క్షుద్రరాజకీయాల ప్రస్తావన కాసేపు వదిలేద్దాం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకు లేదా ప్రసారం చేసుకున్న వీకెండ్ కామెంట్… ఫాఫం, మరీ వీక్ అయిపోయింది… ఎంత వీక్ అంటే… తను గతంలో రాశాడు కదా… ‘‘అప్పుడప్పుడూ తాను ఏసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటాను, నాన్న వైఎస్ ఆత్మతోనూ మాట్లాడతాను అని జగన్‌రెడ్డి ఉన్నతాధికారుల భేటీల్లో చెబుతున్నాడు…’’ అని…! సహజంగానే దానిపై యాంటీ-టీడీపీ సెక్షన్ విరుచుకుపడింది… నిజంగా జగన్ అధికారుల భేటీల్లో అలా చెబుతున్నాడా..? కావాలని యెల్లో బ్యాచ్ జగన్‌ను ఓ మానసిక వ్యాధిగ్రస్తుడిగా చిత్రీకరించే కొత్త ప్రణాళికను అమలు చేస్తోందా..? అనే సందేహాల్ని న్యూట్రల్ జర్నలిస్టులు కూడా వ్యక్తీకరించారు… తొలిసారి రాధాకృష్ణ తన రాతలకు సుదీర్ఘ సమర్థనను, వివరణను ఇచ్చుకోవాల్సి వచ్చింది… ఇచ్చాడు… జర్నలిస్టుగా నేనెవడికీ తలవంచలేదు, వంచను అనే టెంపర్మెంట్ చూపిస్తూనే… తనపై సాగుతున్న ట్రోలింగుకు సమాధానాలు చెప్పుకుంటున్నాడు… రాతల్లో నిజం ఉన్నప్పుడు, అది నిజమేరోయ్ అంటూ గట్టిగా గొంతెత్తి చెబుతూ… జర్నలిజం పాఠాల్లోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దేనికి..?
తన కెరీర్లో ఒక ఇష్యూ గురించి ఇంతగా వివరణ ఇచ్చుకోవడం ఇదే తొలిసారి కావచ్చు… ఒకవైపు తనే చెబుతున్నాడు, ఈ నీలిమీడియా (జగన్ భక్తగణం అట) తనపై అనవసరంగా గుండెలు బాదుకుంటోంది అని… అలాంటప్పుడు ‘‘నేను నిజమే చెబుతున్నాను, నమ్మండ్రా బాబూ’’ అనే వివరణ, స్పష్టీకరణలు దేనికి..? ‘‘షర్మిల పార్టీ గురించి చెప్పాను, నమ్మలేదు, కానీ జరిగిందా లేదా..?’’ అని ఓ ఉదాహరణ చెప్పేసి, అసలు ఈ సంపాదకీయ రాతల చరిత్రను కూడా చెప్పుకొచ్చాడు… ‘‘నేను జర్నలిజంలోకి ప్రవేశించిన కొత్తలో ‘హిందూ’ బ్యూరో చీఫ్‌గా రాజేంద్రప్రసాద్, ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు సుందరం, ‘దక్కన్ క్రానికల్’కు రవీంద్రనాథ్, ‘ఈనాడు’కు ఎస్.ఎన్.శాస్త్రి, ‘ఆంధ్రజ్యోతి’కి ఐ.వెంకట్రావ్, ‘ఆంధ్రపత్రిక’కు పాపయ్యశాస్త్రి బ్యూరో చీఫ్లుగా ఉండేవారు… తమ పేరిట కాలమ్స్ రాసేవాళ్లు… ప్రభుత్వ ముఖ్యులు కూడా అందులో సమాచారాన్ని మాత్రమే తీసుకునేవారు తప్ప, నీకు ఎవడు చెప్పాడు అని అడిగేవాళ్లు కాదు… ఐనా జర్నలిస్టు తన సోర్స్ ఎప్పుడూ వెల్లడించడు తెలుసా..? సుప్రీంకోర్టు కూడా సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది గతంలో…’’ అని రాసుకుంటూ పోయాడు…
Ads
నిజం… ఒకప్పుడు ఏ కాలమిస్టు ఏం రాసినా పాఠకులు చదివేవాళ్లు… కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే మార్గం లేదు… అందుకే అవన్నీ చెలామణీ అయిపోయాయి… ఇప్పుడు సోషల్ మీడియా అనే ఓ వేదిక దొరికింది జనానికి… ఏ రాతల వెనుక మర్మం ఏమిటో, ఎందుకోసం రాయబడ్డాయో కూడా పాఠకులు ఇట్టే పట్టేసుకుంటున్నారు, చాకిరేవు పెట్టేస్తున్నారు… సాధారణంగా రాధాకృష్ణ ఇలాంటి కామెంట్లపై స్పందించడు… అవసరం లేదు కూడా… సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే ఇక టైమంతా దానికే… సమర్థించుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నాడు అనే అభిప్రాయాన్ని, ఆ రాతల్లోనే ఏదో దోషమున్నట్టుంది, అందుకే ఈ పాట్లు అనేందుకు ఆస్కారం కల్పించినట్టు..! నిజమే… సోర్స్ గురించి చెప్పనక్కర్లేదు, సోర్స్ గురించి చెప్పడం మొదలుపెడితే ఇక జర్నలిస్టులతో ఎవడూ మాట్లాడడు… కానీ ఒకవైపు బ్లూమీడియా అని నువ్వే నిందిస్తూ, ఇప్పుడిలా ట్రోలర్స్‌కు సోర్స్ గురించిన పాఠాలు చెప్పడం దేనికి..?
ఒకటి మాత్రం కఠోరసత్యం… కాలమిస్టుల రాతలకు రాగద్వేషాలుంటయ్… వాళ్ల కళ్లతోనే పరిణామాల్ని చూస్తారు, విశ్లేషిస్తారు… తెలుగు పత్రికల్లో కాలమిస్టులు భిన్నమేమీ కాదు… ఈనాడు సంపాదకీయ పేజీలో గతంలో ఎవరైనా కామెంట్రీ రాసేవాళ్లేమో గానీ ఇప్పుడు లేదు… సాక్షిలో కేవలం డప్పులే… కాలాల కొద్దీ పరిచినా ఎవరూ చదవరు… అందులో భజన, జగన్ సమర్థన తప్ప ఇంకేమీ ఉండదు… పైగా చైనా జిన్‌పింగ్, నార్త్ కొరియా కిమ్ గురించి రాయాల్సి వచ్చినా… తిప్పీ తిప్పీ ఆవువ్యాసంలాగా మళ్లీ చంద్రబాబును తిట్టేస్తాయి ఆ వ్యాసాలు… వాటి విలువ అదీ… నమస్తేను పింక్ పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటారు, పత్రికగానే గుర్తించరు, కాబట్టి ఆ కాలమ్స్‌ను ఏకాలంలోనూ కాలమ్స్‌గా పరిగణించాల్సిన పనిలేదు… మిగతా పత్రికల గురించి చెప్పుకునే పనిలేదు… ఉదాహరణకు తెలకపల్లి రవి రెగ్యులర్ కాలమిస్టు… కానీ ప్రతి అక్షరమూ ఎర్రగా, సీపీఎం సీతారాం ఏచూరి రాస్తున్నట్టే ఉంటుంది… ఆంధ్రజ్యోతి కాలమ్స్‌లో కొన్ని వితండవాదాలు ఉంటయ్… ఆ ఎడిటర్ రాసేది సగటు రీడర్‌కు ఏమాత్రం ఎక్కదు, అది మరీ మార్మికశైలి… సరే, ఎవరి శైలి ఎలాంటిదైనా సరే, భిన్నవాదనలకు వేదిక ఆ పేజీ… ఇక కొత్తపలుకు సాక్షాత్తూ పత్రిక ఓనర్ రాసేది కాబట్టి, తెలుగుదేశం అనుకూల పత్రిక అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి, జగన్ ద్వేషి అనే అభిప్రాయం ఉంది కాబట్టి సహజంగానే జనం చదువుతారు… ఐతే కాలమిస్టులు తమ రాతలకు ఇంతగా వివరణలు చెప్పుకోవడమే కాస్త నవ్వొచ్చేదిగా ఉంది…
చివరగా :: ఆంధ్రజ్యోతి పంథా గురించి చెబుతూ… అధికారంలోకి రాగానే ఆంధ్రజ్యోతిని అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు కదా… ప్రత్యేకంగా జీవోలు తీసుకొచ్చారు కదా… నన్ను జైల్లో పడేస్తానంటిరి కదా… మరి ఏమైంది..? ఏమీ చేయలేకపోయారు దేనికి..? అని జగన్ పార్టీని, సర్కారును సూటిగా ప్రశ్నించాడు రాధాకృష్ణ… మీరేమీ చేయలేకపోయారు కాబట్టి నేను తప్పుచేయనట్టే అనేది కాస్త వింత సమర్థనే అయినా… రండోయ్, చేతనైతే జైలులో వేయండి, నావి తప్పుడు రాతలని నిరూపించండి అంటున్నాడు… రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలా తలెగరేసి ప్రశ్నిస్తున్నది మాత్రం కేవలం రాధాకృష్ణే…!!
Share this Article