.
బీఆర్ఎస్ పార్టీ భూకబ్జాదారుల మద్దతు పార్టీయా..? హైదరాబాద్‌లో ఎడాపెడా సాగిన కబ్జాలకు బీఆర్ఎస్ అండదండలుగా నిలిచిందా..? ఆ పాపాల పుట్టలన్నీ ఇప్పుడు పగులుతుంటే లబలబ ఏడుస్తోందా..? గుండెలు బాదుకుంటోందా..? ఓ ఉదాహరణ చెప్పుకుందాం… వివరంగానే…
పోలీస్, రెవిన్యూ, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫైర్, హైడ్రా, ఇతర ప్రభుత్వ విభాగాలన్నీ కలిసి 2700 మంది… ఓ బాహుబలి క్రేన్, 12 జేసీబీలు, 3 హిటాచీలు, 6 టిప్పర్లతో హైడ్రా నిన్న నిర్వహించిన ఐలాపూర్ ఆపరేషన్ అది… చిన్న ఆపరేషన్ ఏమీ కాదు… బీఆర్ఎస్ పార్టీ అండదండలతో చెలరేగిపోయిన ముఖీమ్, అజీమ్ సామ్రాజ్యాన్ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల అరాచకాన్ని హైడ్రా కుప్పకూల్చింది…
Ads
- ఇక్కడ చెప్పుకోవాల్సింది రెండు పరస్పర దృశ్యాలు… ఈ కూల్చివేతలతో ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు క్షీరాభిషేకాలు, సేవ్ ఐలాపూర్ నినాదాలు, ప్రెస్‌క్లబ్‌లో ఆనందపు ప్రెస్‌మీట్లు, ఆనందం వ్యక్తీకరణ, ఐలాపూర్‌లో పటాకులు కాల్చి సంబరాలు… మరోవైపు అయ్యో అయ్యో పేదల నివాసాలను కూల్చేస్తున్నారని వెంటనే హరీష్ రావు ప్రకటన, తెల్లారే నమస్తే తెలంగాణలో ‘విచ్చలవిడి వీరంగనాథ్’ అంటూ పేజీల కొద్దీ శోక కథనాలు… సో, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతుదారు..? అక్రమార్కులేనా..?!
40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు సోదరులు… అత్యంత విలాసవంతమైన ఫామ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్, పండ్ల తోటలతో ఓ సోదరుడి రాజ్యం… మరో సోదరుడు అపార్ట్‌మెంట్టు కట్టి అమ్మేసుకున్నాడు… వీటి విలువే 720 కోట్లు అని ఓ అంచనా… నిజానికి అక్కడ మొత్తం ఉన్నది 1263 ఎకరాల ప్రభుత్వ భూమి, ఏకంగా 861 ఎకరాలు కబ్జా… బీఆర్ఎస్ సపోర్ట్… అందుకే వాళ్ల మీద ఈగ వాలలేదు…
దాదాపు 15 వేల కోట్ల విలువైన ఆ మొత్తం భూమిని ఇప్పుడు హైడ్రా కబ్జా నుంచి విడిపించి, అప్పటికప్పుడు కంచె వేసింది… ఆ అపార్ట్‌మెంట్లలో ఉన్నవారిని ముందే హెచ్చరించింది… కానీ వాళ్లనే ముందుపెట్టి అక్రమార్కులు ‘పేదల ఇళ్ల కూల్చివేత’ నాటకాలతో హైడ్రాను అడ్డుకునే విఫలప్రయత్నం చేశారు…
ఇక్కడ చెప్పుకోదలిచిన మొదటి అంశం… ఈ వెల్‌ప్లాన్‌డ్, వెల్ ఆర్గనైజ్‌డ్ భారీ ఆపరేషన్‌తో ‘ప్రభుత్వం ఉంది- అది పనిచేస్తుంది’ అనే ఓ విశ్వాసాన్ని సొసైటీలోకి పంపించగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… అందుకే ఆ ప్రాంత జనం జేజేలు కొట్టారు బాణాసంచా కాల్చి మరీ..!
రెండో అంశం ఏమిటి..? హైదరాబాద్‌ను బీఆర్ఎస్ నేతలు ఎలా పంచేసుకుని, ఆక్రమించేసుకుని, అమ్మేసుకుని వందలు, వేల కోట్లకు పడగలు ఎత్తారనేది మరోసారి జనానికి స్పష్టం కావడం… హైడ్రాకు మరిన్నికోరలు తొడిగితే ఆ జేసీబీలు, ఆ హిటాచీలు ఇంకెంత భారీ, అత్యంత భారీ ఆక్రమణల పాపాల్ని పగులగొడుతుందో అర్థం చేసుకోవచ్చు..!

Share this Article