.
పోలిక అస్సలు బాగుండదు… కానీ తప్పడం లేదు… పహల్‌గాం పైశాచిక ఉగ్ర చర్య తరువాత షర్మిల స్పందనకూ, రేవంత్ రెడ్డి స్పందనకూ… అలాగే కేసీయార్ స్పందనకూ రేవంత్ రెడ్డి స్పందనకూ… తేడా చూస్తున్నారు నెటిజనం…
రేవంత్ రెడ్డి స్పందనకు అప్లాజ్ వస్తోంది… ముందుగా షర్మిలతో పోలిక… ఆమెతో ఎందుకు అంటే..? మన పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె… రేవంత్ రెడ్డి ఇక్కడి సీఎం… ఆమె ఎక్కడో మాట్లాడుతూ మోడీ, అమిత్ షా రాజీనామాలు చేయాలట…
Ads
ఈమె ఇంతకుముందు తెలంగాణను రాజన్నరాజ్యం చేసి ఉద్దరించాలని, ఇక్కడే రాజకీయాలు చేసి, జనం ఫోఫోవమ్మా, నువ్వూ నీ రాజకీయాలు అని లైట్ తీసుకున్నాక హఠాత్తుగా ఏపీని ఉద్దరించే రాజకీయాల్లో పడింది… అది కాంగ్రెస్ కదా, అప్పటికప్పుడు పైనుంచి దిగిన ఆమెకు పార్టీ పగ్గాలు ఇవ్వడం ఏమిటో, ఆ వ్యూహం ఏమిటో, దాంతో ఏం సాధించారో ఆ పరమాత్ముడికే ఎరుక…
పోనీ, వీథుల్లోకొచ్చి కనీసం నాలుగు కేండిల్స్ పట్టుకుని, పది మందిని వెంటేసుకుని కనీసం నిరసన ప్రకటించిందా..? అదీ లేదు… అఫ్‌కోర్స్, ఆ పని చంద్రబాబుకూ చేతకాలేదు… హిందూ మతోద్ధారకుడు పవన్ కల్యాణ్‌తోనూ కాలేదు… ఆ పని రేవంత్ రెడ్డి చేశాడు… ఒవైసీ జతకలవడం మాటెలా ఉన్నా… కేంద్రంపై గాలి విమర్శలకు గాకుండా… కాంగ్రెస్ నాయకుడిలా గాకుండా ఈ దేశస్తుడిగా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు…
జనంలోకి వచ్చాడు… పాకిస్థాన్‌ను ముక్కలు చేయండి, పీవోకేను భారత్‌లో కలపండి, ఈ దేశం మీ వెంట ఉంటుంది అన్నాడు… అదీ ఒవైసీని పక్కన నిలబెట్టుకుని..!
నిజానికి రేవంత్ రెడ్డి ప్రసంగం చాలామంది మర్యాదస్తులకు నచ్చదు… అనాగరిక భాష కూడా వాడుతూ ఏదేదో మాట్లాడతాడు, నడుమ పరుషమైన పదాలు, తిట్లు సరేసరి… లాగూల్లో తొండలు వంటి పిచ్చి పదాలూ వచ్చేస్తుంటాయి… కానీ పహల్‌గాం సభలో ఓ పద్ధతిగా మాట్లాడాడు… జనం కేసీయార్‌తో పోల్చి అభినందిస్తున్నారు…
ఈ దేశం ఏం తక్కువ ఇచ్చింది కేసీయార్‌కు… ఎంత సీనియర్ పొలిటిషియన్… ఇన్నాళ్లూ తెలంగాణ జనం కష్టనష్టాల్లో, సమస్యల్లో ఏ ఒక్కరోజూ బయటికొచ్చి భరోసాగా నిలబడింది లేదు, పైగా నన్ను ఓడించారు కదా అనుభవించండి అనే ఓ మూఢ వైఖరి… ప్రజాజీవితం అంటే ఇదేనేమో బహుశా తను చదివిన లక్ష పుస్తకాలు నేర్పింది…
పహల్‌గాం దుశ్చర్యపైనైనా బయటికి రాలేదు, మాట్లాడలేదు, ఏ ప్రోగ్రామూ లేదు… తన నుంచి లేదు, పార్టీ నుంచి లేదు… జస్ట్, ఖండన ప్రకటనలు… అదైనా వీడియో రిలీజ్ చేయొచ్చు కదా కనీసం… హెచ్‌సీయూ ఎఐ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోల దుష్ప్రచారాల నడుమ పహల్‌గాం ఇన్సిండెంటు మీద స్వంత వీడియో రిలీజ్ అయితే ఎంత బాగుండేది..?
ఇక ఇప్పుడు సభ పెడతాం, కేసీయార్ ఏం చెబుతాడో వినడానికి లక్షల మంది వస్తారు, తెలంగాణ సత్తా చాటుతాం అని ప్రకటనలు… తెలంగాణ సత్తాకూ కేసీయార్ సభకూ లింకేమిటో… కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి తదితరులు తెలంగాణ కాదా..? నీకన్నా ఎంతో జూనియర్ రేవంత్ రెడ్డి… అలాంటిది నీ నుంచి ఎంత పరిణత ప్రజాజీవిత పోకడలు ఆశిస్తారు జనం… ఏది అది..? ఏమైంది..?
ఎవరో అంటున్నారు… పహల్‌గాం మీద ఏం చేసినా అది బీజేపీకి నయం కదా, కాంగ్రెస్ ఎందుకు నిరసనలకు దిగాలి అని,…! రేవంత్ కాంగ్రెస్ కాదా..? పైగా ఒక రాష్ట్రానికి సీఎం… పక్కన ఒవైసీ లేడా..? వాళ్లు దేశం కోణంలో చూశారు తప్ప, దీన్ని యాంటీ బీజేపీ అని చూడలేదు కదా… రాబర్ట్ వాద్రా పిచ్చి కూతల్ని వదిలేస్తే సాక్షాత్తూ రాహులే పహల్‌గాం వెళ్తున్నాడు కదా పరామర్శలకు… ఎస్, పహల్‌గాం దుశ్చర్యను కూడా యాంటీ బీజేపీ కళ్లజోడు నుంచి చూస్తే అంతకుమించిన దరిద్రం మరొకటి లేదు… అది ఉగ్రవాదానికి సమర్థన కూడా..!!
Share this Article