.
మనలో చాలామంది మన దేశ సంస్కృతిని, ఆధ్యాత్మికతను, వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేక పరాయి సంస్కృతులను ప్రేమిస్తున్నారు… కానీ పరాయి దేశస్థులు మాత్రం మన వైపు ఆకర్షితులవుతూ ఉంటారు… తమ జీవన శైలి మార్చుకుని, మన కల్చర్‌ను అడాప్ట్ చేసుకుని, కొత్త జీవితాల్ని గడుపుతుంటారు…
క్రికెట్ ప్రేమికులకు ఓ పేరు తెలిసే ఉండాలి… జాంటీ రోడ్స్… ప్రపంచ క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డర్… ఫ్లయింగ్ క్రికెటర్… తన క్యాచులు, తన థ్రోలు, తన డైవ్‌లు వరల్డ్ ఫేమస్… ప్రత్యేకించి ఓ 1999 వరల్డ్ కప్ మ్యాచులో కీత్ ఆర్థర్‌టన్‌ను రనౌట్ చేసిన తీరు నభూతో… తను టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన (నాన్-వికెట్ కీపర్) ఆటగాళ్లలో ఒకరు…
Ads
(క్రికెటర్ మాత్రమే కాదు, బార్సిలోనా ఒలింపిక్స్‌కు ఎంపికైన దక్షిణాఫ్రికా హాకీ జట్టు సభ్యుడు… కాకపోతే గాయం కారణంగా ఆడలేదు…)
సాధారణంగా, ప్రపంచ స్థాయి క్రీడాకారులు రిటైర్మెంట్ తర్వాత లేదా కెరీర్ కొనసాగిస్తున్నప్పుడు లండన్, న్యూయార్క్ లేదా జోహన్నెస్‌బర్గ్ వంటి మెగా నగరాల్లో గ్లామర్ జీవితాన్ని గడపాలని చూస్తారు… విరాట్ కోహ్లీ లండన్ ప్రవాస జీవితం ఓ ఉదాహరణ అనుకోవచ్చు… కానీ, వర్ణ వివక్ష చరిత్ర కలిగిన తన దేశంలో పుట్టి, ప్రపంచ వైరుధ్యాలను చూసిన రోడ్స్… తను శాంతిని, తన కుటుంబానికి స్వచ్ఛతను వెతుక్కునే క్రమంలో ఇండియాలోని దక్షిణ గోవాను తన గమ్యంగా అర్థం చేసుకున్నాడు…
ఓ మత్స్యకార గ్రామంలో స్థిరపడ్డాడు… ఈమధ్య ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్తూ ఓ ట్వీట్ చేశాడు… ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా ఎయిర్ క్వాలిటీ ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు… తను నివసించే గోవా గ్రామం ఢిల్లీకి ఎలా కంట్రాస్టో చెప్పాడు… ఆ ట్వీట్ చూశాకే రోడ్స్ ఎక్కడ ఉంటున్నాడు, ఎందుకు అనే ఓ ఆసక్తి కలిగింది…
దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష (Apartheid) పాలన ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చింది ఆ జట్టు… రోడ్స్ మెరిట్ ప్రపంచానికి తెలిసింది.., ప్రపంచంలోని వైరుధ్యాలను దగ్గరగా చూశాడు… తను క్రికెట్ ఆడటానికి వెళ్లిన ప్రతి దేశం గురించి స్టడీ చేశాడు, చూశాడు, తెలుసుకున్నాడు…
ఇండియా మాత్రమే నచ్చింది… తన దృష్టిలో, భారతదేశం కేవలం క్రికెట్ ఆడే దేశం కాదు…. వేలాది ఏళ్ల సంస్కృతి, భాషలు, ఆహారాలు, సంప్రదాయాలు కలగలిసిన అద్భుతమైన గమ్యస్థానంగా తెలుసుకున్నాడు…
ఈ వైవిధ్యమే ఎంతగానో ఆకర్షించింది… ఇక్కడే స్థిరపడేలా చేసింది… తనకు ఇద్దరు భార్యలు, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, పుష్కరం క్రితం విడాకులు… మళ్లీ పెళ్లి చేసుకున్నాడు… ఈమెకూ ఇద్దరు పిల్లలు… ఆమెతోపాటు ఇక్కడే ఉంటున్నాడు… ఆమె కూడా రోడ్స్ నిర్ణయాన్ని, ఆలోచనలను గౌరవించింది… ఇండియా మీద తన ప్రేమకు గుర్తుగా ఓ కుమార్తెకు ‘ఇండియా జీన్ రోడ్స్’ అని పేరు పెట్టుకున్నాడు…
కోచింగ్ నుండి ఆధ్యాత్మికత వైపు పయనం
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడే రోడ్స్… ఆ సమయంలోనే రోడ్స్‌కు ఇండియా పట్ల అభిమానం, ఆకర్షణ పెరిగాయి… ఆధ్యాత్మికంగా తనకు గంగా నదితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది… కాలుష్య సమస్యలున్నప్పటికీ, ఆ నదిలో స్నానం చేసినప్పటి ఫీల్ అనిర్వచనీయం అంటాడు తను…
గోవాలోని చిన్న ఫిషింగ్ గ్రామంలో కొత్త జీవితం
ప్రస్తుతం జాంటీ రోడ్స్ తన రెండవ భార్య మెలానీ వుల్ఫ్, వారి పిల్లలు (ఇండియా, నాథన్) తో కలిసి సౌత్ గోవాలోని ఒక చిన్న ఫిషింగ్ గ్రామంలో నివసిస్తున్నాడు… ఈ స్థిర నివాసం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి…
- స్వచ్ఛమైన గాలి…: ముంబై లేదా ఢిల్లీ వంటి మెట్రో నగరాల కాలుష్యానికి దూరంగా, సముద్రపు గాలి ఉండే స్వచ్ఛమైన వాతావరణంలో తన పిల్లలు పెరగాలని ఆయన కోరుకున్నాడు…
- ప్రశాంత జీవనం…: క్రికెట్ ప్రపంచంలోని ఒత్తిడికి, గ్లామర్‌కు దూరంగా, ప్రకృతికి దగ్గరగా, నిశ్శబ్దమైన జీవనశైలిని ఆయన ఎంచుకున్నాడు…
- సాధారణ విద్య…: ఆయన తన కుమారుడు నాథన్‌ను గోవాలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో చేర్పించాడు… సాధారణ, ప్రశాంతమైన వాతావరణంలో వారి చదువు కొనసాగేలా చూస్తున్నాడు…
ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే క్రికెట్ మైదానాల్లో పరుగులు తీసిన ఆ మేటి ఫీల్డర్, నేడు గోవా తీరంలో తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడు… సముద్రతీరంలో ఉషోదయాలు వీక్షిస్తూ, సూర్యాస్తమయ రంగుల్ని ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ… ఏ ఒత్తిడీ లేని, ఓ ప్రశాంత, స్వచ్ఛ వాతావరణంలో బతుకుతున్నాడు..!!
Share this Article