అరె, ఏమిటి లోకం..? పలుగాకుల లోకం..? అని అప్పట్లో అంతులేని కథలో ఏదో పాటలో చరణం… నిజం… అచ్చమైన సమాజ ఉద్దారుకుల్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు… పైగా నిందలు… అరె, మొన్నామధ్య కొత్తగూడెం వనమా రాఘవ అనే మహిళా ఉద్దారకుడిని, అత్యంత నైతిక వర్తుడిని ఈ ధూర్త లోకం అర్థం చేసుకోలేక నానా నిందలూ వేసింది… ఫాఫం, కేసీయార్ స్థితప్రజ్ఞుడు, మనిషి లోతుల్ని అర్థం చేసుకునే మేధావి కాబట్టి వదిలేశాడు… జస్ట్, అలా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను పోవోయ్ అన్నాడు… అయిపోయింది…
జగన్ కూడా తక్కువేమీ కాదు కదా… కేసీయార్‌కు తాత… జగన్ కీర్తికిరీటంలో అనంతబాబు అనబడే ఓ మెరుపు తురాయి… ఆఫ్టరాల్ బాబాయ్ హత్య కేసులోనే అందరినీ క్షమించేసిన అత్యంత ఉదారస్వభావుడు జగన్, ఈ అనంత బాబు అలియాస్ ఉదయభాస్కర్‌ను అర్థం చేసుకోలేడా..? చేసుకున్నాడు… కనీసం పార్టీ నుంచి సస్పెన్షన్ కాదుకదా, ఇదేమిటోయ్ అని కూడా అడగలేదు… అదీ తన నాయకశ్రేణిపై ఒక అధినేతకు ఉండాల్సిన నమ్మకం…
వాడెవడో ఈనాడు వాడు, ఆంధ్రజ్యోతి వాడు రాస్తారు… తన కులం ఓ బోగస్ అట… ఏజెన్సీలో ఓ నరకాసురుడు అట… కలప స్మగ్లింగ్, రంగురాళ్ల క్వారీల అక్రమార్జన అట… గంజాయి, సారా అక్రమ రవాణా అట… బినామీ పేర్లతో రొయ్యల చెరువులట… అడ్డొస్తే అట్రాసిటీ కేసులట… థూ, యెల్లో మీడియాకు ఏమైనా అర్థమై చస్తే కదా… బహుజన సమాజోద్ధరణకు సదరు నాయకుడు ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న తీరు సమజైతే కదా… అరె, జగన్ చూసీచూడనట్టుగా ఉంటున్నాడు అంటేనే అతను సమాజాన్ని ఉద్దరించేవాడు అని అర్థం కదా… ఆమాత్రం కామన్ సెన్స్ లేని మీడియా ఎందుకో… ఛిఛీ… (సాక్షి వాడికి లోకోద్ధరణ అంటే ప్రాణం కదా… అర్థం చేసుకున్నాడు… నిజంగానే అనంతుడు చెడ్డవాడు అయి ఉంటే సాక్షి ఏకిపారేసేది కదా… అసలే సాక్షిది సత్యవ్రతంలో తిరుగులేని శీల పాత్రికేయం…)
Ads
ఫాఫం, ఎవరో తనకు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేశాడట… దళితుడట… కానీ బాసును సరిగ్గా అర్థం చేసుకోలేదు… మద్యం తాగేవాడు, తరచూ యాక్సిడెంట్లు చేసేవాడు… ఐనా అత్యంత ఉదార హృదయుడైన అనంత బాబు ఏమీ అనలేదు… ఏదో మొన్నొకసారి మద్యం తాగకు అని చెప్పిచూశాడు… మద్యనిషేధ ఉద్యమకారుడు కదా… బహుజన ప్రేమికుడు కదా… అసలు మద్యం వల్లే బహుజనం నష్టపోతుందనే స్పృహతో, దాన్ని మాన్పించడానికి అహరహం శ్రమించే కేరక్టర్ కదా…
కానీ సదరు డ్రైవర్ వినలేదు… ఎహె, ఫోవోయ్ అని అమర్యాదగా తోసేశాడు… అక్కడికీ ప్రశాంతచిత్తుడైన అనంతుడు ఎంతో సహించాడు… తనను ఎలాగైనా మద్యం మాన్పించి ఉద్దరించాల్సిందే అనుకున్నాడు… ఏదో మందలింపుగా అలా అలా ఒక చిరు దెబ్బ వేశాడు… అందులో కూడా డ్రైవర్‌ను ఉద్దరించాలనే తపన, తాపత్రయం తప్ప మరేమీ లేదు… మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వెనక్కి విరుచుకుపడ్డాడు, తక్షణం ప్రాణాలు కోల్పోయాడు… ఫాఫం, ఉద్దరించేవాడి తప్పేముంది అందులో… అలా వెంటనే ప్రాణాలు కోల్పోవడం ఆ డ్రైవర్ తప్పు కదా…!!
అసలు ఎందరు చట్టసభల సభ్యులు తమ అనుచరులతో, తమ డ్రైవర్లతో మందు మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు..? ఎవరైనా అర్థం చేసుకున్నారా..? డ్రైవర్ మరణానికి కారణం ఈ ఎమ్మెల్సీయే అని గాయిగత్తర స్టార్ట్ చేశారు… ఎస్పీయే చెబుతున్నాడు… పోలీసులు ఎప్పుడైనా అబద్ధాలు చెబుతారా..? చెప్పరు కదా… పోలీసులు అంటే సత్యవాక్కులు కదా… అక్కడికీ సదరు ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తీసుకుపోవాలని అనుకున్నాడట… ప్చ్, సాధ్యం కాలేదు…
తన సమాజోద్ధరణ, మద్యనిషేధ ఉద్యమానికి ఇది ఆటంకం అవుతుందేమోనని భయపడ్డాడు అట… అసలే అత్యంత మంచి పేరు ఉందాయె తనకు ఏజెన్సీలో… జగన్ ప్రేమించిన నాయకుడాయె… తనకు చెడ్డపేరు రావద్దు కదా… అందుకని మృతదేహాన్ని ఇంకా కొట్టీ కొట్టీ ప్రమాదమరణం అని చిత్రీకరించే పనికి పాల్పడ్డాడట… ఫాఫం, మంచి పనికోసం ఓ చెడు చర్య… ఒక సత్య ప్రయాస… అంతే… ఈమాత్రం దానికి ఆ క్షుద్ర, నీచ, దుర్మార్గ, దుష్ట తెలుగుదేశం నానా రచ్చ చేయబోయింది…
అవునండీ… మంచివాళ్లను ఈలోకం ఎప్పుడు అర్థం చేసుకున్నది గనుక… ఛిఛీ… సమాజాన్ని ఉద్దరించాలంటే ఎన్ని కష్టాలు… ఎన్ని నిందలు… ఏదో పోలీసులు కూడా మంచోళ్లు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకున్నారు… కానీ వాళ్లకూ తప్పలేదు, అరెస్టు చేశారు… ఎప్పుడూ ఎన్‌కౌంటర్ కథల్లోనే తమ క్రియేటివిటీ ప్రదర్శించే పోలీసులకు ఈ కొత్త కథలు చెప్పడం ఎంతో కష్టమైనట్టుంది… అనంతబాబు వంటి మద్యనిషేధ ఉద్యమనేతల్ని, సమాజ ఉద్దారకుల్ని ఎలా వెనకేసుకురావాలో తెలియక బాగా అవస్థలు పడ్డారు… ఏదేమైనా లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణలో దావోస్‌లో బిజీగా ఉన్న జగన్ ఎలాగైనా కాస్త తీరిక చేసుకుని, అనంతబాబు వంటి సమాజసేవకుల్ని రక్షించడానికి ఏవైనా కొత్త చట్టాలు తీసుకొస్తే బెటరేమో సీరియస్‌గా ఆలోచించాలి… ఈ తొక్కలో పొలిటికల్ దుర్మార్గులు లోకేషులు, చంద్రబాబుల్ని వదిలేసి, ఓ కొత్త ప్రపంచం వైపు అనంతబాబుల్ని వెంటేసుకుని ప్రస్థానించే ఆలోచనలు చేయాలి…!!
Share this Article