Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా ఇప్పుడు తీస్తే జనం చూస్తారా..? కాదు, అసలు చూడనిస్తారా..?!

April 29, 2024 by M S R

Subramanyam Dogiparthi….   ప్రాచీన భారతీయ వ్యవస్థలలో బాధాకరమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ . ఒక కులంలో పుట్టిన పుణ్యానికి అందరిలాగా పెళ్ళికి నోచుకోకుండా , దేవుడినే పెళ్లి చేసుకుని , దేవాలయాల్లో నృత్యం చేసే కుల వ్యవస్థ . ఎంతో మంది సంఘసంస్కర్తల పోరాటాలతో ఆ వ్యవస్థని నిషేధించడం జరిగింది . ఇంకా మారుమూల గ్రామాల్లో ఉందని అప్పుడప్పుడు పత్రికలలో చదువుతుంటాం .

మొదట్లో దేవుడికి దాసి అని ప్రారంభించబడిన ఈ వ్యవస్థను కొందరు బెత్తందార్లు , పెత్తందార్లు భోగ వ్యవస్థగా మార్చేసారు . ఈ సామాజిక దుర్మార్గుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందీ వ్యవస్థ . అలాంటి దేవదాసి కులంలో పుట్టిన ఒక స్త్రీ అందరి అమ్మాయిల్లాగా పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతుంది . ఆమె తల్లి కూడా తన కూతురుని తమ కులవృత్తిలోకి తీసుకు రాకూడదని నిశ్చయించుకుంటుంది . విధి వక్రించటం , చివరకు ఆ అమ్మాయి ఆత్మహత్యతో సినిమా ముగుస్తుంది .
పుట్టన్ కన్నడంలో తీసిన గెజ్జె పూజ సినిమా హక్కులు కొని , వి మధుసూదనరావు తెలుగులో కల్యాణ మంటపం టైటిల్ తో 1971 లో తీసారు . ఇది కాంచన సినిమా . వంద రోజులు ఆడి కమర్షియల్ గా సక్సెస్ కావటమే కాకుండా , విప్లవాత్మక సినిమాగా కూడా మంచి పేరొచ్చింది . యాభై సంవత్సరాల కింద కాబట్టి జనం చూసారు . బహుశా ఇప్పుడు తీస్తే జనం చూస్తారా అనేది అనుమానమే . అసలు ఇలాంటి వ్యవస్థ ఎక్కడ ఉందని మన రైటిస్ట్ సోదరులు కళ్ళెర్ర చేసి , బాయ్ కాట్ పిలుపు కూడా ఇస్తారు . అది వేరే గోల .
మళ్ళా సినిమాకొస్తే వి మధుసూదనరావు కన్నడ కధకు మార్పులూ కూర్పులూ చేసి మనసులకు హత్తుకునే విధంగా తీసారు . ముఖ్యంగా వివాహ వ్యవస్థ ఔన్నత్యం , పవిత్రత అంశాలను బాగా వివరించారు . వివాహ వ్యవస్ధ ఔన్నత్యాన్ని వివరించే అభ్యుదయ ఆలోచనలు కల అవధాని పాత్రలో జగ్గయ్య బాగా నటించారు .
పి ఆదినారాయణ రావు సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . చుక్కలు పాడే శుభమంత్రం , సరిగమపదనిస అని పలికేవారుంటే , పిలిచే వారుంటే పలికేను నేను వంటి శ్రావ్యమైన పాటలున్నాయి . దేవులపల్లి , ఆరుద్ర , ఆత్రేయ , దాశరధి చక్కటి పాటల్ని వ్రాసారు .
చిన్నప్పటి కాంచనగా అతిలోకసుందరి శ్రీదేవి నటించింది . తర్వాత కాలంలో ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి , ప్రముఖ నిర్మాత మురారి ఈ సినిమాకు సహాయ దర్శకులుగా పనిచేసారు . శోభన్ బాబు , గుమ్మడి , అంజలీదేవి , నాగభూషణం , రమాప్రభ , సంధ్యారాణి , పి జె శర్మ ప్రభృతులు నటించారు .
వి మధుసూదనరావు వామపక్ష అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి . తన భావాలకు తగ్గట్లుగానే మాటల్ని వ్రాయటానికి బొల్లిముంత శివరామకృష్ణను ఎంచుకున్నారు . నాగభూషణం డైలాగుల్లో ఆ సెగ కనిపిస్తుంది . సాని , సంసారిల మధ్య తేడాను వ్యంగంగా ఈడ్చి ఈడ్చి కొడతాడు . ఒక్కరినే నమ్ముకున్నది సాని , పది మందికి అమ్ముకున్నది సంసారి అనే నాగభూషణం డైలాగ్ ఆరోజుల్లో బాగా పేలింది . సినిమా చివర్లో జగ్గయ్య పాత్ర ద్వారా ఈ దురదృష్టకర వ్యవస్ద గురించి సందేశాత్మక మాటలు చెప్పిస్తారు దర్శకుడు , మాటల రచయిత .
విజయవాడ మేరీ స్టెల్లా మహిళా కళాశాల విద్యార్ధినుల కొరకు ఈ సినిమా ఫ్రీ షోలను వేసారు . ఇంత చక్కటి సందేశాత్మక సినిమా తమిళంలో , హిందీలో రీమేక్ చేయబడింది . ఈ సినిమా వంద రోజుల సంబరాలు మద్రాసు ఉడ్ లాండ్స్ హోటల్లో జరిగాయి . MGR అధ్యక్షత వహించగా , ANR ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .
సినిమా దఃఖాంతమయినా కాంచన పాత్ర మనసున్న ప్రేక్షకులను కదిలిస్తుంది . బరువయిన గుండెలతో ప్రేక్షకుడు థియేటర్లోనుంచి బయటపడతాడు . బరువయిన సినిమా అయినా నేను మా నరసరావుపేటలో రెండు సార్లు చూసా . టివిలో వచ్చినప్పుడల్లా కాసేపయినా చూస్తా . బహుశా కాంచన పాత్ర మీద సానుభూతే కారణం కావచ్చేమో ! యూట్యూబులో ఉంది .
ఈతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . మన పురాతన , సనాతన భారతీయ సమాజం ఎన్ని మలుపులు తిరుక్కుంటూ , ఎలా అభ్యుదయం వైపు సాగుతుందో తెలుసుకోవాలని నా ఆకాంక్ష . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions