పక్క పరవనిదే పొట్ట నిండదు… పైట చాపనిదే పూట గడవదు… వ్యాంప్ పాత్రలు వేసేవాళ్లే కాదు, ఎక్సట్రా ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ప్రతి నటి తెర వెనుక చీకటి ఇదే… పోనీ, మెజారిటీ కేసుల్లో..! కేస్టింగ్ కౌచ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం… ఆడదాన్ని జస్ట్, ఓ అంగడి సరుకుగా, ఆ టైమ్‌కు అక్కరకొచ్చే పడక సరుకుగా భావించబడే సినిమా ఇండస్ట్రీలో స్త్రీల మీద వివక్షే కాదు, భీకరమైన లైంగిక దోపిడీ…
మిగతా రంగాలేమైనా బాగున్నాయా అనే చర్చ వేరు… సినిమా ఓ పెద్ద ఆకర్షణ… ఆ రంగుల జీవితం అనే దీపం చుట్టూ పురుగులు… చివరకు వాటికే ఆహుతి… కొందరికి మాత్రమే ఫేమ్, ఆస్తులు, వైభోగం… బోరింగ్ పాపగా ఒకప్పుడు పాపులర్ జయలలిత… గుంటూరుకు చెందిన ఓ దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని… ఒక దశలో దర్శకుడు విశ్వనాథ్ మేనల్లుడిని పెళ్లి చేసుకోవాల్సిన స్థితిలో, అది ఎత్తిపోయి, కుటుంబం కోసమే సినిమాల్లో చేరి, నానా అడ్డమైన వేషాలూ వేసిన ఆమె కథ కూడా చాలామంది సినిమా తారల్లాంటిదే…
ఎవరూ చెప్పుకోరు… కానీ జయలలిత తనను బాధితురాలిగా చెప్పుకుంటూనే ఇండస్ట్రీలో ఆడవాళ్ల పట్ల మగాళ్ల ధోరణిని స్ట్రెయిట్‌గానే వివరించింది ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో… ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తూ, వయస్సుకు తగిన పాత్రలు వేస్తూ ఓ పద్ధతిగా కనిపిస్తున్న ఆమె ఒకప్పుడు పొట్టకూటి కోసం, వ్యాంప్ తరహా వేషాలు చాలా వేసిందని ప్రజెంట్ జనరేషన్‌కు తెలియకపోవచ్చు…
Ads
‘‘ఎస్, చాలామందికి లొంగిపోవాల్సి వచ్చింది… అది అవసరం… అందులో ప్రేమ, అభిమానం గట్రా ఏమీ లేవు… ఆ టైమ్‌కు అలా వాడేసుకుంటారు… తెల్లారిలేచాక మళ్లీ మామూలే… ఒక తప్పు చేశాక ఇక వంద తప్పులు చేసినా అంతే కదా, అందుకే లొంగిపోక తప్పలేదు… ఒక దశ దాటాక ఇక రక్షించుకునే ప్లాన్లన్నీ వేస్ట్… అవకాశాల కోసం తలుపులు తట్టడం, లొంగిపోవడం కామన్… తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేదని తెలిసినప్పుడు రాజీపడక తప్పదు…’’ అని కుండబద్ధలు కొట్టేసింది ఆమె…
సరే, ఇదంతా వోకే… కానీ ఎలాంటి వేషాలు వేసినా, అవకాశాల కోసం ఎలా రాజీపడినా ఆమెకూ ఓ మనస్సుంటుంది… అది నిజమైన ప్రేమ కోసం, తోడు కోసం పరితపిస్తుంది… ఫలితం ఏమైనా సరే… ఆ జయలలిత శోభన్‌బాబును అమితంగా ప్రేమించినట్టే… ఈ జయలలిత శరత్‌బాబును ప్రేమించింది… కానీ అప్పటికే ఆయనకు రమాప్రభతో పెళ్లయింది… ఆమె తన ప్రేమ గురించిన చెప్పిన కథే ఆ ఇంటర్వ్యూలో కనెక్టింగ్…
‘‘ఒకసారి పెళ్లి చెడిపోయిక ఇక పెళ్లి, పిల్లలు అనే ఆలోచనను తుడిచేసుకున్నా… చివరి రోజుల్లో ఓ తోడు కావాలని ఎవరు చెప్పినా నాకు ఎక్కలేదు… కానీ శరత్‌బాబుతో ఓ ప్రత్యేక బంధం… తను బాగా టూర్లు పోయేవాడు, నన్ను తీసుకువెళ్లమని పోరేదాన్ని, పోయేదాన్ని… ఓ బిడ్డను కూడా తనతో పొందాలని అనుకున్నా… వద్దు, మనమిద్దరమూ లేకపోతే బిడ్డ అనాథ అవుతుందని వారించాడు… మాది మనస్సులతో ముడిపడిన బంధం… బావా అనే పిలిచేదాన్ని, నాకు గైడ్… తను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చివరి రోజు దాకా రోజూ వెళ్లి చూసి వచ్చేదాన్ని… ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి చెబుతున్నా…’’ అంటూ తన అనుబంధాన్ని చక్కగా వివరించింది… నిజమే, ఆమె కూడా ఆడదే కదా, ఆమెకూ ఓ మనస్సుంటుంది కదా, అది ఓ నిజమైన ప్రేమానుబంధాన్ని కోరుకుంటుంది కదా… ఫలించినా ఫలించకపోయినా..!!
Share this Article