కేసీయార్ పూజలు, యాగాలు, హోమాలు మనకు కొత్త కాదు… మామూలు హోమాల నుంచి అయుత చండీయాగం దాకా తను చేసినన్ని విశిష్ట పూజలు బహుశా ప్రస్తుత రాజకీయ నేతల్లో ఎవరూ చేయించి ఉండరు… ఏది చేయించినా మంచి విద్వత్తు ఉన్నవాళ్లతో దక్షిణాచార పద్ధతిలో చేయిస్తాడు… ఫలితం ఆశిస్తాడు… దాపరికాలు, రహస్యాలు ఏమీ ఉండవు… కానీ అస్సోం రాష్ట్రంలో ప్రధాననగరం గౌహతిలోని, అత్యంత ప్రముఖమైన కామాఖ్య గుడిలో భగాలాముఖి పూజ తన పేరిట జరగడమే ఓ విశేషం… ఎందుకంటే..?
కేసీయార్ ఎప్పుడూ వామాచార పద్ధతిలో పూజలు చేయించడు… లక్ష్య సిద్ధి కోసం ఉద్దేశించిన రాజశ్యామల పూజ చేయించినా సరే, దాన్ని సంప్రదాయబద్ధమైన రీతిలోనే చేయించినట్టు గుర్తు… కానీ కామాఖ్య గుడిలో భగాలాముఖి పూజను గోప్యంగా, వామాచార పద్ధతిలో చేయించడమే ఆశ్చర్యం అనిపించింది… (దేవీ పూజల్లో పద్ధతులు వేరుగా ఉంటాయి తప్ప… క్షుద్రం, ఉత్తమం, నీచం అనేవి ఉండవు… కాకపోతే వామాచార పద్థతిలో పూజ సంప్రదాయ దక్షిణాచార పద్ధతికి పూర్తి భిన్నంగా కాస్త అరాచకంగా ఉంటుంది… బలి, మద్యం గట్రా…)
అయితే కేసీయార్ తాను స్వయంగా చేయించుకున్న పూజ కాకపోవచ్చు… తన ఫోటో ప్లస్ ఇంకెవరిదో ఫోటో వీడియోలో కనిపిస్తున్నాయి… వాటిని పెట్టి పూజ చేస్తున్నారు… బహుశా కేసీయార్ కోసం ఇంకెవరో లీడర్ చేయించి ఉంటాడు… సరే, పూజ చేయించడం తప్పేమీ కాదు… అది విశిష్టమైన, ప్రభావశీల పూజే… అసలు ఏమిటీ భగాలాముఖి..?
Ads
ఊళ్లల్లో మైసమ్మ, ఉప్పలమ్మ, బాలమ్మ వంటి గ్రామదేవతలకు పూజలు ఎలా చేస్తామో తెలుసు కదా..? వాళ్లందరూ శక్తిస్వరూపిణులే… దేవీ అవతారాలే అని గ్రామీణుల నమ్మకం… కల్లు లేదా సారా సాగపోస్తారు… మేకనో, కోడినో బలి ఇస్తారు… తరతరాలుగా వాళ్లకు చేసే పూజా పద్ధతులు అవే… సేమ్, దశ మహావిద్యలు… అంటే అమ్మవారిని పది అవతారాల్లో పూజించడం… మామూలుగా మనం గుళ్లల్లో చూసే దక్షిణాచార పూజా పద్ధతులు ఈ అమ్మవార్లకు సంబంధించి అంత ప్రభావమంతం కావు… వామాచారమే పవర్‌ఫుల్… దశ మహావిద్యలు అంటే కాళి, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపురసుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, భగాళాముఖి…
వీటిలో భగాలాముఖి పూజ ఆరోగ్యం కోసం, శత్రువుపై విజయం కోసం..! కేసీయార్ అటూఇటూ బాగానే తిరుగుతున్నాడు… ఆరోగ్యంగానే ఉన్నాడు… మరి ప్రత్యర్థులపై విజయం కోసమా..? ఇప్పుడు తాజాగా తనకు జాతీయ రాజకీయాల్లో మోడీయే ప్రత్యర్థి అంటున్నాడు కదా… మోడీ మీద విజయం కోసమేనా ఈ రహస్య పూజలు..?! కామాఖ్య గుడి ఇలాంటి తాంత్రిక పూజలకు ఫేమస్… ఈ దశమహావిద్యల పూజలు ఇతర గుళ్లల్లో చేయడం వేరు, కామాఖ్య గుడిలో చేయడం వేరు… పైగా వైజాగ్ పీఠాలు, ముచ్చింతల్ పీఠాలు, శృంగేరీ పీఠాలు గట్రా ఈ పూజలు చేయలేవు… అఫ్‌కోర్స్, ఇప్పుడు ముచ్చింతల్ చినజియ్యరుడితో పెద్ద కయ్యమే అయిపోయింది కాబట్టి అక్కడికి పోయేదే లేదు… ఇంతకీ కేసీయార్ కోసం ఈ పూజలు చేయించిన వ్యక్తి ఎవరబ్బా..?! మోడీజీ.., ఏమైనా విరుగుడు పూజలు అదే కామాఖ్య గుడిలో చేయిస్తే బెటరా..? అక్కడి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మకు ఓ మాట చెబితే పోలా..!!
Share this Article