గుడ్… ఈ పిల్లగాడికి మంచి కెరీర్ ఉంది… రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయేతర రంగాల్లోకి ప్రవేశించినా… మొన్నమొన్నటిదాకా కాస్త బరువుగా, అక్కడిక్కడికీ వెళ్తూ ‘రాజకుమారుడి’ స్టేటస్‌తో నమస్కారాలు, దండాలు అందుకుంటూ, దండలు కూడా అందుకుంటూ… చివరాఖరికి సచివాలయం వెళ్లి, భద్రాచలం వెళ్లి పలుమార్లు వార్తల్లో వ్యక్తి అయ్యాడు… ఇప్పుడు ఆ బచ్‌పన్ క్యాలీ కనిపించడం లేదు… కొంత మెచ్యూరిటీ కనిపిస్తోంది…
బరువు తగ్గాడు… హైట్ సాధారణ తెలంగాణ వ్యక్తులకన్నా ఎక్కువే… సిటీలోని ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని, విరాళాల సాయంతో దానికి కొత్త రూపును తీసుకొచ్చాడు… అభినందిద్దాం… దేనికోసం ఆ పనిచేశాడనేది పక్కన పెడితే, చేసింది మంచిపనే కాబట్టి ఆహ్వానిద్దాం… ఆ సందర్భంగా తను చేసిన ప్రసంగం కూడా తాతను, నాన్నను గుర్తుచేసింది… అదే రక్తం… జనం కనెక్టయ్యేలా మాట్లాడటం బహుశా తాత నుంచి వారసత్వంగా వచ్చి ఉంటుంది…
ఐతే ఇంత ఆతృత అక్కర్లేదు… అప్పుడే ప్రజాజీవనంలోకి రానక్కర్లేదు… పబ్లిసిటీ అస్సలు అక్కర్లేదు… రాజకీయాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు, ఇంకా నాన్న శకం ప్రారంభమే కాలేదు… అప్పుడే ఈ రాజమనమడికి అంత వేగం దేనికి..? చదువు, కొలువు… ఈ దశలు పూర్తి కానివ్వండి… మెచ్యూరిటీ వస్తుంది… అప్పుడే దండలు, దండాలతో రాజమర్యాదలు చేసి ఆ పిల్లాడిని చెడగొట్టకండి… బీఆర్ఎస్ తనకు చేయాల్సిన, అవసరమైన సాయం అదే…
Ads
కేసీయార్ తెలంగాణ పీఠం ఎక్కి తొమ్మిదేళ్లు… ఇప్పుడు ప్రభుత్వం మీద ఏ చిన్న విమర్శ వచ్చినా అది నేరుగా కేసీయార్‌కే తాకేది… ఆ ఆలోచన హిమాంశులో లేనట్టుంది… అఫ్‌కోర్స్, ఇంకా పిల్లాడే కదా, అంత లోతుగా ఆలోచించనట్టుంది… ఆ స్కూల్ కార్యక్రమానికి మంత్రి సబిత వచ్చింది… అక్కడ హిమాంశు మాట్లాడుతూ ‘‘ఆడపిల్లల టాయిలెట్స్ ముందు పందులు, మౌలిక సదుపాయాలు లేవు, అవన్నీ చూస్తే కన్నీళ్లు వచ్చాయి…’’ అని ఏదో చెబుతూ పోయాడు… తన మాటల్లో మార్మికత గానీ, దురుద్దేశాలు గానీ లేవు… కానీ అవన్నీ నేరుగా అక్కడే ఉన్న మంత్రికి, అక్కడ లేని ముఖ్యమంత్రికి తగిలాయి…
నిజంగానే కేసీయార్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను, ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసింది… ప్రత్యేకించి టీచర్ల హేతుబద్ధీకరణ కేసీయార్‌కు చేతకాలేదు… ఇంటర్ కూడా అంతే… ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో 40 శాతం ఎన్‌రోల్‌మెంట్ తగ్గిందట… అదీ కంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించిన తరువాత… ఇక స్కూళ్ల స్థాయి కేంద్ర ప్రాథమిక విద్యా నివేదికలే చెబుతున్నాయి… స్కూళ్లలో మౌలిక సదుపాయాల సంగతి హిమాంశే చెప్పాడు… ఇదంతా పరోక్షంగా తాత పాలనను మనమడు అభిశంసిస్తున్నట్టే లెక్క ఒకరకంగా… అందుకే నెటిజనం కూడా అలాగే రియాక్టయ్యారు హిమాంశు స్కూల్ ప్రోగ్రాం మీద… తను కావాలని విమర్శ చేయలేదు, కానీ తన ఎమోషనల్ కామెంట్స్ తాతనే వేలెత్తి చూపిస్తున్నయ్…!!
Share this Article