సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి…
మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి ప్రభుత్వమే గుర్తించిన మైనారిటీలు… ఇవి గాక బోలెడు చిన్న చిన్న ఆదివాసీ సమూహాలు ఉండవచ్చు గానీ వాటికి గుర్తింపు లేదు… మైనారిటీ ప్రార్థన స్థలాల విషయలో ఏ ప్రభుత్వమైనా కాస్త సున్నితంగా, ఉదారంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది… కానీ జార్ఖండ్‌లోని హేమంత్ సొరెన్ ప్రభుత్వం తనే ఓ మైనారిటీ ప్రార్థన స్థలం విషయంలో గొడవను రాజేస్తోంది… అది జైనుల గుడి… జైనులకు మాత్రం మతమనోభావాలు ఉండవా..?
జనవరి ఒకటిన డిల్లీలోనే కాదు, దేశంలోని పలుచోట్ల జైనులు నిరసనలకు దిగారు… విషయం ఏమిటంటే… వాళ్లు చాలా పవిత్రంగా భావించేవే కొన్ని ప్రార్థనస్థలాలు… అందులో ఒకటి జార్ఖండ్‌లోని శ్రీ సమ్మేద్ శిఖర్‌జీ… ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఎకో టూరిస్టు ప్లేసుగా ప్రకటించబోతోంది… అలా జరిగితే ఇక దాని పవిత్రత పోతుందని, ఎవరుపడితేవాళ్లు వచ్చేసి, టూరిస్టు స్థలాల బాపతు అవలక్షణాలన్నీ వచ్చిపడతాయనీ జైనుల ఆందోళన… (తిరుమల ఏడు కొండల్లాగే…)
Ads
నిజానికి ఇదే జార్ఖండ్ ప్రభుత్వం 2022 జూలైలో ఈ గుడి ఉన్న పార్శ్వనాథ్ హిల్స్‌ను మతపరమైన టూరిస్టుల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తమ టూరిజం పాలసీలో చెప్పింది… ఎందుకంటే..? 24 మంది తీర్థంకరుల్లో 20 మంది నిర్యాణం ఈ గుట్టల్లోనే జరిగిందని జైనుల నమ్మకం… ప్రతి సంవత్సరం వేలాది మంది జైనులు ఆ తీర్థంకరులు నిర్యాణం చెందిన స్థలాలను సందర్శించడానికి వస్తారు… 27 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి… అంతేకాదు, సంతాల్ ఆదివాసీలకు కూడా ఈ గుట్టలు పవిత్రమైనవి… ఏటా మరంగ్ బురు అని జాతర కూడా చేస్తారు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తెగకు చెందిన మహిళే…
జైనుల ఆందోళనలకు విశ్వహిందూ పరిషత్ మద్దతునిస్తోంది… మొత్తం పార్శ్వనాథ్ హిల్స్‌ను ‘పవిత్ర తీర్థంగా’ ప్రకటించాలని వీహెచ్పీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది… మాంసం, మద్యంతో టూరిస్టులు ఈ గుట్టల్ని పొల్యూట్ చేస్తారనేది వీహెచ్పీ వాదన… జైనులు వందల ఏళ్లుగా కాపాడుకుంటున్న పవిత్రతను భ్రష్టుపట్టించే ఆలోచనకు స్వస్తి చెప్పాలని ఆ ప్రకటన కోరింది… అసలే హేమంత్ సొరెన్‌కు ఉద్వాసన పలకడానికి తగిన రంగం అక్కడ రెడీగా ఉంది… ఇప్పుడిలా గోక్కోవడం అవసరమా..? ప్రశాంతంగా ఉన్న ఆ గుట్టల్లో ఓ రియల్ మైనారిటీ హక్కులకు సమాధి పేర్చడం అవసరమా..? అంతర్జాతీయంగా గాయిగత్తర చేయడానికి జైనులకు వేరే దేశం కూడా లేదు కదా…!!
Share this Article