వత్సా కల్వకుంట్ల చంద్రశేఖరా… నేను గుర్తుండకపోవచ్చు నీకు… మళ్లీ ఎన్నికలొస్తేనే గుర్తొస్తాను నీకు వోటర్లలాగే… అంతేనా..? నన్ను నేను పునఃపరిచయం చేసుకుంటాను… నన్ను కల్యాణ వెంకటేశ్వరుడు అంటారు… నా ఊరు కోనాయపల్లి… నీ ఒకప్పటి నియోజకవర్గం సిద్దిపేట ప్రాంతంలోనే ఉంటుంది మా ఊరు… గుర్తొచ్చిందా..?
కేసీయార్‌కు భద్రాద్రి రాముడు అసలే పట్టడు, శైవ దేవాలయాలు అసలే పట్టవు అంటుంటారు… ఆ ఒక్క యాదాద్రి తప్ప మరేమీ పట్టదు, అంత ప్రేమ యాదాద్రి నరసింహుడి మీద అంటుంటారు… కానీ ఒకప్పుడు నీకు నేనంటే అమితమైన భక్తి… ప్రతిసారీ నువ్వు నామినేషన్ వేసేటప్పుడు నా దగ్గరికే ఆ కాగితాలు తీసుకొచ్చేవాడివి… ఆ యాదాద్రి నరసింహుడికన్నా నేనే ఎక్కువ ఈ అతివీర భక్తుడికి అనుకుని మురిసిపోయేవాడిని…
Ads
నా ఆశీస్సులు అడిగేవాడివి… అలాగే ఇచ్చాను… ఇంత వాడిని చేశాను… ఐనా నీ భక్తిలో కృతజ్ఞత మాయమైందేమి కేసీయార్… నన్ను కూడా హైదరాబాద్ జర్నలిస్టుల కోవలో కలిపేసుకున్నావా ఏం కొంపదీసి..? చివరకు ఆ యాదాద్రిని కూడా భక్తులకు అగచాట్ల మయం చేశావట కదా… వందల కోట్లు పెట్టి చివరకు ఆ నరసింహుడికీ ఆ అడ్డదిడ్డం మేకప్ వేశావన్నమాట…
ఏమనుకుంటివో ఏమో గానీ… 3 కోట్ల దాకా నా ఇంటికీ ఇస్తివి… ఇచ్చావు సరే, మళ్లీ ఇటు దిక్కు వచ్చినవా..? పోనీ, మీ హరీష్‌ను పంపించావా కనీసం..? ఆయన సిద్దిపేటలోని ప్రతి ఊరినీ డల్లాస్ చేశాడంటారు కదా… ఏమైంది..? ఓ గోపురం కట్టారు, మార్బుల్ పరిచారు, గోపురంపై సిమెంట్ విగ్రహాలు మలిచారు… మెరుస్తూ ఓ ధ్వజస్థంభం నిలిచింది… అబ్బురంగా ద్వారబంధాలూ అమిరాయి… అయితే అక్కడితో ఆగిపోయింది… అరకోటి కావాలట, ఆర్థిక పరిస్థితి బాగాలేక సర్కారీ బిల్లులన్నీ ఆగిపోతున్నమాట నిజమేనేమో, కానీ మరీ నా అరకోటికే ఈ కొరత పీడించాలా నాయనా..?
అందరూ ఉత్తర ద్వార దర్శనం పరమ పవిత్రం అంటుంటే ఎవరో దొంగలకు బాగా నచ్చినట్టుంది… ఆ మార్గంలోనే నా హుండీనే ఎత్తుకుపోయారు… ఐనా అందులో ఏమున్నాయిలే… నా దగ్గరకు వస్తున్న భక్తుల సంఖ్య ఏపాటి… చివరకు నా గుడినే అర్థంతరంగా వదిలేస్తివి… ఎవరొస్తారు..? సీలింగ్ నుంచి వేలాడే తీగలు, కనిపించని ఫ్లోరింగ్, అంతెందుకు..? పాపం, అంతటి నా భక్తుడు హనుమంతుడినే అలా గాలికి వదిలేశారు కదా మంటపంలో…
మరీ ఈమధ్య నెలవారీ కల్యాణాల్ని కూడా రద్దు చేశారోయ్, బాధనిపిస్తోంది… చివరకు నీ పాలనలోని కౌలు రైతు దుస్థితిలా అయిపోయాను నేను కూడా… ఐనా నువ్వంతే… ఏ పని చేసినా సగంలో ఆపేస్తవ్… నీ ఈ గుణాన్ని మాత్రం మార్చలేకపోతున్నా… ఈ చిన్న ఊరిలో కూడా రోడ్డు వెడల్పు అట… హేమిటో నువ్వు అర్థం కావు… నువ్వే అనుకుంటే నీ హరీషుడు నీకన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్టున్నాడు…
ఒకసారి రావయ్యా, నా ఇంటి దురవస్థ చూడు… నా పునఃఆశీస్సులు లేకపోతే నువ్వు ప్రధాని కాలేవు… కనీసం అధికార విపక్ష కూటములు నువ్వు ఉన్నావని కూడా గుర్తించవు… మళ్లీ ఎన్నికలప్పుడు వస్తావేమో, ఏమో, ఈసారి అదీ మరిచిపోతావేమో, నామినేషన్ కాగితాలు నా ముందు పెట్టేసి, ఆశీర్వదించు దేవుడా అంటే నేను వినకపోవచ్చు, వినిపించకపోవచ్చు… నీ ఇష్టం…
Share this Article