Murali Buddha….. మిద్దె రాములు ఒగ్గు కథ – కరీంనగర్ ఉప ఎన్నికలో కెసిఆర్ విజయం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు
————————————–
కెసిఆర్ రాజీనామాతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక . టీడీపీ తరపున ఎన్నిక బాధ్యత దేవేందర్ గౌడ్ కు అప్పగించారు . తెలంగాణ ఉద్యమ సమయం. అన్ని పార్టీల ప్రచారంలో తెలంగాణ పాటలు చేరిన కాలం . ప్రచారం కోసం టీడీపీ కొన్ని సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసింది . ఆ బృందాలు ఎన్టీఆర్ భవన్ లో రిహార్సల్స్ చేస్తున్నాయి . దేవేందర్ గౌడ్ కొద్ది మంది విలేకరులతో కలిసి ఆ పాటలు వింటున్నారు .
Ads
కొద్దిసేపటి తరువాత ఆ గాయకుడిని దేవేందర్ గౌడ్ పిలిచి నువ్వు మిద్దె రాములు తరహాలో పాడుతున్నావు కదా అని అడిగారు . అతను ఔను అని బదులిచ్చాడు . మిద్దె రాములు అద్భుతంగా ఒగ్గు కథ చెబుతాడు . చదువుకోలేదు కానీ గొప్ప ఒగ్గుకథ కళాకారుడు . వేములవాడకు చెందిన వారు . దేవేందర్ గౌడ్ విలేకరులకు మిద్దె రాములు గురించి చెప్పారు . గాయకునితో … ఒక పని చేయండి, మీరు మిద్దె రాములులా ఒగ్గు కథ చెప్పడం ఎందుకు … మిద్దె రాములును రమ్మనండి, కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఒగ్గు కథ ద్వారా ప్రచారం చేయాలి అని అడిగారు .
మనం ఇంతకు ముందే పిలిచాం, అతను రాడు సార్ అని గాయకుడు చెప్పాడు . అడిగినంత ఇద్దాం అని గౌడ్ చెబితే .. తెలంగాణ కోసం తెరాసకు ఉచితంగానే ప్రచారం చేస్తా కానీ టీడీపీ ప్రచారానికి రాను అన్నాడు సార్ అని గాయకుడు చెప్పగానే గౌడ్ ఆ విషయం వదిలేసి కరీంనగర్ లో గెలువ బోతున్నాం అంటూ వేరే లెక్కలు చెప్పారు .
మీ గాయకుడు చెప్పింది సరిగ్గా విశ్లేషించుకుంటే అతని మాటల్లో కరీంనగర్ ఫలితం ఎలా రాబోతుందో స్పష్టమైంది అని … మీరు డబ్బులు ఇచ్చినా రాడు , తెలంగాణ కోసం తెరాసకు ఉచితం గా ప్రచారం చేస్తాడు అని మీ గాయకుడే చెబుతున్నాడు అంటే కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదా ? అని అన్నప్పుడు దేవేందర్ గౌడ్ తన స్టైల్ లో నవ్వి ఊరుకున్నారు .
*******
వైయస్ఆర్ ఉంటేనా ?
చాలామంది సమైక్య వాదులు వైయస్ఆర్ ఉంటేనా ? తెలంగాణ రాక పోతుండే అంటూ చెబుతుంటారు . 2004 లో తెరాస , కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తే కరీంనగర్ లో కెసిఆర్ కు 50 వేల మెజారిటీ వస్తే , వైయస్ఆర్ , కెసిఆర్ ల మధ్య మాటల యుద్ధం సాగి కేసిఆర్ రాజీనామా చేశారు . ఎవరి వల్ల ఎవరు గెలిచారో తేల్చుకుందాం అని సవాల్ చేశారు . ఆ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ , టీడీపీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడాయి . ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తెలంగాణ ఉద్యమానికి తాను నాయకత్వం వహించవచ్చు అని దేవేందర్ గౌడ్ భావించి తీవ్రంగా ప్రయత్నించారు .
కేసిఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే అని భావించి వైయస్ఆర్ సర్వ శక్తులు ఒడ్డి పోరాడారు . నిజానికి వీరి తీవ్ర ప్రయత్నం తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడింది . కెసిఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసినట్టే అని భావించి తెలంగాణ వాదులు పార్టీలకు సంబంధం లేకుండా కృషి చేశారు . వైయస్ఆర్ వ్యూహంతో తొలిసారిగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ తమ పార్టీ కోసం కాకుండా కరీంనగర్ లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు . మందకృష్ణ మాదిగ ప్రచారం చేశారు .
కరీంనగర్ లో డబ్బు ప్రవహించింది . కరీంనగర్ లో జనాభాను మించి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినట్టు వైఎస్ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ ఓ సందర్భంలో చెప్పారు . నిజానికి ఒక్క నియోజకవర్గానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు . ఐతే ఒక్క నియోజక వర్గంలో స్వయంగా కెసిఆర్ ను ఓడిస్తే మొత్తం ఉద్యమాన్ని ఓడించినట్టే , ఇక ఉద్యమం ఉండదు అనే భావనతో వైయస్ఆర్ కరీంనగర్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు .
***********
ప్రచారపర్వం ముగిశాక ఓ రోజు ప్రెస్ క్లబ్ పక్కన ఉన్న చైనీస్ రెస్టారెంట్ లో నేనూ , సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం , రవిచంద్ తింటున్నప్పుడు …. కరీంనగర్ నగర్ ఫలితం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అని ధర్మవరపు నన్ను అడిగారు . ఎంత ఎక్కువ ప్రత్యర్థుల దాడి ఉంటే కెసిఆర్ కు మెజారిటీ అంత పెరుగుతుంది . కాంగ్రెస్ కులాల లెక్కలు వేస్తుంది . అక్కడ కులాల లెక్కలు ఉండవు తెలంగాణ లెక్కలు ఉంటాయి అని చెప్పాను . నా మాటలతో కరీంనగర్ ఫలితం తెలుస్తోంది అని ధర్మవరపు బదులిచ్చారు .మేమిద్దరం కాంగ్రెస్ అని తెలుసు , కాంగ్రెస్ ప్రచార బాధ్యత నిర్వహిస్తున్న సంగతి తెలుసు, ఐనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తెరాస గెలుస్తుంది అని చెప్పావు అంటే …. అని ధర్మవరపు నవ్వారు .
***********
2009 లో 156 సీట్లతో వైయస్ ఆర్ గెలిచారు . ఎప్పుడూ లేనన్ని పథకాలను ఐదేళ్ల పాటు అమలు చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో 156 సీట్లు మాత్రమే వచ్చాయి . 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో కేవలం 8 సీట్ల మెజారిటీ మాత్రమే . సోనియా గాంధీకి తెలంగాణా ఇవ్వాలి అని ఉన్నా , 2009 వరకు ఆపగలిగాం , 2014 లో మనకు ఇంత బలం ఉండదు , కాంగ్రెస్ అధిష్టానంను ఆపలేం .. మీ మీ జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయో పూర్తి చేసుకోండి అని సన్నిహిత మంత్రులతో చెప్పేవారు . అంతకు ముందు భూమిలో తరువాత ఎన్ టివి , సాక్షిలో చేసిన జర్నలిస్ట్ మిత్రుడు వైయస్ఆర్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సన్నిహితులు… అతను ఓసారి వైఎస్ఆర్ తో మాట్లాడితే తెలంగాణ వ్యక్తికి బంగారు ఇంటిని కట్టించి ఇచ్చినా తెలంగాణ గుడిసె కావాలి అంటాడు , తెలంగాణ అనివార్యం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పుకొచ్చాడు .
************
కరీంనగర్ లో ఏమైంది అంటే… కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే కెసిఆర్ 50 వేల మెజారిటీ వస్తే, దేవేందర్ గౌడ్ ( టీడీపీ ) వైయస్ఆర్ ( కాంగ్రెస్) సర్వ శక్తులు ఒడ్డి, బోలెడు ఖర్చు చేసి పోటీ చేస్తే , కెసిఆర్ కు రెండు లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది .కెసిఆర్ కు 3,78,030 ఓట్లు వస్తే, కాంగ్రెస్ జీవన్ రెడ్డికి 1,76,448 ఓట్లు , టీడీపీ రమణకు 1,70, 268 ఓట్లు వచ్చాయి .
కరీంనగర్ ఫలితం అన్ని పార్టీల్లోని తెలంగాణ నాయకులను ఆలోచనల్లో పడేసింది . తెలంగాణ అనివార్యం అనే భావన ఏర్పడేట్టు చేసింది . తెలంగాణ అనివార్యం అయినప్పుడు ఎటువైపు ఉండాలి అనే ఆందోళన కాంగ్రెస్ వారిలో కన్నా టీడీపీ వారిలో ఎక్కువ ఆందోళన కలిగించింది . తరువాత తెలంగాణ తెచ్చామని తెరాస , ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటుంది, మరి మనమేం చెప్పుకోవాలి అనే ఆలోచన టీడీపీ తెలంగాణ నాయకుల్లో మొదలు కావడానికి కరీంనగర్ ఎన్నిక దోహదం చేసింది .
కెసిఆర్ ప్రజలకు పరీక్ష పెడుతున్నారని జ్యోతి సంపాదకీయం … కెసిఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు రాజీనామా చేసి పోటీ చేసినప్పుడు, చాలా మంది తప్పుడు వ్యూహం, దెబ్బ తింటారు అన్నారు . ఫలితాలు వచ్చి , తెలంగాణ సాకారం అయ్యాక ఇప్పుడు ఏమన్నా అనుకోవచ్చు కానీ ఆ రోజుల్లో మాత్రం కెసిఆర్ రాజీనామా చేసినప్పుడు, ఏమైనా ఐతే ఎలా అని ప్రతి తెలంగాణవాది భయపడ్డారు . కెసిఆర్ మాత్రం నాకు తెలంగాణ ప్రజల మనసు తెలుసు అని ముందడుగు వేశారు . తెలంగాణ కల కన్న మిద్దె రాములు 2010 లో మరణించారు .
బీజేపీలో చేరిన తరువాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ కెసిఆర్ రాజకీయం గురించి చెబుతూ కెసిఆర్ రాజకీయ జీవితం అంతా అఫెన్స్ లోనే సాగుతుంది . డిఫెన్స్ రాజకీయం ఉండదు అన్నారు ….. – బుద్దా మురళి
Share this Article