కేసీయార్ కొత్తగా ఓ పార్టీ పెడుతున్నాడు… నెలాఖరున ప్రకటించబోతున్నాడు… ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో వాక్యూమ్ నెలకొని ఉన్నందున, ఇప్పుడున్న పార్టీలేవీ దేశాన్ని ఉద్దరిస్తలేవు కాబట్టి కేసీయార్ పూనుకుని, బంగారు భారతం కోసం ఉద్యమించబోతున్నాడు… ఆ పార్టీ పేరు బీఆర్ఎస్… పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకున్నాడు…….. ఇదండీ వార్త సంక్షిప్త సారాంశం… ఈ ప్లానింగు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని గుసగుస…
మంచిదే… రాజకీయాల్లో కూడా కొత్త నీరు వస్తుండాలి… నిల్వ నీరు వెళ్లిపోవాల్సిందే… కానీ గత ఎన్నికల ముందు నుంచే జాతీయ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను, బీరెడీ అంటూ భీకరంగా ఉరుముతున్నాడు కదా కేసీయార్, ఇప్పటివరకూ చేసిందేమీ లేదు కదా, అప్పుడే ఫ్రంట్ అంటాడు, మరొకటి అంటాడు, ఊదు కాలదు, పీరు లేవదు… మళ్లీ ఇప్పుడే ఎందుకు ఈ హంగామా..? ఈ ప్రశ్నకు జవాబు దొరకడం కష్టం… రాజకీయాలు ఎప్పుడూ మార్మికంగానే ఉంటాయి…
భారతీయ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్రీయ సమితి, భారత రాష్ట్రీయ సమితి… మొత్తానికి ఓ హిందీ పేరు తగిలించుకుంటే తప్ప అది జాతీయ పార్టీ కాదన్నమాట… గుడ్… ఈ జాతీయ పార్టీ (?) వార్తలు బీజేపీ క్యాంపులో మంచి ఆనందాన్ని కలిగిస్తున్నాయి… అర్థం కాలేదా..? కేసీయార్ పార్టీ పెట్టి ఢీకొడతానంటే బీజేపీ క్యాంపులో ఆనందం ఎందుకు అంటారా..? అదే రాజకీయం… యాంటీ-బీజేపీ క్యాంపులు వేర్వేరుగా బలపడాలి… అదే బీజేపీకి శ్రీరామరక్ష… సో, బీఆర్ఎస్ పేరిట కేసీయార్ ఏ యాక్టివిటీ చేసినా బీజేపీకే ప్రయోజనం…
Ads
నిజానికి జాతీయ పార్టీ అనే పదం వాడటమే తప్పు… జాతీయ పార్టీ అనడానికి కొన్ని అధికారిక లెక్కలుంటయ్… సీపీఐ, సీపీఎం వంటి పార్టీలే జాతీయ పార్టీగా గుర్తింపు హోదాను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నయ్… ఇప్పుడు ఒకవేళ నిజంగానే కేసీయార్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెడితే… దాన్ని ఎన్నికల సంఘం ఓ పార్టీగా రిజిష్టర్ చేసుకుంటుంది… అంతే… అది జాతీయ పార్టీ హోదా గుర్తింపు పొందాలంటే… కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల నుండి లోక్‌సభలో ఆ పార్టీ 2% సీట్లు గెలుచుకుకోవాలి… లోక్‌సభ లేదా శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో ఆ పార్టీ ఏదైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లను రాబట్టగలగాలి… అలాగే నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలి…!
సాంకేతిక చిక్కుల దృష్ట్యా…. టీఆర్ఎస్ పార్టీని అలాగే కొనసాగిస్తే… ఆ గుర్తు కోసం దానిపైనే తెలంగాణ సీట్లలో నిలబడాలి… బీఆర్ఎస్ పేరుతో పోటీలు వర్కవుట్ కావు, సో, కీలకమైన సొంత రాష్ట్రంలోనే ఆ పేరిట పోటీలకు కొన్ని చిక్కులుంటాయి… చాలా గందరగోళం ఆవరిస్తుంది… పంజాబ్ వెళ్లి రైతులకు చెక్కులు ఇచ్చి వచ్చినంత ఈజీ కాదు జాతీయ రాజకీయాల్లో నిలబడటం, పోటీపడటం… పలు భాషల పత్రికల్లో వందల కోట్లతో యాడ్స్ ఇస్తే లీడర్ అయిపోరు… ఈరోజుకూ టీఆర్ఎస్‌కు ఏ అంశంపైన కూడా ఓ జాతీయ దృక్పథం లేదు… మరి వేరే రాష్ట్రాల ప్రజలు ఈ కొత్త పార్టీని ఎలా అక్కున చేర్చుకుంటారు… ప్రశాంత్ కిషోర్ మొహం చూశా..?!
సరే, కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు… మూడో సమాఖ్య వద్దు… కేసీయారే ఓ జాతీయ నేతగా ఎదగాలని కోరుకుంటున్నాడు సరే… సంకల్పాన్ని తప్పుపట్టొద్దు… కానీ సోకాల్డ్ హేమంత్ సోరెన్, కుమారస్వామి, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ ఎట్సెట్రా నేతలు వాళ్ల పార్టీలు బలోపేతం కావాలని కోరుకుంటారు తప్ప నీ బీఆర్ఎస్‌కు జై అనరు కదా… విలీనం చేయరు కదా… మరి వేర్వేరు రాష్ట్రాల్లో పల్లకీ మోసేవాళ్లు ఎవరు..? కాంగ్రెసేతర, బీజేపీయేతర దోస్తులకు సమాంతరంగా ఎదగాలని కోరుకుంటే ముందుగా తొక్కే ప్రయత్నం చేసేది వాళ్లే… కొత్త ప్రత్యర్థిని ముందుగానే అడ్డుకుంటారు… అంతెందుకు..? ఢిల్లీలో ధాన్యం దీక్ష పెడితే, నెలలుగా రైతులు కదం తొక్కిన ఆ గడ్డ మీద కేసీయార్ దగ్గరకొచ్చి పలకరించిన నేత లేకుండా పోయారు… ఇది రియాలిటీ…
ఏదో అప్పుడప్పుడూ ఇలా వార్తల తెర మీదకు రావడం, పోవడం అలవాటైపోతే… రాను రాను జనం కూడా పట్టించుకోరు… పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకుంటున్నాడు అనే వాక్యాలూ విచిత్రమే… కేసీయార్ ఒకరి అభిప్రాయాలకు తీసుకుని అడుగులు వేయడు… తను వెళ్తుంటాడు, మిగతావాళ్లు వెంట నడవాలి… అంతే… అవును సారూ… మరి జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోతే, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే… మరి టీఆర్ఎస్… ఇక్కడ ప్రభుత్వం మాటేమిటి..? చిన్న సారుకు వారస పట్టాభిషేకం జరగాల్సిందేనా..?
చివరగా చిన్న సూచన… గూర్ఖాలాండ్ ప్రజలు కూడా తెలంగాణ ప్రజల్లాగే తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారు… కాస్త ఈ కొత్త పార్టీ ప్రకటన పూర్తికాగానే కోల్‌కతా వెళ్లి, మీటింగు పెట్టి, దీని మీద మీ వైఖరి ఏమిటో చెప్పాలి… అక్కడి నుంచే దేశాన్ని సెట్ రైట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం… తెలంగాణనే బోలెడు జిల్లాలుగా చేసుకున్నాం… సేమ్, దేశంలోని చాలాచోట్ల కొత్త రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి… వాటి మీద కూడా ఓ జాతీయ దృక్పథం ప్రకటిస్తే సరి…!!
Share this Article