‘‘అబ్బే, వాళ్లే అభ్యర్థించారు, నా వివరణ కావాలన్నారు, సరే, మా ఇంటికే రండి అన్నాను, అంతేతప్ప ఇందులో విచారించేదేమీ లేదు’’…. అసలు సీబీఐ నోటీసులకు అంత సీన్ లేదన్నట్టుగా కవిత ఇలాగే చెబుతోంది… అసలు అది పెద్ద ఇష్యూయే కాదు, పైగా వాళ్లు విచారణ కోసం రావడం లేదు, జస్ట్, ఏదో వివరణ కోసం వస్తున్నారంటోంది… నమస్తే తెలంగాణ, టీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ‘‘అవి సమన్లు కూడా కావు, అనుమాన నివృత్తి కోసం నోటీసు, అంతే’’ అంటున్నాయి… విచారణ కాదు, వివరణ కోసమే అని చెప్పుకోవడానికి ఎందుకింత తన్లాట..? దాంతో ఫాయిదా ఏమిటి..?
‘‘ఈడీయా, మోడీయా… రానివ్వండి ఎవరొస్తారో… ఏం చేస్తారు..? ఉరి తీయరు కదా, మహా అయితే జైలులో పెడతారు, అంతే కదా’’ అని మాట్లాడిన గాంభీర్యపు స్పూర్తి ఏమైనట్టు..? ‘‘ఎస్, నోటీసులు వచ్చాయి, ఏం అడుగుతారో అడగనివ్వండి’’ అని కదా స్పందించాల్సింది… నిజానికి టెక్నికల్‌గా నోటీసుల్లో ఏం రాసినా, ఆమెను సీబీఐ విచారిస్తున్నదనేది నిజం… మొదట ఈడీ తన చార్జిషీటులో ఆమె పేరు ప్రస్తావించకపోయినా, మొన్న ఒక నిందితుడి రిమాండ్ సందర్భంగా సమర్పించిన రిపోర్టులో ఆమె పేరును పేర్కొన్న సంగతీ నిజం…
ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఆమెను ఓ నిందితురాలిగా ఈడీ, సీబీఐ పరిగణిస్తున్నాయనేది నిజం… ఆ దర్యాప్తు, ఆ విచారణలో భాగంగానే ఆమెకు తాజా నోటీసులు వచ్చాయనేది నిజం… ఆఫ్టరాల్ 160 సెక్షన్ నోటీసులు లీగల్‌గా ఎందుకూ పనికిరావు అని చెప్పుకోవడం దేనికి..? నిజానికి సీబీఐ స్పష్టంగానే చెప్పింది మిమ్మల్ని ఆ కేసులో దర్యాప్తులో భాగంగానే ఎగ్జామిన్ చేయడానికి వస్తాం అని… దర్యాప్తు నోటీసు అనే చెబుతోంది… మీకు చాలా విషయాలు తెలుసు, అందుకే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి అంటోంది… నోటీసుల్లో టోన్ ఎప్పుడూ అలాగే ఉంటుంది…
Ads
అయితే ఈ నోటీసులతో అయ్యేది ఏముంది..? నిజంగా సీబీఐ, ఈడీ ఎంత సీరియస్‌గా ఉన్నాయనేది పరిశీలించాల్సిన కీలకాంశం… అదెలాగూ స్పష్టంగానే ఉంది… పది ఫోన్లను ధ్వంసం చేసినట్టు, ఈ కేసులో కవిత ప్రమేయం ఉన్నట్టు ఈడీ అధికారికంగానే చెబుతోంది… సో, వివరణ కోసం వచ్చినా, విచారణ కోసం వచ్చినా… అదంతా ప్రొసీజర్ కోసమే తప్ప నోటీసులు జారీ చేయడం తేలికగా తీసుకునే విషయమైతే కాదు…! ఈడీలకు, మోడీలకు భయపడేది లేదన్న గంభీర ప్రకటనలకు భిన్నంగా ఎందుకు స్పందించాలి..? ‘‘సీబీఐ వాళ్లే ఏదో అభ్యర్థించారు, సర్లె, రమ్మన్నాను’’ అన్నట్టు మాట్లాడటం దేనికి..? అదే అర్థం కాని విషయం..!
ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీని వివరణ ఏమిటంటే… “తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, mlc కవితను ప్రశ్నించడం కోసం ఆమె ఇంటికే సిబిఐ అధికారులు వెళ్తున్నారు. సామాన్య ప్రజలకు ఇలాంటి సౌకర్యం ఉంటుందా అంటూ కొందరు మిత్రులు ప్రశ్నిస్తున్నారు.
Section 160 crpc కింద నోటీసులు ఇస్తే … ఆ నోటీసు అందుకున్న వారు 15 ఏళ్ల లోపు మగ పిల్లలు కానీ, మహిళలు అయితే, వారికి నచ్చిన/అనుకూలమైన ప్రదేశంలో విచారణ చేయాలని చట్టం చెబుతోంది. మగవారికి కూడా తన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ, లేదంటే దానికి ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ విచారణ చేయాలి. ఈ police station దాకా వచ్చినందుకు దారి ఖర్చులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కవిత మహిళ కనుక తనకి సౌకర్యం ఉన్న చోట విచారణకు విచారణ అధికారిని రమ్మని చెప్పే సౌలభ్యం చట్టం ఇచ్చింది.
41 crpc కింద పోలీసు అధికారి నేరుగా అరెస్ట్ చేయవచ్చు. కానీ 41(A) కింద నోటీసు ఇస్తే పోలీసు అధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి సరైన సమాచారం పోలీసులకు ఇస్తే అరెస్టు చేయరు. విచారణ అధికారి కన్విన్స్ కాకపోతే అరెస్ట్ చేస్తారు. 160 crpc నోటీసు ఇవ్వడానికి కారణం.. నేరం జరిగిన సంఘటనలో ఏదో ఒక సమచారం నోటీసు అందుకున్న వ్యక్తి దగ్గర ఉంది… ఆ సమాచారాన్ని క్రోడీకరించిన తరువాత సదరు వ్యక్తిని సాక్షిగా పరిగణనలోకి తీసుకోవాలా, లేకుంటే మరో రకంగానా అనేది తరువాత నిర్ణయం తీసుకుంటారు…”
Share this Article