Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జల్ జంగ్ సరే..! కానీ కేసీయార్ వదిలేసిన కీలక నీటి ప్రశ్నలేమిటంటే..!!

December 22, 2025 by M S R

.

కేసీయార్ జల్ జంగ్ అంటున్నాడు కదా… ఊరూరా డప్పు కొట్టి ఉద్యమిస్తాం అంటున్నది సుదీర్ఘమైన తన ప్రెస్‌మీట్‌లో ప్రధానంగా నీళ్ల గురించే కదా… తోలు తీస్తానంటున్నాడు కదా పవన్ కల్యాణ్ భాషలో… గుడ్, తెలంగాణ పార్టీగా, ప్రతిపక్షంగా చేయాల్సిందే కానీ తను జవాబులు చెప్పాల్సిన చాలా ప్రశ్నల్ని వదిలేశాడు… అవి తన వైపల్యాలు కాబట్టి… వాటివల్లే తెలంగాణకు నీళ్ల ద్రోహం ఉమ్మడి పాలనలోకన్నా ఎక్కువ జరిగింది కాబట్టి…

మళ్లీ జల్ జంగ్ అంటే… తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరుకు, తెలంగాణకు అన్యాయం అని పదే పదే చెప్పడం అంటే… బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్పిడితోపాటు, ఆ పాత టీఆర్ఎస్‌లా ఎమోషన్స్‌ను రాజేసే ఆలోచనా..? మళ్లీ బలం పుంజుకోవాలంటే అదే శరణ్యమనే నమ్మకమా..? 11.5 ఏళ్లయింది కదా, ఇంకా ఆంధ్రాబాబులను, చంద్రబాబులను తిడితేనే తెలంగాణలో వోట్లు పడతాయా..?

Ads

అవును, నిజమే… తెలంగాణకు నదీజలాల విషయంలో ద్రోహం జరిగింది, నష్టం జరిగింది… మరి తన పదేళ్ల కాలంలో ఏం జరిగింది..? న్యాయం చేసే ప్రయత్నం జరిగిందా..? మరింత నష్టం జరిగిందా..? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని కరివెన రిజర్వాయర్ దగ్గరకు వెళ్లి మీటింగ్ పెట్టే ఆలోచనలోనూ ఉన్నాడు కదా… ఓసారి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చెప్పుకుందాం…

1) దక్షిణ తెలంగాణకు… ఇప్పుడు కేసీయార్ పదే పదే చెబుతున్న పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు ఎందుకు పట్టించుకోలేదు… నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, ఎస్ఎల్‌బీసీ, డిండితోపాటు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు..? కాళేశ్వరం ఆగమేఘాల మీద పూర్తి చేసి, ఈ కృష్ణా ప్రాజెక్టులను ఎందుకు పండబెట్టినట్టు..? ఎందుకు ఎండబెట్టినట్టు..? దేవాదుల కూడా ఎందుకు పట్టలేదు..? సంగంబండ ఎందుకు, ఎవరి వల్ల ఆగింది..?

2) పాలమూరు రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వాపస్ పంపిస్తే గాయిగత్తర రేపి ఉండాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్లకు చేతకాదు సరే… కానీ తప్పులతడక డీపీఆర్ పంపించింది ఎవరు..? ఎవరి హయాంలో వాపస్ వచ్చింది..? అప్పుడెందుకు గాయిగత్తర లేదు..?

3) ఎగువన జూరాల నుంచి గాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దిగువ శ్రీశైలం బేస్డ్ ప్రాజెక్టుగా మార్చింది ఎవరు..? పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారిన హర్షవర్ధన్‌రెడ్డి ఏ పార్టీ లీడర్..? తనకు బీఫారమ్ ఇచ్చిన పార్టీ ఏది..? ఇప్పుడు అక్కడే జల్ జంగ్ స్టార్ట్ చేసి ప్రజలకు ఎవరు,, ఏ నిజాలు చెప్పాలి..?

4) అంత ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరం ఎందుకిలా తస్కిపోయింది..? ఎవరి సొంత డిజైన్ల వల్ల..? మేడిగడ్డ డొల్లతనం బయటపడింది ఎవరి హయాంలో..?

5) పోలవరం- నల్లమలసాగర్ ఆంధ్రాబాబు దోపిడీ, కుట్ర ప్రయత్నమే అనుకుందాం సరే… దానిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే కేసు వేసి కొట్లాడుతోంది… కానీ అంతకు ముందు జగన్‌తో కలిసి మరో కాళేశ్వరం వంటి ప్రాజెక్టుతో దుమ్ముగూడెం నుంచో ఏపీకి తరలించే ఆలోచన చేసింది ఎవరు..?

6) పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తుంటే, శ్రీశైలం నీటిని అప్పనంగా తరలించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటే… జగన్‌తో దోస్తీ కారణంగా చూస్తూ ఊరుకున్నదెవరు..? రాయలసీమ లిఫ్టు ఎవరి హయాంలో మొదలైంది..? ముచ్చుమర్రి, మల్యాల ఎవరి హయాంలో జరిగిన నష్టాలు..? రోజా ఇంట్లో విందుభోజనం చేసి ‘రత్నాల సీమ’ హామీలు ఇచ్చింది ఎవరు..?

6) అసలు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు సంతకాలు చేసిందెవరు..? తెలంగాణకు దాంతో జరిగిన ఆ నష్టం మాటేమిటి..? అప్పర్ భద్ర, ఆర్డీఎస్, ఆలమట్టి విషయాల్లో ఏమీ పట్టనట్టుగా ఉండిపోయింది ఎవరు..? అనేక ప్రశ్నలు… అవును, చర్చ జరిగితే మంచిదే… రేవంత్ ప్రభుత్వానికి చురకలు పెట్టడమూ ప్రతిపక్షంగా అవసరమే… కానీ అసలు నిజాలు కప్పబడిపోతే ఎలా..?!

చివరగా... కేసీయార్ చెప్పేదాంట్లో 90 శాతం అబద్ధాలే అంటున్నాడు ఉత్తమకుమార్ రెడ్డి... అంటే 10 శాతం నిజాలున్నాయని అంగీకరించినట్టే కదా... ఆ 10 శాతం నిజాలేమిటో ఉత్తముడు కూడా వివరంగా జనానికి చెప్పాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జల్ జంగ్ సరే..! కానీ కేసీయార్ వదిలేసిన కీలక నీటి ప్రశ్నలేమిటంటే..!!
  • నో, నో…! బిగ్‌బాస్ పాపులారిటీతో ఏదో ఒరుగుతుందని అనుకుంటే భ్రమే..!!
  • యశోధర రాజే ఎవరు..! KCR ఎదుట తన సీఎం, తన పీఎం పరువు తీసిందా..?!
  • సినిమాల్లోకి ఆమని రీఎంట్రీ..! ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ..! కానీ..?!
  • కాంచనసీత..! ఏదో ఓ పురాణగాథను వర్తమానీకరించడం దాసరికి అలవాటే..!
  • BRS to TRS…? పార్టీ పేరులో తెలంగాణ ఆత్మకు పునఃప్రతిష్ట..?!
  • బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాల… ఈసారీ నో లేడీ విన్నర్…
  • లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ కరువు… కానీ గీతదాటితే మెలోడ్రామాతో సినిమా మటాషే…
  • విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం… సిద్ధరామయ్య బాటలో రేవంత్ రెడ్డి…
  • హైదరాబాదులో మెరిసిన మోనాలిసా..! అంతా విధి మాయ… ఇంట్రస్టింగ్ ఏమిటంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions