ఒక ఫోటో వైరల్ అవుతోంది… ఇది రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, జైపూర్ రాణి దియాకుమారి కొడుకు మహారాజా పద్మనాభసింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఫోటో ఇది… బ్యాక్‌గ్రౌండ్‌లో అయోధ్య గుడి… theroyalfamilyofjaipur పేరిట ఉన్న ప్రొఫైల్‌లోనీ ఈ పోస్ట్ ఏం చెబుతున్నదంటే…
‘మేం సూర్యవంశ రాజపుత్రులం… అంటే శ్రీరాముని వారసత్వ పరంపర మాది… మా నాన్న శ్రీరాముడి తరువాత 309వ తరం…’ అని పేర్కొంటూ… మా వారసత్వాన్ని నిరూపించే ఆధారాలున్నాయి, 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జైసింగ్-2 ఒక సాధువు నుంచి మా వారసత్వ పరంపరను రాసి ఉన్న వస్త్ర పత్రాలను కొనుగోలు చేశాడు… ఇవి అనేక తరాలుగా మా కుటుంబం భద్రపరుస్తోందని వివరించాడు…
Ads
నిజానికి ఈ కుటుంబం ఇప్పుడు అయోధ్యతో తమ వారసత్వ లంకెలను, రాముడి వారసత్వాన్ని చెప్పడం లేదు… అయోధ్య పునర్నిర్మాణం జరిగాక చాలామంది ఏవో కథలు చెబుతూ రాముడి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు… కానీ డిప్యూటీ సీఎం దియాకుమారి 2019లోనే ఓ ప్రకటన చేసింది… అప్పుడు ఆమె బీజేపీ ఎంపీ…
అప్పట్లో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కేసులో కక్షిదారుగా ఉన్న ‘రామ్‌లల్లా విరాజ్‌మాన్’ (బాలరాముడు), రామజన్మస్థలి ఎదుట, అంటే తన తరఫు న్యాయవాది పరాశరన్ ఎదుట ఓ ప్రశ్న ఉంచింది… ‘అసలు అయోధ్య రాముడి వంశానికి చెందిన వారసులు ఎవరైనా ఇంకా అయోధ్యలో ఉన్నారా..?’ అనేది ఆ ప్రశ్న… పరాశరన్ విచారణ పక్కదోవ పట్టకుండా వెంటనే ‘నాకు సమాచారం లేదు, కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను’ అని బదులిచ్చాడు…
తరువాత ఎంపీ దియాకుమారి తెరమీదకు వచ్చింది… రాముడి వారసులం మేమున్నాం… రాముడి కొడుకు కుశుడికి సంబంధించిన కుశ్వ, కచ్చవ వారసత్వ పరంపర మాది, మాది 309వ తరం… సుప్రీంకోర్టు గనుక కావాలనుకుంటే నా దగ్గర ఆధారాలున్నాయి, సమర్పిస్తానని ప్రకటించింది… సరే, ఆమె ఆధారాలను ఎవరూ అడగలేదు, ఆమె క్లెయిమ్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు…
పైన పబ్లిష్ చేసినవే ఆమె కుటుంబం చెబుతున్న కొన్ని ఆధారాలు… అవిప్పుడు దియాకుమారి కొడుకు ఏకంగా ‘వంశావళి’ పేరిట సోషల్ మీడియాలోనే పెట్టేశాడు… సహజంగానే రకరకాల కామెంట్స్, వ్యాఖ్యానాలు, అభినందనలు, విమర్శలు గట్రా వస్తాయి కదా… కొందరు నెటిజనులు మాత్రం ఆ 18వ శతాబ్దం తరువాత నుంచి ఇప్పటివరకు వివరాల్ని కూడా అప్‌డేట్ చేసి భద్రపరచండి… ఆ రాముడి వారసత్వం అంటే మీరు ధన్యజీవులు అని సూచించారు…
దియాకుమారి తమకు వారసత్వంగా వచ్చిన ట్రస్టులు, రాజభవనాలు, ఆస్తులు, స్కూళ్లను నిర్వహిస్తోంది… నాలుగు హోటళ్లు కూడా… రాజకీయాల్లో ప్రవేశించాక గత టరమ్ ఎంపీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం… ఒక దశలో రాణి వసుంధరరాజే ధిక్కార పోకడలకు విరుగుడుగా ఈ రాణిని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ హైకమాండ్ భావించింది కూడా… కొడుకు పద్మనాభసింగ్ వయస్సు 25 ఏళ్లు… ఇంటర్నేషనల్ పోలో ప్లేయర్… ఇదీ కథ… అన్నట్టు ఇందిరాగాంధీ బాగా కుళ్లుకున్న ఓ ప్రపంచ అందగత్తె గాయత్రిదేవి కథ తెలుసా… ఆమె ఈ దియాకుమారికి సవతి తల్లి… ఆ కథ ఇంకెప్పుడైనా చెప్పుకుందాం…
Share this Article