ఉస్తాద్ అనే సినిమా వచ్చింది… శ్రీసింహా హీరో… పెద్ద సినిమా కుటుంబం నుంచే వచ్చాడు… ఏవేవో సినిమాలు చేస్తున్నాడు గానీ ఫలితం రావడం లేదు… తనలో నటనాపరంగా కూడా పెద్దగా ఎదుగుదల లేదు… పండితపుత్రుడు అని స్వీపింగ్ కామెంట్ చేయలేం గానీ మంచి నటుడు అనే కోణంలో తను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది…
సినిమా సంగతికొస్తే బోర్… ఎత్తులంటే భయపడే ఓ సాదాసీదా పిరికి యువకుడు ఏకంగా పైలట్ ఎలా అయ్యాడు..? తన ప్రేమకథేమిటి అనేదే సినిమా కంటెంట్… ఏదో చదవడానికి బాగానే ఉన్నా, దాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేకపోవడంతో సినిమా మరీ యావరేజీ సినిమాకన్నా దిగువ స్థాయిలో ఉండిపోయింది… నిజానికి సినిమా గురించిన రివ్యూ అవసరం లేదు… ఎన్నో చిత్రాలు వస్తుంటాయి, పోతుంటాయి, కొన్ని పేర్లు కూడా గుర్తుండవు… ఉస్తాద్ కూడా అంతే… లైట్…
అయితే ఇందులో హీరోయిన్‌గా చేసిన కావ్య కల్యాణరామ్ గురించి ఓ మాట చెప్పుకోవచ్చు… తనేమీ స్టన్నింగ్ బ్యూటీ కాదు… బలగం సినిమాలో కూడా చేసినా అందులో ఈ పొట్టిపిల్లకన్నా మిగతా కుటుంబసభ్యుల పాత్రలే హైలైటయ్యాయి… కానీ ఈ ఉస్తాద్‌లో మాత్రం తన పాత్రలోకి దూరిపోయిందనే చెప్పాలి… చాలా అలవోకగా చేసేసింది… అఫ్‌కోర్స్ బాలనటిగా తనకు కెమెరాలు, సినిమా వాతావరణం కొత్తేమీ కాదు… కానీ వయస్సొచ్చాక తన పాత్రను అర్థం చేసుకుని, జీవించడం ప్రతిభే కదా…
Ads
తన కళ్లతో, తన మొహంలో అన్ని భావాలను ప్రదర్శించగల మెరిట్ ఉంది ఈమెలో… ప్రేమ సన్నివేశాల్లో కూడా ఈజ్ కనిపిస్తోంది… ఆమె పాత్రను దర్శకుడు కూడా బాగా రాశాడు, బాగా ప్రజెంట్ చేశాడు… ఆమె ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది… ఇంకొన్ని మంచి పాత్రలు గనుక లభిస్తే మంచి నటి కాగలదు… భవిష్యత్తు ఉంది… సరిగ్గా తన అవకాశాల్ని వాడుకుంటే…
ఆమె గురించే ఎందుకు చెప్పుకోవాలీ అంటే… మన ఇండస్ట్రీకి మన తెలుగు అమ్మాయిలు అంటే ఓరకమైన అయిష్టత… అస్సలు చాన్సులు ఇవ్వరు… ఎంతసేపూ తమిళ, మలయాళ తారలు… లేదంటే ముంబై తెల్లతోళ్లు… అఫ్‌కోర్స్, తమిళ, మలయాళ తారల మెరిట్‌ను మనం తీసిపారేయలేం… వాళ్ల కెరీర్ పట్ల వాళ్లకు మంచి కమిట్మెంట్ ఉంటుంది… (అబ్బే, ఆ కమిట్‌మెంట్లు కావు)… వాళ్లు నటనను సీరియస్‌గా తీసుకుంటారు కూడా…
ఈమధ్య బేబీ సినిమాలో వైష్ణవి కూడా బాగా చేసింది… నిజానికి ఆమె మెరిట్‌కన్నా ఆ పాత్ర కేరక్టరైజేషన్ ఆమెను బాగా ఎలివేట్ చేసింది… ఆ పాత్ర ఆమెకు ఇంకొన్నేళ్ల కెరీర్‌ను ఇచ్చినట్టే… రానీ రానీ… తెలుగమ్మాయిలు కూడా విరివిగా ఇలాగే రానీ… ఎంతసేపూ ఆరబోతలు, స్టెప్పులు, హీరో పక్కన దేభ్యం మొహాలుగా గాకుండా కాస్త నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్రలు లభిస్తే మనవాళ్లు ఏం తక్కువ..? ఇంతకీ ఎవరీ కావ్య..?
స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, బాలు, ఠాగూర్, అడవిరాముడు, విజయేంద్రవర్మ, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు తదితర సినిమాల్లో బాలనటిగా కనిపించింది… ఈమె తెలంగాణలోని కొత్తగూడెంలో పుట్టింది… లా చదువుకుంది… మసూదలో ప్రధాన పాత్ర చేశాక బలగం, ఇప్పుడు ఈ ఉస్తాద్… గుడ్… ఆల్ ది బెస్ట్ కావ్యా…
Share this Article