మీడియా ముందు ఒళ్లు మరిచి మాట్లాడకూడదని కేసీయార్ రేవంత్‌రెడ్డికి సూచించాడు… ఎక్కడ..? నిన్న ప్రెస్ మీట్‌లో..! నిజమే సారూ… మస్తు చెప్పినవ్… కానీ అదే నీతిసూత్రం కేసీయార్‌కు కూడా వర్తించాలి కదా… అవే గప్పాలు, అవే అబద్ధాలు, అవే ప్రగల్భాలు, అవే డొల్ల మాటలు… ఇంకెన్నాళ్లు..? ఎంతసేపూ జనం పిచ్చోళ్లు, నేను చెప్పింది నమ్మేస్తారు అనే పోకడేనా..?
తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చినవాడిగా అమితమైన అభిమానాన్ని ఇచ్చింది, ఆకాశాన నిలిపింది… నీఅంతట నువ్వే వేగంగా జారిపోతూ, చేజేతులా ఆ ఖ్యాతిని చెడగొట్టుకుంటున్నట్టే కదా… ఒక్కసారి సదరు ప్రెస్ మీట్‌లో కేసీయార్ చెప్పిన కొన్ని అంశాలేమిటో, రియాలిటీ ఏమిటో పైపైన చెప్పుకుంటే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు కేసీయార్‌లోని అహంభావం ప్రజలు తిరస్కరించినా సరే ఇంకా తగ్గలేదని మనకూ అర్థమవుతుంది..,
Ads
* ఇండి కూటమి, ఎన్డీయే కూటమి అధికారానికి రావు, ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కడతాం, మాదే అధికారం… ఏదో ఒక జాతీయ పార్టీ మాకు మద్దతునిస్తుంది… ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాను…
– ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక కూటమితో జతకట్టి ఉంది… జగన్, కేసీయార్ తప్ప… ప్రత్యేకించి కేసీయార్‌ను మమత, స్టాలిన్, లాలూ, పవార్, కేజ్రీవాల్ గట్రా ఎవరూ నమ్మరు, నవీన్ పట్నాయక్ అసలే నమ్మడు… మరిక ఏ ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడాలి..? ఏ జాతీయ పార్టీ మద్దతునివ్వాలి..? ఉత్త పోచికోలు కబుర్లు… అదే జరిగితే ప్రధాని పదవికి ప్రథమ పోటీదారు మమత…!
* నేను సైతం ప్రధాని రేసులో ఉన్నాను…
– ఉండొచ్చు, ఆశలుండటంలో తప్పులేదు, మన దేశానికి గుజ్రాల్‌లు, దేవెగౌడలు, చంద్రశేఖర్‌లు ప్రధానులు కాలేదా..? కానీ ఆ పరిస్థితులు వేరు… దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో ప్రధాన ప్రత్యర్థులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక ఈ శొంఠికాయ ఒంటిలింగాన్ని సీఎంను చేస్తారు… ఏమో, అలాంటి స్థితి వస్తే కేసీయార్ ప్రధాని కావొద్దని ఏముంది..?
* బీజేపీకి దక్షిణాన 10 సీట్లకు మించి రావు… తెలంగాణలో ఒకటి లేదా సున్నా… మాకు 12- 14 సీట్లు, కాంగ్రెస్‌కు 9 స్థానాల్లో థర్డ్ ప్లేస్…
– రాజకీయంగా ఇలాంటి మాటలు ఎన్నయినా చెప్పొచ్చు అవసరానికి… కానీ తెలంగాణలో ఎంపీ సీట్లకు సంబంధించి ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే… నిజంగానే బీఆర్ఎస్‌కు 12- 14 సీట్లు వచ్చే సిట్యుయేషనే ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతటా జనం కర్రు కాల్చి వాతపెట్టేవాళ్లు కాదు కదా… మిగతా లెక్కల మాట అనవసరం ఇక్కడ…
* తెలంగాణ పోలీసులు ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముఖ్య నాయకుడిని అరెస్టు చేద్దామనుకున్నారు, ఆ కక్ష మనసులో పెట్టుకుని కవితను కేసులో ఇరికించి అరెస్టు చేశారు…
– అది నిజమే అనుకుందాం, కానీ అంత కక్ష పెంచుకుంటే కేటీయార్‌నో, కేసీయార్‌నో బుక్ చేసి అరెస్టు చేస్తారు కదా, కవిత జోలికి ఎందుకు వెళ్తారట..?!
* మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది… మహారాష్ట్రలోనూ పోటీ…
– అంత సీనే ఉంటే ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక్క సీటులోనూ పోటీ చేయడం లేదెందుకు..? తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో ఉనికి ఉంది..? మహారాష్ట్రలో అద్దెకు తీసుకున్న భవనాలకూ అద్దె కట్టక ఖాళీ చేయించారు కదా… అవునూ, ఆంధ్రాలో ఎందుకు పోటీచేయలేదు..? పక్కనే ఉన్న కర్నాటకలో ఎందుకు లేదు..? తెలంగాణలోనే కూసాలు కదిలిపోయాయి కదా..!!
Share this Article