మీద తొండం పెట్టి ఆశీర్వదించాలి. మొదట ఒక టేక్ చేశాం. అది సరిగా రాలేదని డైరెక్టర్ సెకండ్ టేక్ అన్నారు.
ఆ టైంలో ఏనుగు తొండం దగ్గర ఉన్న నోటును తీసుకుని, తిరిగి అదే నోటు నా చేతికిచ్చారు. ఇదంతా నాకు తర్వాత తెలిసింది. అది షూటింగ్ కోసం తెచ్చిన ఏనుగు కాదు. ఎన్నో ఏళ్ల నుంచి గుడిలో ఉన్న ఏనుగు. దానికి డబ్బు తీసుకుని ఆశీర్వదించడం మాత్రమే తెలుసు.
కానీ ఒకసారి తన దగ్గరికి వచ్చిన డబ్బు తీసుకుని, మరోసారి మళ్లీ అదే డబ్బు ఇచ్చేసరికి అది అయోమయపడింది. కోపంతో నా మీదకొచ్చి పడేసి, తొక్కేసింది. విచిత్రమేమిటంటే, నా చుట్టూ ముప్పై మంది దాకా ఉన్నారు. వాళ్లెవరినీ ఆ ఏనుగు ఏమీ అనలేదు.
నా మీదే దృష్టి పెట్టి, గాయపరిచింది. అందులో ఏనుగు తప్పు లేదు. అలవాటైన పని కాకుండా, మరో రకమైన పని చేస్తే జంతువులు అలాగే ప్రవర్తిస్తాయి.
చాలా ఏళ్ల తర్వాత, అంటే 2019లో మళ్లీ ఆ గుడికి వెళ్లాను. ఆ ఏనుగును దూరం నుంచి చూశాను. ఈ మొత్తం ఘటనలో ఆ ఏనుగు వల్ల నేను పడ్డ బాధ కన్నా, నా చుట్టూ ఉన్న మనుషుల వల్లే ఎక్కువ ఇబ్బంది పడ్డాను…
Share this Article