నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు…
బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… జూనియర్ ఎన్టీయార్ మాత్రమే ఇక ఈ పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపేది అని…
లోకేష్‌కు తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు, పప్పు సుద్ద అని వెక్కిరింపులు వైసీపీ బ్యాచుల నుంచే కాదు, తెలుగుదేశంలోనూ అంతర్గతంగా..! ఎన్టీయార్ రూపురేఖలే, ఆ నటప్రతిభను పుణికిపుచ్చుకున్న జూనియర్ నిజంగానే మంచి నటుడు… కాకపోతే తెలుగు సినిమా కమర్షియల్ లెక్కల చట్రంలో పడి, తనూ ఓ రొటీన్ ఇమేజీ బిల్డప్ పాత్రల్లో పడిపోతున్నాడు…
Ads
గతంలో నందమూరి కుటుంబం మొత్తం జూనియర్‌ను దూరంగా ఉంచినా సరే, చంద్రబాబు పిలిచాడు, అందరినీ నచ్చజెప్పాడు… ఆ కుటుంబసభ్యుడిని చేశాడు… జూనియర్ కూడా తన శక్తికి మించి చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు… కానీ నీరు నీరే, రక్తం రక్తమే… వారసుడు లోకేషే కదా… అందుకని క్రమేపీ జూనియర్‌ను దూరం పెట్టేశాడు…
చంద్రబాబు తత్వం, కోరిక అర్థమయ్యాయి జూనియర్‌కు… పార్టీకి ఓ కార్యకర్తలాగా వర్క్ చేయాల్సిందే తప్ప దాన్ని ఎప్పుడూ ఓన్ చేసుకునే సిట్యుయేషన్ ఉండదు… దాంతో తనూ దూరం జరిగాడు… తను, తన సినిమాలు, అంతే… అసలు తెలుగుదేశంతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ఉండిపోయాడు…
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం ఎదుర్కొంటున్న విషమ స్థితుల పట్ల కూడా జూనియర్ ఎప్పుడూ స్పందించలేదు… చంద్రబాబు భార్య భువనేశ్వరి పట్ల వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, చంద్రబాబు అరెస్టు వంటి సందర్భాల్లో కూడా జూనియర్ పేరెక్కడా వినిపించలేదు, అంటే స్పందించినట్టు కనిపించలేదు…
స్ట్రిక్టుగా తను అనుకున్నట్టే రాజకీయాలకు దూరంగా ఉండిపోయాడు… కానీ ఎప్పటికైనా సరే జూనియరే ఈ పార్టీకి దిక్కు అనే భావన మాత్రం పార్టీ శ్రేణుల్లో పోయేది కాదు… కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు… సీన్ కట్ చేస్తే…
చంద్రబాబు ఈ వయస్సులోనూ తిరిగాడు, కష్టపడ్డాడు, చెమటలు కక్కాడు… పార్టీని కాపాడుకున్నాడు… తన అనుభవాన్ని మొత్తం రంగరించి బీజేపీ, జనసేనతో చేతులు కలిపాడు… జగన్, నీ ఎదుట తలవంచను అని సవాల్ చేశాడు… జనం మెచ్చారు… జగన్‌ను మరీ ఘోరంగా 11 సీట్లకు పరిమితం చేస్తూ చంద్రబాబుకు కిరీటం పెట్టారు… పప్పుగా ఎగతాళికి గురైన లోకేష్ కూడా మంచి మెజారిటీతో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు… ఎంతోకొంత పరిణతి కూడా వచ్చింది… పప్పు అని బీజేపీ పదే పదే వెక్కిరించిన రాహుల్ ఇప్పుడు వాళ్లనే వెక్కిరించేలా ఎదిగాడు… (పప్పు అంటే పౌష్టికాహారం)…
మళ్లీ చంద్రబాబు హవా ఆరంభం… జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు అందరి దృష్టీ తనపైనే..! సరే, దీనికి అనుభవం, కాలం, అదృష్టం, శ్రమ అన్నీ కలిసొచ్చాయి… పదే పదే వినిపించిన అదే జూనియర్ పేరు ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు… ఏ ప్రస్తావనల్లోనూ లేడు…
Share this Article