.
ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఆయుఃప్రమాణం ఉన్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి… తక్కువ జననాలు ఉన్న దేశాల్లోనూ ఒకటి… తద్వారా వస్తున్న సమస్యలకు ఓ ఉదాహరణగా మారింది…
వృద్దాప్యంలో ఒంటరిగా నివసిస్తూ… మరణిస్తే కొన్నిరోజుల వరకూ ఎవరికీ తెలియకుండా తమ ఫ్లాట్లు, ఇళ్లల్లోనే అనామక శవాలుగా పడిఉండే దురవస్థ గురించి మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… ఇలాంటి కేసులు ఇంకా పెరుగుతున్నాయి…
Ads
కుటుంబం సపోర్టు లేకపోవడం, ఒంటరితనం, వృద్ధాప్యం… దుర్వాసన బయటికి వస్తే తప్ప ఆ మరణాలు బయటపడవు… ఊరికి కాస్త దూరంగా ఉండే ఇళ్లల్లో..? పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో చివరకు అధికారులే అంత్యక్రియలు జరిపించేస్తారు…
కనీసం ఎవరూ ఫోన్లు చేయరా..? క్షేమసమాచారాలు కనుక్కోరా..? అంత ఐసోలేటెడ్ బతుకులా అని ఆశ్చర్యం వేస్తుంది… కొందరు కావాలని చిన్న చిన్న దొంగతనాలు చేసి, జైళ్లకు వెళ్తున్నారు… డబ్బులిచ్చి మరీ కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళ్తున్నారనే వార్త చదివాక పెద్దగా ఆశ్చర్యం కలగలేదు…
సీఎన్ఎన్ ఓ వార్త ప్రచురించింది… పదీపదిహేను ఏళ్లలో జైళ్లలో ఉండే వృద్ధుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందట… ఓ మహిళా జైలు అధికారి చెబుతున్నది… ‘‘ఇది జైలా, నర్సింగ్‌హోమా అర్థం కావడం లేదు… కొందరికి మరీ మా స్టాఫే డైపర్లు మార్చడం, తినిపించడం.., రెగ్యులర్ హెల్త్ చెకప్స్ సరేసరి…’’
బతకడానికి ఆర్థికంగా గతిలేక కాదు, చాలామంది దీన్ని ఒక కుటుంబం అనుకుని వస్తున్నారు, బయట పట్టించుకునే దిక్కులేక… ఒకావిడకు 81 ఏళ్లు… ప్రతిసారీ షాపుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లోపలకు వస్తోంది… ఈ వయస్సులో మాట్లాడుకోవడానికి తోటి ఖైదీలు, వేళకు తిండి, హెల్త్ చెకప్స్… ఇంకేం కావాలి నాకు అంటోంది ఆమె…
‘‘వీళ్లు బయటకు వెళ్లినా నాలుగు రోజులు ఉండలేరు… పోలీసులకు డబ్బులిచ్చి మరీ కేసులు పెట్టించుకుని లోపలకు వస్తున్న ఉదాహరణల్ని వాళ్లే చెబుతుంటారు… కొందరు కావాలనే డ్రగ్స్‌తో పట్టుబడతారు, ఎక్కువ కాలం జైలుశిక్ష కోసం…’’ అంటోంది జైలు అధికారిణి…
ఎక్కువ ఆయుష్షు, తక్కువ జననాల రేటు ఉన్న దేశాలు ఎదుర్కునే పెద్ద సామాజిక సమస్యలు భిన్నం… జీవనవ్యయం విపరీతంగా పెరగడం, పని ఒత్తిడి కారణంగా చాలామంది పెళ్లిళ్లే చేసుకోవడం లేదు… చేసుకున్నా జీవిత భాగస్వామి కూడా పనిచేయాలి ప్లస్ పిల్లలు వద్దు… మహా అయితే ఒకరితోనే సరి… ఈ ధోరణి జపాన్‌లోనే కాదు… తూర్పు దేశాల్లోనే కాదు…
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి… ఇప్పుడు పిల్లలు కావాలి మొర్రో లేకపోతే అంతరించిపోతాం అని జపాన్, రష్యా తదితర దేశాలే కాదు, ఒకప్పుడు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా కూడా మొత్తుకుంటోంది… చివరకు చంద్రబాబు, స్టాలిన్ చెబుతున్నదీ అదే… కంటాం సరే, ఎవరు పెంచాలి అనే మాటే యువతది…
మ్యాన్ పవర్ ఈజ్ రియల్ వెల్త్… అది నిజమే… కానీ అది దేశానికి వెల్త్, కుటుంబానికి కాదు అంటారు జనం… మరిక జననాల వృద్ధి రేటు పెంచడం ఎలా..? ఏ దేశానికీ ఓ స్థిరమైన, ఓ నిర్మాణాత్మకమైన విధానం లేదు… కాస్త టైమ్ చూసుకుని సంభోగాల సంఖ్య పెంచండి అని ఓ పేలవమైన, డొల్ల పిలుపు ఇస్తాడు పుతిన్… ఆ ‘కార్యక్రమాలు’ తగ్గి పిల్లలు పుట్టడం లేదనే ఓ పిచ్చి అవగాహన…
మరి అటు వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది, ఇటు పిల్లలు పుట్టడం లేదు… అనేక ఊళ్లు వృద్ధాశ్రమాల్లా కనిపిస్తున్నాయి… పరిష్కారం..?!
Share this Article