Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రొఫెషనల్ నిద్ర..! గాఢమైన కునుకు తీస్తే చాలు కలలు, తోడుగా కాసులు..!!

September 9, 2024 by M S R

నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిముషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు.

కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం పరితపిస్తారు. నిద్రకు వేళాయెరా! అని తమను తాము జోకొట్టుకుంటూ సంగీతం వింటూ రాత్రంతా నిర్ణిద్ర గీతాలు విని తరిస్తూ ఉంటారు. కొందరికి మాత్రల్లో నిద్ర దొరుకుతుంది. కొందరికి మద్యంలో దొరుకుతుంది. కొందరికి ఏ సీ ల్లో దొరుకుతుంది. తమకు నిద్ర ఎందుకు పట్టడం లేదని కొందరు నిద్రపోతున్న వారిని తట్టి లేపి నిలదీస్తుంటారు. నిద్ర లేమి ఒక జబ్బు అని కొందరి భయం. నిద్ర లేమి ఒక మానసిక సమస్య అని కొందరి ఆందోళన.

సర్వంసహా చక్రవర్తి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్ర; పక్కనే కటికనేల మీద ఆయన బంటు పడుకున్న నిద్ర రెండూ ఒకటే అన్నాడు అన్నమయ్య.

Ads

“కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది”

అని శాస్త్రీయ నిరూపణను పాటలో బంధించి జోలపాడాడు ఆత్రేయ. నిజానికి నిద్ర విశ్రాంతి స్థితి. మెదడు, శరీరం బలం కూడగట్టుకోవడానికి అనువయిన సమయం. ప్రతి ఉదయం నూతనోత్సాహంతో పరుగులు పెట్టడానికి నిద్ర పెట్టుబడి. ఉత్ప్రేరకం. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి అత్యవసరం.

రాత్రి ఉద్యోగాలు, రాత్రి రాచకార్యాలు, అర్ధరాత్రి దాటినా టీ వీ, స్మార్ట్ ఫోన్లు చూస్తుండడాలు…ఇలా కారణమేదయినా నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయడమన్నది ఇప్పుడు దానికదిగా ఒక ఆనందం. ఒక నవీన సంస్కృతి. పగటి నిద్ర పనికి చేటు. రాత్రి మేల్కొలుపు ఒంటికి చేటు. గూట్లో దీపం; నోట్లో ముద్ద; కంటికి కునుకు- ఒకప్పటి సామెత. చుక్కలు పొడిచేవేళకు ఆదమరచి నిద్రపోవాలి. సూర్యుడు పొడవకముందే నిద్రలేవాలి.

కొందరు కళ్లు తెరిచి పడుకోగలరు. కొందరు ఎక్కడయినా పడుకోగలరు. కొందరు నడుస్తూ పడుకోగలరు. కొందరు నిద్రలోనే పోతారు. కొందరు నిద్రపోకుండానే పోతుంటారు. కొందరు సరిగ్గా నిద్రకు ముందే భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కథల సీరియళ్లు, హారర్ సినిమాలు చూసి నిద్రకు దూరమవుతారు. లేదా అలాంటి మనుషులను తలచుకుని తలచుకుని నిదురరాని రాత్రిళ్లు గడుపుతుంటారు.

sleep

కుంభకర్ణుడి నిద్ర యుగయుగాలుగా ఒక కొలమానం. సామాన్యులు అందుకోలేని నిద్ర అది. ఊర్మిళ నిద్ర కూడా జగద్విదితమే. భారతంలో రాయబార ఘట్టంలో కపట నిద్రలు, దొంగ నిద్రలు మనకు తెలిసినవే. యోగనిద్ర యోగవిద్యతో మాత్రమే సాధ్యమయ్యేది. ఇక ఎప్పటికీ లేవలేనిది శాశ్వత నిద్ర. తెలుగు సాహిత్యంలో ఇంకెవరూ వాడని “పెద్ద నిద్ర” అన్న మాటను శ్రీనాథుడు ప్రయోగించాడు.

నిద్రలో కలలు నిజమనుకుని కొందరు మేలుకున్నాక నాలుక కరుచుకుంటారు. కొందరు మెలకువలోనే కలలు కంటూ ఉంటారు. రామాయణంలో త్రిజట స్వప్నం నిజమయ్యింది కాబట్టి మన కలలు కూడా నిజం కాకపోవు అని స్వప్నశాస్త్రం చుట్టూ తిరుగుతూ ఉంటాం. పగలు చూస్తే కొందరు రాత్రి కలలోకి వస్తారు. దుస్వప్నాలు రాకుండా కాపాడాల్సిందిగా ప్రార్థనలు కూడా ఉన్నాయి. లేస్తే మనుషులు కారు కాబట్టి కొందరు త్వరగా లేవరు. రాముడికి విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామా! అని అందంగా, శ్రావ్యంగా మేలుకొలుపు పాడాడు. మనకు పాలవాళ్లు, పేపర్ బాయ్ లు, ఇంకెవరో తలుపులుబాదుతూ మేలుకొలుపు పాడతారు. వెంకన్నకు అన్నమయ్య జోలపాట పాడాడు. భద్రాద్రి రామయ్యకు రామదాసు జోల పాట పాడాడు. అయోధ్య రామయ్యకు త్యాగయ్య జోలపాట పాడాడు. మనకెవరు పాడతారు జోలపాటలు?

ఆకలి రుచి ఎరుగదు- నిద్ర సుఖమెరుగదు. అలసిన శరీరం హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. మనసులో వేన వేల ఆందోళనలు, భయాలు, బాధలు, ఆలోచనలు ఎగసి ఎగసి పడుతుంటే నిద్ర రమ్మన్నా రాదు. జీవితం ఎప్పుడూ యుద్ధమే. గెలిచినా, ఓడినా యుద్ధం ఆగదు. దైనందిన జీవితంలో ఏ రోజుకారోజు పోరాటమే. ఈ పోరాటానికి తగిన శక్తిని కూడగట్టి ఇచ్చేది నిద్ర ఒక్కటే. నిద్ర ఎక్కువయితే నిద్ర మొహం. తక్కువయితే నిద్రకు మొహం వాచిన ముఖం.

నిదురించే తోటలోకే పాటలు వస్తాయి. వచ్చి కొమ్మల్లో రెమ్మల్లో పూలను పూయిస్తాయి. కళలకు రంగులద్దుతాయి. కలల గాలులకు గంధం పూస్తాయి.

pay for sleep

“సుఖనిద్రకు మా పరుపులే వాడండి” అని ప్రచారం చేసుకునే పరుపుల తయారీ కంపెనీలు సరికొత్త నిద్రోద్యోగాలను సృష్టించాయి. రకరకాలుగా తమ పరుపుల నాణ్యతగురించి ప్రచారం చేసుకునే కంపెనీలు నిజంగా ఆ పరుపుల మీద పడుకుంటే వారు చెప్పినట్లు హాయిగా నిద్ర పడుతుందో! లేదో! ప్రయోగాత్మకంగా పరీక్షించుకోవాల్సి వస్తోంది. దాంతో రాత్రిళ్లు 8 నుండి 9 గంటలు ఆదమరచి నిద్రపోయే…వీలయితే మధ్యాహ్నం కూడా 20 నిముషాలు నిద్రపోయేవారికి సంవత్సరానికి అక్షరాలా 10 లక్షల రూపాయల ఉపకార వేతనమిచ్చే “ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్ షిప్” శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రముఖ పరుపుల తయారీ కంపెనీ వేక్ ఫిట్. ఇందులో శిక్షణ పొంది…పాసయిన వారికి మరింత ఎక్కువ జీతంతో తమ కంపెనీలో నిద్రా పరీక్షల విభాగంలో ఉద్యోగాలు ఇస్తారు.

లోకంలో పరీక్షలకు ఎవరైనా నిద్ర మేల్కొంటారు.
వేక్ ఫిట్ పెట్టే పరీక్షలో మేల్కొన్నవారు నిద్రలోకి జారుకుంటారు!
ఇక్కడ ఎంత నిద్రకు అన్ని మార్కులు. ఎంత నిద్రకు అంత డబ్బులు!

అన్నట్లు-
ఇంగ్లిష్ లో ఉన్న “ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం”ను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా కీర్తి కిరీటం పెట్టుకున్న ది గ్రేట్ తెలుగులో ఏమనాలబ్బా!

భాష విషయంలో నిద్రపోయిన జాతి ఏమన్నా ఏమనుకోదు కాబట్టి…
“శయన వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమమం” అందామా!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions