ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య సుప్రీం కోర్టులో సానుకూలంగా పరిష్కారం కావడానికి కేసీయార్ ఇచ్చిన అఫిడవిట్లే ఆధారం… అనుకున్నట్టే సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు కూడా వచ్చింది… జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కెటిఆర్ జస్టిస్ రమణకు కృతజ్ఞతలు చెబుతూ… జర్నలిస్ట్ లకు తాము ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది అని ట్వీట్ చేశాడు… ఇక్కడివరకూ కేసీయార్ ధోరణి, కేటీయార్ స్వాగతించిన తీరు బాగానే ఉన్నయ్…
ఇప్పుడు తామే సమస్యను మరింత జటిలం చేసి, చిక్కుముళ్లు వేస్తున్నారు… ఆల్‌రెడీ కేసులు గెలిచిన జర్నలిస్టులకూ, ఇతర జర్నలిస్టులకూ లంకె పెట్టి, ఇప్పట్లో ఇది పరిష్కారం గాకుండా చిక్కుముళ్లను మరింత బిగిస్తున్నారు… అదేమంటే, సొసైటీలో ఆంధ్రా జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లున్నారు అనే విచిత్ర వాదనను ముందుకు తీసుకొస్తున్నారు సర్కారీ అనుకూల జర్నలిస్టులు… అవును, ఇంకా ఇళ్లస్థలాలు కావల్సిన జర్నలిస్టులు ఉన్నారు, వారికీ ఈ ప్రభుత్వం భూములు కేటాయించవచ్చుకదా, ఈ సొసైటీ స్థలాలతో లంకె దేనికి..?
ఈ జర్నలిస్టులు డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి కోసం ఏళ్లుగా సుప్రీం దాకా పోరాడిన సంగతి కేసీయార్‌కు తెలుసు, కేటీయార్‌కూ తెలుసు… మరి 2007 తరువాత లబ్ధిదారులు కావల్సిన జర్నలిస్టులకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వమే… అంతేతప్ప జవహర్ సొసైటీ సభ్యులు కాదు కదా… మరి వాళ్లనూ వీళ్లనూ కలపడం ఏమిటి..? సమిష్టి నిర్ణయం ప్రస్తావన దేనికి తీసుకొచ్చారు..?
Ads
పది మందిలో పడేస్తే చాలు, ఇక కథ కదలదు, తెగదు… అనే ధోరణేనా ప్రభుత్వానిది… అందుకే ఇప్పుడు అల్లం నారాయణ నేతృత్వంలో బ్యూరో చీఫ్‌లు, ఎడిటర్లతో సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ ప్రారంభించింది… సమస్య జవహర్ సొసైటీది… ఇప్పుడు మళ్లీ యూనియన్లు, బ్యూరో చీఫ్‌లు, ఎడిటర్ల అభిప్రాయాలు దేనికి..? పోనీ, కొత్త జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ప్రభుత్వం ఇస్తానంటే ఈ సొసైటీ సభ్యులేమైనా అభ్యంతర పెడుతున్నారా..? ఆనందిస్తారు గానీ..! కొత్త సొసైటీ ఫామ్ చేసి, కేసీయార్ పేరే పెట్టి, అందరికీ కొత్త ఇళ్ల స్థలాలు ఇవ్వండి, అది మరీ సంతోషం…
సుప్రీం తీర్పు వచ్చి ఆరు నెలలు కావస్తున్నా, ఈ సమస్య సానుకూల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు కూడా వేయలేదు సరికదా ఈ కొత్త బాగోతాన్ని తెరమీదకు తీసుకొచ్చింది… కేసీయార్ అసలు ఈ సొసైటీకి టైమ్ ఇవ్వడం లేదంటేనే తన ఉద్దేశం అర్థమవుతోంది… ఇక ఆంధ్రావాళ్లు అనే ప్రస్తావనకు వస్తే వాళ్లు పనిచేసింది హైదరాబాదులో కాదా… ప్రభుత్వం ఇచ్చిందే హైదరాబాద్ జర్నలిస్టుల పేరిట… తెలంగాణ ఉద్యమానికీ దీనికీ లంకె పెడుతున్నారు, అదీ అబ్సర్డ్… కేసీయార్ ప్రస్తుత కేబినెట్‌లోనే తెలంగాణ ఉద్యమం మీద దాడికి పాల్పడిన వాళ్లున్నారు… ఇదే కేసీయార్‌ను నానా తిట్లు తిట్టినవాళ్లున్నారు… వాళ్లేమో తెలంగాణ మీద పెత్తనాలు చేయవచ్చు గానీ ఓ కొంప సమకూర్చుకుందామనుకునే జర్నలిస్టులకు మాత్రం ఇన్ని అవస్థలా..?
ఐనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటేనే ఇళ్లస్థలాలకు అర్హులా..? ఇదెక్కడి ప్రాతిపదిక..? ఒకవేళ సొసైటీ సభ్యులు కాని కొత్త జర్నలిస్టులకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలనే సంకల్పం ఉంటే, సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే ఆ కసరత్తు స్టార్ట్ చేసి ఉంటే, ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది… అంటే కొత్త, పాత జర్నలిస్టులందరికీ ఆశాభంగమే ఎదురవుతోంది… సొసైటీలో సభ్యులు కాని జర్నలిస్టులు కూడా తమ ఇళ్లస్థలాల మాటేమిటని అడగాల్సింది ప్రభుత్వాన్ని కదా… అంతేతప్ప ఇన్నేళ్లుగా పోరాడి సాధించుకున్న సొసైటీని ప్రశ్నిస్తే ఎలా..? మాకు ఇవ్వకుండా మీకెలా ఇస్తారో చూస్తాం అనే మాటలు జర్నలిస్టు మిత్రుల నుంచే ఎందుకు వస్తున్నాయి..? ఇప్పుడు జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టిందే కేసీయార్…!! అన్నట్లు, బ్యూరో చీఫ్‌లు, ఎడిటర్ల మాటలకేనా విలువ..? వాళ్ల అభిప్రాయాలే ప్రామాణికమనే కొత్త ప్రాతిపదిక దేనికి..?! (ఈ కథనానికి సొసైటీ సభ్యులు ప్లస్ అంతకుముందు గోపనపల్లిలో ప్లాట్లు పొందిన కొందరు సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలే ఆధారం…)
Share this Article