.…… సమీక్ష :: రమణ కొంటికర్ల… ఫోర్త్ ఎస్టేట్ ని కడిగిపారేశాడు.. మిగిలిన ఫిల్డర్స్ నీ ఉతికి ఆరేశాడు .. మొత్తంగా ప్రస్తుత సమాజంలో వ్యవస్థల తీరుపై నేరుగా సంధించిన అస్త్రం.. జనగణమన 2022!
ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు.. మొత్తంగా కనికట్టు! అసలేంటో తెలియకుండా.. తెలుసుకోవాలనే యత్నమే చేయకుండా.. అసలుకసలు విలువే ఇవ్వకుండా.. వక్రీకరించి కొసరుతో సెన్సేషన్ కు పాల్పడే.. పెట్టుబడులకు పుట్టే కట్టుకథలు, పిట్టకథలు, అబద్ధాలతో.. మీడియా చేసే ప్రచారం సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో చర్చించాడు దర్శకుడు.
ఓ దిశ ఎన్ కౌంటర్.. ఓ రోహిత్ వేముల ఆత్మహత్య.. ఇలా అన్నీ మనకు తెలిసిన కథలే! కానీ, అలాంటి కథల వెనుక ఉన్న వ్యథలకు ఎలాంటి బూటకపు వైట్ కాలర్ రంగులద్దుతారో సమర్థవంతంగా విశదీకరిస్తుంది సినిమా
Ads
అన్ని వ్యవస్థల్లోకీ.. పొలిటికల్ సిస్టం మాస్టర్ కీ.. ఈ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కోణంలో అన్నారోగానీ.. అపసవ్య దిశలో ఇవాళ ఆయన మాటలను అక్షరసత్యాలు చేస్తూ.. తమ వ్యక్తిగత, రాజకీయ ఎజెండా లక్ష్యంగా వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో నిత్యం మనం చూస్తున్నదాన్నే క్యాన్వాస్ పై ప్రతిబింబిస్తే.. అది జనగణమన!
వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్ప అని పైకి చెప్పుకోవడానికి.. ఆ నినాదాన్ని కిందిస్థాయి వారిని బలి చేయడానికే తప్ప.. వ్యవస్థలోని బలవంతుల స్వార్థం ముందు వ్యవస్థ కూడా జుజుబీ అనే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని.. అందరికీ అమోదమనిపించేలా మల్చాడు. ఎవరి ప్రయోజనాలు వారు ఆశించి.. పోలీస్, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా చేతులు కలుపుతాయో చర్చించాడు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగుంటాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారన్న లెనిన్ నినాదాన్ని సెల్యూలాయిడ్ కి ఎక్కించాడు. రాజకీయ వ్యవస్థలో రాకాసిబల్లులు తమ టార్గెట్స్ ఫిల్ చేసుకునే క్రమంలో.. మీడియా సహకారంతో వాటినెలా ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి.. మొత్తంగా ఎలా ఎంటైర్ ప్రాసిక్యూషన్ నే తప్పుదోవ పట్టిస్తాయి.. వెరసి, న్యాయం జరక్కపోగా.. అన్యాయంగా అమాయకులెలా బలవుతారో చూపించాడు.
విద్యావ్యవస్థ.. పోలీస్ వ్యవస్థ.. ఇంకే శాఖైనా.. మొత్తంగా సమాజాన్నే క్యాన్వాస్ చేసుకుని.. ఇక్కడ ఓ మనిషికి ఐడెంటిటీ ఎంతవసరమో కుల, మతాలాధారంగా జరుగుతున్న వర్గవిభజనను చర్చించింది జన 2022! అమాయకులకు న్యాయం అందని ద్రాక్షై.. ఎలా అన్యాయమైపోతారో చూపిస్తుంది.
పేరుకే విశ్వవిద్యాలయాలు తప్పితే.. విద్యతో విజ్ఞానం పరిఢవిల్లాల్సిన చోటే.. సంకుచితత్వం ఎలా వెర్రితలలు వేస్తుందో చెబుతుంది ఈ సినిమా! యూనివర్సిటీలు, విద్యార్థిసంఘాల నాయకులను పొలిటీషియన్స్ వాడుకునే తీరు.. అక్కడ డీన్స్, ప్రొఫెసర్స్ నుంచి వైస్ ఛాన్స్ లర్స్ వరకు జరిగే రాజకీయాలనూ కళ్లముందుంచింది జన.
ఫ్రమ్ ద బిగినింగ్ టూ.. ఎండ్ కార్డ్ వరకూ.. బిగి సడలకుండా సాగే గ్రిప్పింగ్ నేరేషన్.. దర్శకత్వ శాఖలోకి ఎంటర్ కావాలనుకునేవారికి ఓ పాఠాన్నే బోధిస్తుంది. ఐతే కొత్త తరం దర్శకులకే కాదు.. ఇంతవరకు వందల సినిమాలు తలాతోకా లేకుండా తీసి.. చరిత్రలను వక్రీకరించి.. అసలు కథ పక్కనబెట్టి.. కొసరు గ్రాఫిక్స్, ఫైట్స్, పాటలు, హీరోయిజం ఎలివేషనే పరమావధిగా.. ప్రేక్షకులను బక్రాలను చేసి డబ్బులు కొల్లగొట్టిన ఎందరో సో కాల్డ్ అనుభవజ్ఞులని సర్టిఫికెట్స్ అందుకున్న దర్శకులూ చూసి.. తమ పొరపాట్లేవో ఇప్పటికైనా గుర్తెరిగేలా చేసే సినిమా జన.
ఓహో ఇదా థీమ్.. అయితే కథ ఇదే అయ్యుంటుంది బహుశా అనుకునేలోపు.. దాని ఇంటర్ లింక్ గా సాగే కథలు.. సగటు ప్రేక్షకుడి ఊహలను తోసిరాజనే ట్విస్ట్ లతో ఓవరాల్ సినిమాపై దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ పూర్తిస్థాయి ఎక్సర్ సైజ్ కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే.. లోతుపాతుల్లోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆర్గనైజేషన్స్ సెన్సేషన్ కోసం పడే పాకులాట.. వక్రీకరించేందుకు వాడుకునే ఆట.. ఫ్యాబ్రికేటెడ్ సాక్ష్యాలతో కళ్లుండీ చూడలేని న్యాయదేవత ఇచ్చే తీర్పులు.. చట్ట ప్రకారం.. ధర్మంగా జరగాల్సిన న్యాయం ఎలా పక్కదారి పట్టడానికి కారణమవుతుందో.. ఎంత అన్యాయం సమాజంలో జరిగి.. మరిన్ని కొత్త సమస్యలకు శ్రీకారం చుడుతోందో.. ఒకే ఒక్క సినిమాతో.. టైటిల్ కార్డుకు దర్శకుడు సరైన న్యాయం చేసిన థియేటరికల్ డ్రామా జనగణమన!
కథలో క్యారెక్టర్స్ భాగస్వామ్యం కావాలే తప్ప.. ఫలానా హీరో, ఫలానా విలన్, ఫలానా కమేడీయన్ పేరుతో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టు స్టోరీ క్రియేట్ చేయని సినిమా జన. అందుకే ఫలానా వాళ్ళు హీరో అనుకునేలోపే విలన్ షేడ్స్ బయటపడటం.. ఇంత ఘోరమా అనుకునేలోపే ఆ విలన్ లో రియలైజేషన్.. ఓ లాయర్ గా బాగా వాదించే పాత్రలో హీరో అనుకున్నోడు ఒదిగిపోయాడనుకునేలోపు.. అంతకుముందు జరిగిన ఇంటర్ లింక్డ్ స్టోరీ.. ఇలా డిఫరెంట్ టేల్స్ తో.. మొత్తంగా ఒక అద్భుతమైన సినిమా ఆవిష్కృతమైందంటే.. దర్శకుడి ప్రతిభ.. మిగిలిన సిబ్బంది తమదైన రంగాల్లో చూపించిన చొరవ.. ఇలా ఓ సమ్మిళిత సమ్మోహనం జన!
మొత్తంగా సమాజంలో జరిగే దిశ వంటి ఘటనలు.. ఎన్ కౌంటర్స్.. కాలేజ్ క్యాంపస్ కథలు.. అసలు వాటి వెనుక ఉండే మోటో.. పరపతి.. ఇలా లోతుల్లోకి వెళ్లి చర్చించి.. నిజమైన జనగణమన అనిపించుకున్న సినిమా ఇది.
పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడి ఈ సినిమా మొత్తంలో ప్రధానాకర్షణ.. నటవిశ్వరూపం. సందర్భోచిత బీజీఎం, కథను తెరకెక్కించిన ఫోటోగ్రఫీ.. వీటన్నింటికి తోడు కథను.. గ్రిప్పింగ్ కథనంతో నడిపిన డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వ ప్రతిభ.. ఇలా.. 24 క్రాఫ్ట్స్ అద్భుతంగా మిళితమైతే.. అది ఓ జన!
Share this Article