హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ఎందుకు ఉందో అర్థం కాదు ఈ సినిమాలో… ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు, హఠాత్తుగా అంతర్ధానం… మెయిన్ విలన్‌గా మన కమెడియన్ సునీల్… వేషధారణ నప్పలేదు… పెద్దగా ఇంప్రెసివ్ పాత్ర కాదు… ఇవే కాదు, కొన్ని పాత్రలు అలా వస్తాయి, ఇలా వెళ్తాయి… ఏ పాత్ర ఎందుకొస్తుందో తెలియదు… సినిమా అయిపోయాక థియేటర్ బయటికొచ్చాక చాలా పాత్రలు గుర్తు కూడా ఉండవు…
అదేనండీ, మనం జపాన్ అనే సినిమా గురించి చెప్పుకుంటున్నాం… ఎప్పటిలాగే తమిళ సినిమాకు ఇది నాసిరకం డబ్బింగ్ వెర్షన్… పేరుకు పాన్ ఇండియా సినిమా అయినా సరే ఒరిజినల్ మూవీకి ఇతర భాషల్లో డబ్బింగే కదా జరిగేది… ఇదీ అంతే… కాకపోతే తెలుగు మార్కెట్ పెద్దది కాబట్టి, హీరో కార్తి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నవాడే కాబట్టి, సూర్య తమ్ముడు కాబట్టి ఈమాత్రం ఆసక్తి… లేకపోతే అసలు దానికి రివ్యూయే అక్కర్లేదు…
తమిళం నుంచి తెలుగు డబ్బింగ్ అంటేనే… వసూళ్ల లెక్కలే తప్ప, సరైన అనువాదం గట్రా ఎవరూ పట్టించుకోరు… సంగీతం గురించి తెలుసు కదా… పాటలు అస్సలు బాగుండవు… ఈ సినిమాలోనూ అంతే… అసలు కథలోకి వెళ్తుండగానే హీరోకు ఎయిడ్స్ అని తెలిసి ఇక సినిమా మీద ఆసక్తి సగం చచ్చిపోతుంది… కార్తి ఆహార్యం, డైలాగ్ డిక్షన్, కామెడీ మాత్రమే ఈ సినిమాలో రిలీఫ్… అంటే డిఫరెంటుగా ఉన్నయ్, తన పాత్రకు కార్తి న్యాయం చేశాడు…
Ads
కాకపోతే మొన్నామధ్య వచ్చి అడ్డంగా బోల్తాపడిన రవితేజ టైగర్ నాగేశ్వర్రావు కథ వంటిదే… ఇందులోనూ ఓ దొంగ కథానాయకుడు… కానీ దొంగతనాలు గానీ, పోలీసులు వెంటాడటం గానీ పెద్ద ఆసక్తికరంగా లేవు జపాన్ సినిమాలో… ఒక్క పాత్ర మాత్రం ఆసక్తి రేపుతుంది… బంగారం షాపుల దగ్గర మురుగు కాల్వల్ని జల్లెడ పడుతూ బంగారాన్ని పట్టుకునే పాత్ర… చాలా షాపుల దగ్గర కనిపించేవే… కాకపోతే చివరకు అదీ తేలిపోయింది… అది దర్శకుడి ఫెయిల్యూర్… ఇక తమిళ సినిమాల్లో కనిపించే ‘అతి’ ఈ సినిమాలోనూ చికాకు పెడుతుంది మనకు…
కథ ఎలాంటిదైనా సరే, చెప్పే విధానంలో, చూపే విధానంలో డిఫరెంట్‌గా ఉంటే మెప్పిస్తుంది సినిమా… జపాన్ సినిమాలో అదే లోపించింది… ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదంటే రన్ టైమ్ తక్కువ కదా… త్వరగా అయిపోతుంది… ఈ వేగం ఎడిటింగులో చూపిస్తే సినిమా ఇంకాస్త బిగితో ఉండేది… ఐనా హీరో కేరక్టరైజేషన్‌లోనే లోపాలున్నాక ఇక ఎన్ని హంగులు అద్దినా వేస్టే కదా… కార్తి కెరీర్‌కు ఇది ఏమాత్రం అక్కరకు రాని సినిమా… ఇంతకుమించి ఈ సినిమా గురించి చెప్పడానికేమీ లేదు… సెలవు…
అన్నట్టు… ఇలాంటి సినిమాలకూ అభిమానులుంటారు… చూసేవాళ్లు ఉంటారు… ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు కొందరు ఇష్టపడొచ్చు కూడా… కానీ మా తెలుగులోనే బోలెడు మంది హీరోలు ఇలాంటి సినిమాలే చేస్తుంటారు… ఇంకా ఇక్కడ నువ్వు కూడా ఎందుకోయ్ కార్తీ…!!
Share this Article