గాలి సంపత్… జాతిరత్నాలు… శ్రీకారం…. ఈ మూడు సినిమాల్లో ఏది బెటర్, ఏది చూడొచ్చు అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, ఈ మూడూ బాగా ఆసక్తి రేపిన సినిమాలు… ఒకటి మంచి టేస్టున్న నాగ్ అశ్విన్ సొంత సినిమా… రెండు శర్వానంద్ చేసిన ఫీల్ గుడ్ సినిమా… మూడు రాజేంద్రప్రసాద్ రెచ్చిపోయి నటించిన సినిమా… పైగా ఇది రీసెంట్ పాపులర్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రజెంట్ చేసిన సినిమా… దేని విశిష్టత దానిదే… ఏ సినిమా కూడా వల్గారిటీని నమ్ముకోలేదు… ఏదీ ఫార్ములా సినిమా కాదు… దిక్కుమాలిన ఫైట్లను బలవంతంగా జొప్పించలేదు… సగటు తెలుగు సినిమా అవలక్షణాలకు దూరంగా ఉన్నయ్… మూడింట్లోనూ ముగ్గురు హీరోలు తమ నటనతో ఇరగ్గొట్టేశారు… మూడింట్లోనూ లవ్ స్టోరీలకు ప్రాధాన్యం లేదు… మితిమీరిన రొమాన్స్ గట్రా ఏమీ లేదు… కానీ ఏది చూడొచ్చు అనే ప్రశ్న దగ్గరే వస్తుంది తిరకాసు… అది వ్యక్తుల అభిరుచిని బట్టి ఉంటుంది… ఈ మూడు సినిమాల్లోనూ కథలు లాజిక్కులను పట్టించుకోవు… ఎహె, తెలుగు సినిమాల్లో కథేమిటి, నాన్సెన్స్ అంటారా..? సరేసరే…
ముందుగా జాతిరత్నాలు… ఫుల్ లెంత్ ఎంటర్టైనర్… కామెడీ జానర్… కథలు, కాకరకాయలు, లాజిక్కులు గట్రా ఆలోచించకుండా… సరదాగా సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడొచ్చిన సినిమాల్లో ఇది బెటర్… నవీన్ పొలిశెట్టి అలవోకగా సినిమాను నవ్వుతూ నవ్విస్తూ లాక్కుపోయాడు… కామెడీ టైమింగులో దిట్ట… తనకు తోడుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ… వాళ్లకూ వంకలేమున్నయ్… అందుకే ప్రతి సీనూ భలే రక్తికట్టింది… ఇక ఆరు అడుగుల కొత్త అందాల కెరటం ఫరియా అబ్దుల్లా సరేసరి… ప్రేక్షకుల్ని భలే ఆకట్టుకుంది… ఆమెకు రాబోయే రోజుల్లో మంచి కెరీర్ ఉంది… అయితే టీవీ ట్యూన్ చేస్తే చాలు, బోలెడన్ని కామెడీ ప్రోగ్రాములు కదా… ఈమాత్రం కామెడీ సినిమాకు థియేటర్ దాకా పోవాలా అనేదేనా మీ ప్రశ్న..? నిజమే… ఇది లాజిక్కే… ఓటీటీలోకి ఎక్కేవరకు, టీవీలో వచ్చేవరకూ ఆగుతాం అంటారా..? రీజనబులే… ఓటీటీ, టీవీ రైట్స్ కూడా నిర్మాతకు డబ్బులు సంపాదించి పెట్టేవే… ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి… టీవీల్లో, సినిమాల్లో ఈరోజుకూ తెలంగాణ యాక్సెంట్ను ఖూనీ చేస్తుంటారు మనవాళ్లు… కానీ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుల నడుమ తెలంగాణ యాక్సెంట్ సహజంగా పలికింది…
Ads
రాజేంద్రప్రసాద్ మంచి నటుడు… తన టైమింగ్ సూపర్ ఉంటుంది… తనకు ఇప్పుడు కొత్తగా ఎవరూ పాఠాలు నేర్పనక్కర్లేదు… సరైన పాత్ర పడాలే గానీ ఇరగదీసేస్తాడు… నిజానికి ఈ గాలి సంపత్ సినిమా అనిల్ రావిపూడి తరహా సినిమాలకు భిన్నం… అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఎక్స్టెండెడ్ ఈటీవీ జబర్దస్త్ షో ఎపిసోడ్స్… ఎఫ్2 సినిమా అంతే… సరిలేరు నీకెవ్వరులో హిట్టయిన సీన్లూ అవే… రాబోయే ఎఫ్3 కూడా అంతే… లాజిక్కులు తొక్కాతోలూ ఆలోచించొద్దు… జస్ట్, వాచ్ అండ్ ఎంజాయ్ టైపు… అలాంటిది గాలి సంపత్ సినిమాలో కథ వేరు… కాస్త ఎమోషన్ లింక్డ్… ఓ తండ్రి, ప్రమాదంలో గొంతు కోల్పోతాడు… తనకు ఓ కొడుకు… శ్రీవిష్ణు… అపార్థాలు, అనుబంధాలు ఎట్సెట్రా… అయితే రాజేంద్రప్రసాద్ సూపర్బ్ నటన మినహాయిస్తే పెద్దగా కథ, కథనం ప్రేక్షకుడిని కనెక్ట్ కావు… శ్రీకాంత్ కామెడీ సీన్లు వెగటు… రాజేంద్రప్రసాద్ నటవిశ్వరూపం కోసమే థియేటర్ వెళ్లాలా..? ఈ ప్రశ్నకు జవాబును ప్రేక్షకుడే ఆలోచించుకోవాలి…
మనకున్న మంచి నటుల్లో శర్వానంద్ కూడా ఒకడు… తను నటిస్తుంటే కృత్రిమత్వం కనిపించదు… సహజంగా పాత్రలో దూరిపోతాడు… ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు… ఆ పాత్రకు ఎంత కావాలో అంతే ఇస్తాడు… పైగా మొదటి నుంచీ తన పాత్రల ఎంపిక కూడా బాగుంటుంది… ఫార్ములా కథల జోలికి పోడు… ఉన్నంతలో తన పాత్ర ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటాడు… ఓ పద్ధతి ఉన్న హీరో తను… శ్రీకారం సినిమాకు కూడా తనే ఆకర్షణ… మంచి కార్పొరేట్ ఉద్యోగం వదిలి, వ్యవసాయంలోకి దిగే పాత్ర ఆదర్శమే… కథ కోసం బాగుంటుంది… కానీ రియాలిటీ వేరు… ఆ రియాలిటీలోకి వెళ్లడానికి దర్శకుడు ప్రయత్నించీ… పెరిఫెరల్గా టచ్ చేసి, సినిమాటిక్ ఫలితాలు చూపించి, చివరకు హీరో స్పీచుతో ముగించేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… కానీ వ్యవసాయం చాలా క్లిష్టమైన సబ్జెక్టు… మరీ లోతులోకి వెళ్తే సినిమా కమర్షియల్ వాల్యూ కోల్పోతుంది… దర్శకుడు కత్తి మీద సాము చేశాడు… బట్, కథ కాన్సెప్టుపరంగా గుడ్… కథనం, ట్రీట్మెంట్పరంగా గుడ్… కానీ పడీ పడీ థియేటర్ దాకా పరుగులు తీసేంత మాత్రం కాదు… నిజానికి రేటింగ్స్ ఇవ్వాలనుకుంటే ఏ సినిమా తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు… ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే జాతిరత్నాలు… కాస్త కథ, కథనం, కాస్త సీరియస్నెస్ కావాలనుకుంటే శ్రీకారం… రాజేంద్రప్రసాద్ నటన కోసమైతే గాలి సంపత్…! ఈ మూడు సినిమాలూ కలిపి మథించి సమీక్షిస్తే మాత్రం… పైకి తేలే మీగడ తరక మాత్రం కొత్త అందాల కెరటం ఫరియా అబ్దుల్లా…!!
Share this Article