Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పటికీ కరోనా పేరు చెప్పి భయపెట్టే బూచాళ్లు ఉన్నారు, జాగ్రత్త సుమా…!!

January 23, 2022 by M S R

Amarnath Vasireddy……   ఓమిక్రాన్ సోకి కోలుకొన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయా ? కరోనాకు టాటా చెప్పేముందు కొన్ని ముఖమైన మాటలు! శ్రద్ధగా చదవండి… నవంబర్ నెల చివరి వారంలోనే ఓమిక్రాన్ వల్ల ప్రమాదం లేదని, ఇది జలుబు లాంటిదని, తేటతెల్లం అయిపోయింది. కానీ సంక్రాంతి పండుగ దాకా, ఓమిక్రాన్ సోకితే ప్రాణాలు పోతాయని, లాక్ డౌన్ పెట్టేస్తున్నారని, భీతి గొలిపే ప్రచారం జరిగింది… నేను ఈ మెసేజ్ రాసేనాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నూటికి డెబ్భై మందికి, ఓమిక్రాన్ సోకింది… ఇంట్లో ఉంటూ ఒకటి రెండు రోజుల్లో అత్యధికులు కోలుకున్నారు… కరోనా అంటే భయం పోయింది…

ఓమిక్రాన్, కరోనా యొక్క శాంత స్వరూపం అని నేను నవంబర్ చివరి వారంలోనే చెప్పాను. ఆ మెసేజ్ వైరల్ అయ్యింది. కానీ భయపెట్టే ప్రచారం చేసేవారు పట్టువీడలేదు. భయపెడుతూనే వచ్చారు. ఎందుకలా? సమాధానం ఈ రోజు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. జనాల్లో భయం ఉంటేనే టెస్ట్ ల కోసం పరుగెత్తుతారు. కర్చీఫ్ తో తుడిచేస్తే పొయ్యే జలుబుకు, ఈ టెస్ట్ లు, ఆ టెస్ట్ లు, ఈ మందులు , ఆ మందులు అంటూ వేలకు వేలు ఖర్చుపెడుతారు. అదే వారికి కావల్సింది. మన భయం వారికి కామధేనువు, కల్పవృక్షం. జనాల్లో భయం పోగొట్టి సరైన అవగాహన కల్పించడానికి పెద్ద యుద్ధం లాంటిది చేయాల్సి వచ్చింది. సత్యమేవ జయతే అన్నారు. సత్యమే గెలుస్తుంది. ఈ రోజు ఓమిక్రాన్ గురించి వాస్తవాలు, భయపెట్టే ఫార్మాసురుల కుట్రల గురించి అందరికీ తెలిసిపోయింది.

ఫార్మాసూరులు పట్టువీడరు. నిజాన్ని పాతరేస్తే గానీ వారి గోడౌన్లు, డబ్బు సంచులతో నిండవు. “ఓమిక్రాన్ అయితే సోకి నయం అయిపోయింది. ముందుంది ముసళ్ల పండుగ. సోకి కోలుకొన్నా ఆరోగ్య సమస్యలు తప్పవు” అంటూ జనాల్లో మరో వారం పది రోజుల్లో భయాలు సృష్టిస్తారు. అందరూ భయంతో టెస్ట్ లు చేసుకొని ఏవో మందులు తినే పరిస్థితి కలిపిస్తారు.

Ads

omicron

పోస్ట్- ఓమిక్రాన్ సమస్యలు ఉంటాయా? అంటే ఓమిక్రాన్ సోకి కోలుకున్నాక కూడా సమస్యలు వస్తాయా? గతంలో… అంటే మొదటి వేవ్ { ఆల్ఫా రకం కరోనా }, రెండో వేవ్ { డెల్టా రకం కరోనా } వేరు … ఇప్పుడు ఉన్న ఓమిక్రాన్ వేరు. ఈ ఓమిక్రాన్ గొంతు దాటి శరీరంలోకి దిగలేదు. రెండు మూడు రోజుల్లో చచ్చిపోయింది. గతంలో కరోనా సోకినవారి బిపి పెరగడం, గ్లూకోస్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం, రక్తంలో క్లోట్స్ అంటే చిన్నపాటి గడ్డలు వచ్చి గుండెపోట్లు, పక్షవాతం లాంటి సమస్యలు కన్పించాయి… గతంలో పోస్ట్ కరోనా, అంటే కరోనా సోకి కోలుకొన్న తరువాత వచ్చిన సమస్యలు, ఎందుకు వచ్చాయో తెలుసుకొందాము. వీటికి మూడు ముఖ్య కారణాలు…

1 . స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి. “అయ్యో, కరోనా సోకితే ఏమవుతుందో అన్న భయం, సోకిన వారు ఇంట్లో/ ఆసుపత్రిలో ఏకాంతంగా ఉండాల్సిన స్థితి, నెలల తరబడి ఇంట్లో ఉండాల్సి రావడం, లాక్ డౌన్ వల్ల చితికిన ఆదాయాలు… ఇలాంటి అనేక కారణాల వల్ల మన సమాజంలో అత్యధికులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఎక్కువ మరణాలకు, అనారోగ్య సమస్యలకు ఇదే కారణం. ఒత్తిడి వల్ల తలనొప్పి, ఛాతినొప్పి, బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం, బిపి పెరగడం, నీరసం , కడుపునొప్పి, నిద్ర పట్టకపోవడం, జుట్టు రాలిపోవడం, కోపం, అసహనం, మానసిక కుంగుబాటు, గుండెపోటు, పక్షవాతం, ఆకలి తగ్గిపోవడం లేదా ఎక్కువ తినడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఎక్కువ కావడం… లాంటి అనేక సమస్యలు వస్తాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలు మన చుట్టూరా ఉన్న వారిలో నేడు సాధారణం అయిపోయాయి. వీటికి కారణం కరోనా కాదు. రోగం కన్నా చికిత్స ప్రమాదం అంటారు. కరోనాను తరిమి కొట్టాలని అవగాహన లేకుండా చేసిన పనులు, ప్రచార హోరు మానసిక ఒత్తిడికి ముఖ్య కారణం.” భయం వద్దు .. అప్రమత్తత ముద్దు” అని తొలి రోజుల నుంచి నేను చెబుతూనే వున్నాను….

2 . అధిక శాతం పోస్ట్ కరోనా సమస్యలకు రెండో కారణం….. కరోనా చికిత్సలో మోతాదును మించి , అవసరం లేకపోయినా వాడిన మందులు . స్టెరాయిడ్లు అధికంగా వాడడం వల్ల ఇమ్మ్యూనిటి దెబ్బ తిని బ్లాక్ ఫంగస్, టిబి, ఎయిడ్స్ లాంటి అనేక రోగాలు రావడం , రక్తంలో కొవ్వు శాతం పెరిగి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరగడం, కిడ్నీ లివర్ దెబ్బ తినడం, ప్రోస్ట్రేట్ గ్రంధి, ఎముకలు, కీళ్లు దెబ్బ తినడం, మహిళల్లో పీరియడ్స్ రావడంలో సమస్యలు… ఇలా అనేక సమస్యలు వస్తాయి. వస్తాయి కాదు. వచ్చాయి. రెండిసివర్ సైడ్ ఎఫెక్ట్స్ – గుండె వేగంగా కొట్టుకోవడం, వామిటింగ్, వణుకు, నీరసం, రాష్, శ్వాస తీసుకోవడంలో సమస్యలు; ఫ్లాబిఫ్లూ సైడ్ ఎఫెక్ట్స్.. తెల్ల రక్త కణాల పెరుగుదల, అసిడిటీ, డయేరియా…, ఇవెర్మీకటిం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ – ఎలర్జీ , డయేరియా.., మోనో క్లోనల్ యాంటీబాడీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్.. చలి, జ్వరం, నీరసం, low బిపి, వాంతులు. ఇక వాక్సిన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది… ఒక్కో మందు పదేసి సైడ్ ఎఫెక్ట్స్. కానీ తెలివిగా, వీటినన్నింటినీ కరోనా ఖాతాలో కలిపేశారు . కరోనా సోకడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయని జనాల్ని నమ్మించేసారు.

౩. కరోనా సోకడం వల్ల సమస్యలే రావని కాదు. గతంలో అంటే… ఆల్ఫా, డెల్టా కరోనా సోకడం వల్ల ఇమ్మ్యూనిటి బలంగా లేని వారికి వ్యాధి ముదరబెట్టి రక్తంలో క్లోట్స్ దానివల్ల గుండెపోటు, మెదడు పోటు వచ్చాయి. అంతకంటే మించి శాఖాహారుల్లో బి 12 విటమిన్ లోపం వల్ల సైటోకిన్ స్ట్రామ్ లాంటివి వచ్చి ఊపిరితిత్తుల్ని దెబ్బ తీశాయి.

ఎండలో తిరగండి .. శరీరానికి డి విటమిన్ అందించండి. శాకాహారులు బి 12 విటమిన్ మాత్రలు తీసుకోండి. రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే పల్స్ ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసుకోండి. అది 94 కంటే తక్కువకు పోవడం జరిగితే, వెంటనే అంబులెన్సు ని పిలవండి అని నేను రెండేళ్లుగా చెబుతున్నాను. నేను సూచించిన మార్గంలో వెళ్లి లక్షలాది మంది కరోనా గండాన్ని సులభంగా గట్టెక్కేసారు. తెలియని వారు, భయపడిన వారు పాపం భారీగా నష్టపోయారు.

అయిందేదో అయ్యింది. ఇప్పటికైనా మేల్కొనండి. భయం వద్దు. భయపెట్టే మార్కెటింగ్ మాయాజాలంలో చిక్కొద్దు. (మీడియా వార్తలతో జాగ్రత్త)… గొంతు నుంచి మిగతా శరీరంలోకి పోని ఓమిక్రాన్ వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు వుండవు. సోకింది ఓమిక్రాన్ అవునో కాదో తెలియదు. ఒక వేళ డెల్టా సోకితే… ? ఒకవేళ ఓమిక్రాన్ కూడా ఏదైనా సమస్యలు సృష్టిస్తే…? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అందరూ ఈ పనులు చెయ్యండి. కరోనా సోకినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. సోకకపోయినా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

1 . ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, తోటకూర, అల్లం, వెల్లుల్లి, నానపెట్టిన బాదాం { రోజుకు ఒకరికి రెండు}, వాల్నట్ {ఆక్రోట్ } { రోజుకు ఒకరికి రెండు } ఆహారంలో భాగంగా తీసుకోండి.
2 . మాంసాహారులు చికెన్, గుడ్డు తెల్లసొన, సముద్రపు చేపలు ముఖ్యంగా ఇండియన్ సాల్మోన్ చేప మొదలైనవి తినండి.

3 . ఆయా కాలాల్లో దొరికే పళ్ళు, ముఖ్యంగా జామకాయ లాంటివి తినండి. ఎండుద్రాక్ష, ఖర్జూర లాంటి డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు తీసుకోండి. షుగర్ వ్యాధి ఉన్న వారు తమ తమ షుగర్ లెవెల్స్ దృష్టిలో ఉంచుకొని పద్దతి ప్రకారం వీటిని తీసుకోవచ్చు.

4 . అన్నం తగ్గించండి. ఒక కప్పు అన్నం తింటే మూడు కప్పుల కాయగూరలు తినాలి. కాయగూరల్లో బంగాళా దుంప, క్యారెట్ లాంటివి అన్నం కిందికే వస్తాయి. వాటిలో పిండిపదార్థాలు అధికం. వంకాయ, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ , మునక్కాయలు, ఖీరా లాంటివి వాటిని బాగా ఎక్కువగా తినండి.

5 . రోజూ కనీసం అరగంట వేగంగా నడవండి. చెమట పట్టేదాకా చేతులు ఆడిస్తూ వేగంగా నడవాలి.

6 . రోజుకు పెద్దవారు నాలుగు లీటర్ల నీరు, పిల్లలు రెండు లీటర్లు తాగాలి.

7 . “అదిగో కొత్త వేరియెంట్, ఇదిగో నాలుగో వేవ్- లాక్ డౌన్ తప్పదు” లాంటి ఫార్మాసురుల ప్రాయోజిత కార్యక్రమాలను చూడకండి.

8 . పిల్లాపాపలతో, పెంపుడు జంతువులతో ఆడుకోండి. బంధువులు, మిత్రులతో హ్యాపీగా కాలం గడపండి. స్టే హోమ్ అనేది కాలం చెల్లిన నినాదం. ఇంగ్లాండ్ లాంటి అనేక దేశాలు కరోనా నియమాల్ని పూర్తిగా ఎత్తేసాయి. ఊటికో, గోవాకో కాకపోయినా దగ్గర్లో ఉన్న పార్క్ కు వెళ్ళండి. ఆడండి.. పాడండి.. స్ట్రెస్ ను ప్రారద్రోలండి. లైఫ్ ను ఎంజాయ్ చెయ్యండి.

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం మందుల షాపుల్లో డబ్బాలలో ప్యాకెట్లలో దొరకదు. పార్కుల్లో, చేలల్లో, కూరగాయల- పళ్ళ దుకాణాల్లో దొరుకుతుంది. ఆసుపత్రుల్లో కాదు.. మైదానంలో ఆరోగ్యాన్ని వెతుక్కోండి. జిం, యోగ వాకింగ్ ఆరోగ్య మార్గాలు. సరైన ఆహారం, సరైన జీవన విధానం ఆరోగ్య సూత్రాలు. రోగం వస్తేనే ఆసుపత్రికి. కరోనా కేసులు జనవరి చివరికల్లా బాగా తగ్గిపోయాయి. కరోనా పోదు. అది సోకుతూనే ఉంటుంది. కానీ అది జలుబు కంటే తక్కువ. మన భయమే మన శత్రువు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions