పాపులర్ హీరో సినిమా అయితే పాటలు ఉండాల్సిందే… స్టెప్పులు పడాల్సిందే… మరీ చిరంజీవి అయితే అది దేవుళ్ల సినిమా అయినా సరే స్టెప్పులు వేయాల్సిందే… కథ నానా కొత్త పోకడలూ పోవాల్సిందే… మరి ఈ హీరోల ఇమేజ్ ముఖ్యం కదా… కథ ఎవడికి కావాలి..? ఆ నిజపాత్ర ఔచిత్యం ఎవరికి కావాలి..?
నిజానికి ఆచార్యలో చిరంజీవి పోషించిన పాత్ర సుబ్బారావు పాణిగ్రాహి అనే ఓ నక్సలైట్ లీడర్‌దే అనే వార్తలు, ప్రచారం చాలారోజులుగా ఉన్నవే… శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో, 1933లో ఓ పేద ఒడియా బ్రాహ్మణ పూజార్ల కుటుంబంలో పుట్టిన పాణిగ్రాహి మొదట్లో ఓ స్థానిక గుడిలో పూజారి… కవి… నాటకాలు, పద్యాలు, పాటలు రాసేవాడు… తరువాత నక్సలైట్లలో చేరి ఆ ప్రాంత కార్యదర్శిగా కూడా చేశాడు… 1969లో ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్‌లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు…
నిజంగానే చిరంజీవి పాత్ర అదేనా..? ఏమో…! తెలుగు సినిమా అంటే హీరోకు హీరోయిన్ ఉండాలిగా… స్టెప్పులు వేయాలిగా… కానీ చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఎవరు అంగీకరించాలి..? కుర్ర హీరోయిన్లకు ఇంట్రస్టు ఉండదు… వెటరన్ స్టార్‌గా మారిపోయిన త్రిష ఒప్పుకుంది… కానీ ఆమెకు ఈ కథలో గందరగోళం ఏదో అర్థం కాలేదు… సింపుల్‌గా ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అనే ఓ భ్రమపదార్థం వంటి పదాన్ని సాకుగా చెప్పి జంపైపోయింది… ఆమె మణిరత్నం సినిమాకు కాల్‌షీట్లు అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నదని చిరంజీవి చెప్పినట్టు గుర్తు… ఆచార్య సినిమాకు కాల్‌షీట్లు ఇచ్చినప్పుడు ఆమె ఆమాత్రం ఆలోచించలేదా..? సరిచూసుకోలేదా..? ఏదో ఓ సాకు..! ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి సెన్సిటివ్ కాబట్టి ఆమె ఒక్క మాట మాట్లాడలేదు… సైలెంట్…
Ads
మళ్లీ వెతికీ వెతికీ కాజల్‌ను తెచ్చారు… లాహే పాటలో కనిపించింది కూడా… ఏమైందో ఏమో ఆమె కూడా తరువాత వార్తల్లో లేదు… తన పెళ్లి, కడుపు దృష్ట్యా తన పోర్షన్ కాస్త త్వరగా పూర్తి చేయాలని దర్శకుడిని కోరినట్టు అక్కడక్కడా వార్తలు కనిపించాయి… న్యాయమైన కోరికే… తీరా చూస్తే సినిమా ప్రమోషన్లలో గానీ, ప్రచార వీడియోల్లో గానీ ఆమె లేదు… మరి అదేమిటి..? ఆమెను పూర్తిగానే సినిమా నుంచి కత్తిరించి పారేశారా..?
ఎట్టకేలకు దర్శకుడు ఎక్కడో మాట్లాడుతూ ఓ క్లారిటీ ఇచ్చాడు… ‘‘ఆచార్య నుంచి కాజల్‌ను తొలగించాం… మొదట హీరోకు ఓ హీరోయిన్ ఉంటే బాగుండు అనుకున్నాం… కాజల్ పాత్ర క్రియేట్ చేశాం, కొన్నాళ్లు షూటింగ్ జరిగింది, కానీ తరువాత నాకే డౌట్ వచ్చింది… నక్సల్ హీరోకు లవ్ ట్రాక్ సమంజసమేనా అనేది ఆ డౌట్… హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి ఓ పాత్ర క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది… ఆ పాత్ర ముగింపు ఏమిటో కూడా అంతుపట్టలేదు… చిరంజీవికి చెబితే నీ ఇష్టం అన్నాడు, కాజల్‌కు చెప్పాం, ఆమె కూడా అంగీకరించి వెళ్లిపోయింది…’’ అని చెప్పాడు…
ఫాఫం, కాజల్‌కు ముందే తెలిస్తే త్రిషలాగా తెలివిగా ‘‘క్రియేటివ్ మోర్ డిఫరెన్సెస్’’ పేరిట మర్యాదగా తప్పుకునేది… అలా లేని ఓ పాత్రను కేవలం సినిమా స్టెప్పులు, లవ్ ట్రాక్ కోసం సృష్టించడం దేనికి..? కాజల్‌ను తీసుకోవడం ఏమిటి..? హఠాత్తుగా కత్తిరించడం ఏమిటి..? ఆమెకు ఇది ఓ అవమానమేనా..? ఎందుకు కిమ్మనకుండా ఉండిపోయింది..? మొత్తం ఎపిసోడ్‌లో ఆమె తప్పేమైనా ఉందా..?
అన్నింటికీ మించి నక్సల్ హీరో అయితే లవ్ ట్రాక్ ఉండకూడదని ఏముంది..? ఉంటే తప్పేముంది..? నక్సలైట్లు ప్రేమభావనలకు అతీతులా..? అసలు నక్సలైట్ల సబ్జెక్టు మీద ప్యూర్ కమర్షియల్ దర్శకుడు కొరటాలకు ఉన్న అవగాహన, అధ్యయనం ఎంత..? ఈ లెక్కన చూస్తే పాపం సుబ్బారావు పాణిగ్రాహి పాత్రకు జరిగిన న్యాయం ఎంత..? ఓ పాపులర్ హీరో ఇమేజీ చట్రంలోకి ఓ ఉదాత్త పోరాటచరిత్ర కలిగిన నక్సలైట్ లీడర్‌ను లాక్కొచ్చి, ఇష్టారాజ్యంగా చిత్రీకరించారా..? లేక పాణిగ్రాహి కథకూ దీనికీ లింక్ లేదు, ఇది ప్యూర్ కల్పన మాత్రమే అంటారా..?! (దర్శకుడే ఇది నక్సల్ పాత్ర అంటున్నాడు కాబట్టి మరో సందేహం…)
ఇదేకాదు, మణిశర్మ పాటలు సరే, బీజీఎం మీద కూడా కొరటాల అసంతృప్తిగా ఉన్నాడట… ఇంకెవరికో అప్పగించాడట… అదీ వర్కవుట్ గాక చివరకు మణిశర్మ కొడుకు స్వరసాగర్ మహతికి అప్పగించారట… చిరంజీవి వంటి పాపులర్ హీరోకు ముందస్తుగా కథ ఫైనల్ చేయకపోవడం ఏమిటి..? ఆ కథ ప్రకారం షూట్ చేయకపోవడం ఏమిటి..? మధ్యలో హీరోయిన్లకు కత్తెర్లు ఏమిటి..? సినిమా అంతా పూర్తయ్యాక కాజల్ పాత్ర మరీ చిన్నగా ఉండి, కథాగమనానికి అడ్డు వస్తోందని మొత్తానికే తీసిపారేయడం ఏమిటి..? అంటే ఏ పాత్ర సృష్టిస్తున్నాడో, కథ ఏం మారిపోతోందో, ఏ పాత్ర కథకు ఎలా అడ్డుతగులుతుందో అంతా ఆగమాగం, గందరగోళం అన్నట్టేనా..?
అంత స్వేచ్ఛను ఇస్తే చివరకు కొరటాల శివ చిరంజీవి కొంప ముంచేస్తాడా ఏం ..?! నిజానికి రాంచరణ్ పాత్ర కూడా మొదట్లో చిన్నగా అనుకున్నారట, మహేశ్‌బాబు బెటర్ అనుకున్నారట, తరువాత రాంచరణ్ వచ్చి చేరాక దానికీ ప్రాధాన్యం పెంచి పాత్ర నిడివి పెంచారట… హీరోయిన్ తప్పదు కాబట్టి పూజా హెగ్డే ను పెట్టారట… (అసలే పూజ టైం బాలేదు ఇప్పుడు)… కొరటాల శివ మొదట్లో టీవీ సీరియళ్లు తీసేవాడా..?! హేమిటో… ఈ సినిమా మీద ఏమాత్రం బజ్ క్రియేట్ కావడం లేదు… అసలు చిరంజీవి సినిమా అంటే రిలీజ్ ముందు వాతావరణం ఎలా ఉండాలి..?!
Share this Article