లంచగొండితనంపై సామాన్యుడి పోరాటం… ఓ సామాన్య, మధ్య తరగతి వ్యక్తి ప్రభుత్వ శాఖల్లో లంచగొండితనాన్ని సోషల్ మీడియా సాయంతో ఎండగట్టిన తీరు హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు విపుల్ మెహతా. గత ఏడాది థియేటర్లలో విడుదలై, తాజాగా జీ5 లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సందడి చేస్తోంది. కంజూస్… మక్కిచూస్… హిందీ సినిమా…
బాలనటుడిగా అడుగిడి, వివిధ చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి, ఒటిటిలో వచ్చిన అభయ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న, కునాల్ ఖేము విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పూజా సామగ్రి దుకాణం నడుపుకునే ఓ మధ్యతరగతి వ్యక్తి తన తల్లిదండ్రులను చార్ ధామ్ యాత్రకు పంపడానికి డబ్బులు దాయడానికి పడే కష్టాలు అతన్ని పిసినారిగా చూపిస్తాయి.
ఎంతలా అంటే దేవుడి ముందు అగరబత్తి వెలిగించి ఒకసారి ధూపం వేసి వెంటనే ఆర్పేస్తాడు, పూర్తిగా అయిపోయిన టూత్ పేస్టును రొట్టెల కర్రతో రుద్దుతూ ఉంటాడు. (ఒక తెలుగు సినిమాలో కోట శ్రినివాసరావు శ్రీకాంత్ కి ఇలానే రాయితో చితక్కొట్టి ఇస్తాడు)..
Ads
ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించాలని, ఎదురింటి 50 ఏళ్ళ ఆంటీ స్మార్ట్ ఫోన్ తో రీల్స్ చేయడం చూసి తనకు స్మార్ట్ ఫోన్ కావాలనే భార్య ఒత్తిడిని నవ్వుతూ తట్టుకుంటూ, డబ్బులు దాస్తూ ఉంటాడు. ఇలా దాచిన డబ్బులతో తల్లిదండ్రులను ఒక మధ్యవర్తి ద్వారా యాత్రకు పంపడం, వారు అక్కడ వచ్చిన వరదల్లో తప్పిపోవడం, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం, మంజూరు, అందులో సగం అధికారులు కొంత నొక్కేస్తారు.
ఈ లోగా చనిపోయారనుకున్న తల్లిదండ్రులు తిరిగి రావడం, వారిని దాచి పెట్టడం, బంధువులకు దొరికిపోవడం సరదా సరదాగా సన్నివేశాలు సాగి పోతాయి. పరిహారం తిరిగి ఇచ్చేస్తానని, అధికారుల దగ్గరకు వెళ్తే, వాళ్ళు కొట్టేసిన వాటాతో కలిపి కట్టాలనడం, అర్హులకు పరిహారం దక్కక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న వృద్ధుడిని చూసి, హీరో సోషల్ మీడియా సాయంతో లంచగొండి అధికారులను పట్టించి, అర్హులకు పరిహారం అందించడంతో కధ ముగుస్తుంది.
గుజరాతీ నాటకం ఈ సినిమాకు మూలం. ప్రఖ్యాత స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ చివరి సినిమా ఇదే కావడం విశేషం. స్మార్ట్ ఫోన్ తో నిరంతరం రీల్స్ చేస్తుండే ఓ 50 ఏళ్ళ మహిళ ఫేస్ బుక్ మీద ఒట్టేసి చెబుతున్నా అనడం, కోహ్లి, సచిన్, చంద్రమండలం, పిల్లల ఇంగ్లిష్ మీడియం, చైనా వస్తువుల మీద్ సింగిల్ లైన్ సెటైర్లు ఇందులో అనేకం మనల్ని నవ్విస్తాయి. పిసినారి, పొదుపరికి మధ్య అంతరం సున్నితమైన మానవ బంధాలేనని, బలమైన ఉమ్మడి కుటుంబాలేనని చక్కగా చూపిస్తాడు. (వునికిలి హర గోపాలరాజు)
Share this Article