ఏ జెర ఊకో సుమక్కా… జెర సైసు… నువ్వేం తక్కువ జేసినవ్ శెప్పు… అసలు ఏ హీరో అయినా నీ అంత భుజాన వేసుకుని సినిమాను ఇంత ఘనం ప్రమోట్ చేసిన్రా ఎప్పుడైనా..? గిర్రగిర్ర నెలరోజుల నుంచి తిరుగుతనే ఉన్నవ్… దొరికిన పెద్ద పెద్ద హీరోలను పట్టుకుని ట్రెయిలరో, టీజరో, పోస్టరో రిలీజ్ చేయిస్తనే ఉన్నవ్… ప్రతి టీవీ ప్రోగ్రాముకు ప్రమోషన్ కి పోతివి… నీ ఎనర్జీ చూసి అందరూ ఆశ్చర్యపోయిన్రు కూడా… కానీ ఏం లాభమొచ్చె అక్కా…
నువ్వున్నవ్… గా మ్యూజిక్ కొట్టిన కీరవాణి ఉన్నడు… సినిమాల మీరిద్దరు తప్ప ఇంకెవరూ ఎవరికీ ఎర్కలేదు… సరే, జాన్దేవ్… నువ్వు కూడా మస్తు తిప్పల పడ్డవ్ యాక్షన్ చేయనీకి… కానీ నువ్వు సీరియస్‌గా మొహం పెట్టినప్పుడు గూడా క్యాష్ ప్రోగ్రాంల ఫన్ చేసే సుమే యాదికొస్తుంది, ఆ సుమే కనిపిస్తంది… సినిమాల కొన్ని సీన్లలో ఫన్ చేసినవ్, అక్కడ మంచిగనే ఉంది… నీకు తగ్గ సీన్లు… కానీ గా ఎమోషన్ సీన్లలో శాన ఫరక్ పడ్డది…
అదేందో గనీ… కమెడియన్ ఏడ్చినా, బాధపడినా మనకు నవ్వే వస్తుంటది… అది నీ తప్పు కాదులే అక్కా… నీ మొహం నవ్వు మొహం… మంచిగ నవ్వుతవ్, నవ్విస్తవ్, ఎవడైనా ఏమైనా అంటే రివర్స్ పంచ్ గట్టిగ కొడతవ్… అప్పటికప్పుడు మాటలకు వెతుక్కోవు, అలా నీ నోట్లో నుంచి వరదలా వచ్చేస్తనే ఉంటయ్… కానీ సినిమాలో ఫుల్ లెంత్ పాత్ర అటు కామెడీ గాకపాయె, ఇటు సీరియస్ గాకపాయె… అది మొత్తానికి నీకు సూట్ గాకపాయె…
Ads
ఇంకోటి మర్చిపోయినవ్… నువ్వు సీనియర్ యాంకర్‌వే… మస్తు సీనియారిటీ ఉంది… కానీ హోస్టింగ్, యాంకరింగ్ వేరు… యాక్టింగ్ వేరు… సపోజ్… పెద్ద పెద్ద పేరున్న నటులు గూడా ఓ కరీంనగర్ యాసను పలకలేక, తల్లకిందులైతరు… అంత వీజీగా పట్టుబడదు… గట్లనే చిత్తూరు యాస… అంత వీజీ కాదు… సేమ్, శ్రీకాకుళం యాస గూడా గంతే… అదింకా కష్టం పలకడం… ఆ విరుపు అక్కడి స్థానికులకే సొంతం… ఐనాసరే ఆ యాసలో మాట్లాడనీకి మస్తు కోశిష్ చేసినవ్… కానీ అంతా ఆర్టిఫిషియల్ అయిపాయె…
పోనీ, కథలో ఏమైనా పెద్ద పంచాయితీ ఉందా అంటే అదీ లేకపాయె… నీ మొగనికి పానం బాగుండదు… పైసలు కావాలె… అంతకు ముందు ఊరోళ్లకు మస్తు కానుకలు పెట్టిన, డబ్బు చదివించిన, నా అవసరానికి ఎవడు రాడా అనడిగితే… అందులో పెద్ద పరేషాన్ చేసే పంచాయితీ ఏముంది..? అంటే, మరీ జనం థియేటర్లకు వచ్చి చూసేంత ఏముంటుంది అని…! నువ్వేమో రెగ్యులర్ నటివి కాకపోతివి… టీవీల్లో చేసే యాక్షన్ వేరు… సినిమా వేరు… రెండూ సింక్ కాకపాయె… రకరకాల షేడ్స్ పలికించడం జెర కష్టమే… పేరుకు పెద్ద కీరవాణి, అంత పెద్దతనం ఏమీ కనిపించకపాయె… నువ్వేం చేస్తవ్ మరి దానికి..?!
కాకపోతే సినిమా నీట్‌గా ఉంది సుమక్కా… నీ స్థాయిని తగ్గించేటట్లు లేదు… వెకిలి, వెగటు సీన్ల జోలికిపోలేదు దర్శకుడు… అలా చేస్తే సుమక్క ఊరుకోదని భయపడ్డడేమో… ఊరి వాతావరణాన్ని మంచిగనే తీసుకొచ్చిండు… కానీ ఇవ్వాళ్రేపు సినిమాకు జనాన్ని రప్పించాలంటే థ్రిల్ కావాలె అక్కా… కాన్‌ఫ్లిక్ట్… బిగువైన స్క్రీన్‌ప్లే… ఎమోషన్… ఏవీ లేకపోతే హసీమజాక్ టైపు జాతిరత్నాలో, డీజే టిల్లో తీసుకోవాలె… నిజానికి నీకు గటువంటి ఫన్నీ రోల్స్ అయితే మస్తు ఫిట్టయితయ్… పోనీలే అక్కా… ఇంకా పొలం లేదా..? పొద్దు లేదా..? ఇది గాకపోతే మరో సినిమా… మరో పాత్ర… ఈసారి మాంచిగ ఫిట్టయ్యే రోల్ దొరకొచ్చులే…!! (ఈ సరదా నెరేషన్ కూడా అంతే సరదాగా తీసుకో అక్కా… జెర గుస్సా చేయకు… ఐనా నువ్వుబీ నీ ప్రోగ్రాములల్లో పంచులు వేస్తనే ఉంటవ్‌గా…)
Share this Article