ఏం జేసినవో చెప్పు!?
‘బక్క పల్సటి ప్యాదోన్ని..’ అంటూ
Ads
నువ్వు బహిరంగ సభలల్ల మాట్లాడుతుంటే
మా అసంటోనివేనని మస్తు ఖుష్ అయ్యేటోళ్లం
‘తెలంగాణ వచ్చుడో.. నేను సచ్చుడో..’ అని
నువ్వు స్టేజీలపైన గర్జిస్తాంటే
గొంతు కలుపుతూ
బిగి పిడికిళ్లను గాలిలోకి ఎత్తెటోళ్లం
నువ్వు లేసి ఉర్కినప్పుడు
కలాలు చేబూని నీ యెంట ఉరికొచ్చినం
నువ్వు కారణం చెప్పకుండా పన్నప్పుడు
ఎప్పుడు లేస్తవోనని
కన్నార్పకుండా ఎదురుచూసినం
ఉద్యమంల హీరోగ ఎత్తిపట్టినం
ప్రజలల్ల పల్సన కాకుండా కాపాడుకున్నం
గోరంత పోరును కొండంత చేసినం
ఊరువాడ కదిలేటట్టు కనికట్టు చేసినం
రాతలల్ల, చేతలల్ల
నిన్నే కేంద్రంగా చేసినం
నువ్వే కేంద్రంగా తిరిగినం
నీ కోసం కొలువులు పనంగా పెట్టినం
‘గీతలు’ దాటి అవమానాల పాలైనం
దెబ్బలు తిన్నం.. గాయాల పాలైనం
మనసిరిగినప్పుడు పానాలు అప్పజెప్పినం
‘బంగారు తెలంగాణ’ తెత్తనంటే
నిజమేనని నమ్మినం
ఊరిచ్చే మాటల వలల పడి
ఎన్నెముకను పోగొట్టుకున్నం
సబ్బండ వర్గాలకు సకలం జేసినట్టు
డబ్బ కొట్టుకుంటున్నవ్ కదా..
పదేండ్ల పండుగ యాళ్ల
మాకేం జేసినవో చెప్పు?
ఇలేకరుల ఇజ్జత్ తీసుడు తప్పితే
ఏం ఒరగబెట్టినవో చెప్పు!?
– శెంకేసి
(768 000 60 88)
Share this Article