మళ్లీ మొదటికొచ్చింది కేసీయార్ తృతీయ కూటమి కథ… దానికి ఏ ఫ్రంట్ పేరు పెడతాడనే సంగతి తరువాత… బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అనే తన ఆలోచనల్ని మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ తిరస్కరిస్తున్నాయి… అంతేకాదు, తనకే యాక్సెప్టెన్సీ దొరకడం లేదు… అసలు కాంగ్రెస్ లేకుండా బీజేపీ మీద పోరాటం ఏమిటని మమత, స్టాలిన్, శరద్ పవార్ తదితరులు కొట్టిపారేస్తున్నారు… నిజంగానే కేసీయార్‌ది ఇప్పుడు ఎటూ వెళ్లలేని సంధిదశ…
ఎందుకంటే..? మిగతా అందరినీ కూడగట్టి, ఆపరేట్ చేయాలని తన ఆశ… కానీ ఎవరి ఆశలు, ఎవరి అంచనాలు, ఎవరి పరిస్థితులు వాళ్లవి… హేమంత్ సోరెన్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ తదితరులందరూ కాంగ్రెస్‌తో కూడి అధికారం వెలగబెడుతున్నవాళ్లే… యూపీలో ఎస్పీతో ఏ పొత్తూ లేకపోయినా బీహార్‌లో ఆర్జేడీతో దోస్తీ అలాగే పదిలంగా ఉంది… చివరకు కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు… జేడీఎస్ లైట్… జేడీయూ ఎన్డీయే భాగస్వామి… బీజేడీ న్యూట్రల్… జగన్ బీజేపీపై పోరుకు రాడు… పీడీపీ, అకాలీదళ్, నేషనల్ కాన్పరెన్స్ మరీ ఘోరంగా దెబ్బతిని ఉన్నయ్… చంద్రబాబును బీజేపీ రానివ్వడం లేదు… మరెవరు కేసీయార్ వెంట వచ్చేది…
ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఖుల్లంఖుల్లా కేసీయార్ పరిస్థితిని రాసింది… లోపల వార్త చదవాల్సిన పనిలేదు, డెక్కులన్నీ ఓసారి చదివితే పిక్చర్ అర్థమవుతోంది… నిజమే… సాహసించి, ఢిల్లీలో ధాన్యం దీక్ష చేస్తే, అంతకుముందు తనను హైదరాబాదులోనే బీజేపీ బీ-టీం అని తిట్టిపోయిన ఆ రాకేష్ టికాయత్ తప్ప ఇంకెవరూ రాలేదు, సంఘీభావాలు లేవు, మద్దతు ప్రకటనలు లేవు, నేషనల్ మీడియా కూడా పట్టించుకోలేదు… ఒక్కరంటే ఒక్క ప్రతిపక్ష పార్టీ లీడర్ నుంచి సపోర్ట్ దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యకరం…
Ads
రైతుల పేరిట ఆందోళన, అదీ బీజేపీని బదనాం చేసే నిరసన… దీక్ష చేసేది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి… తనకు మద్దతు పలికితే బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది కదా అని కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఆలోచించలేదు… ఆరోజే అర్థమైంది… కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ కథ ఒడిశిందని…
త్వరలో బీజేపీయేతర సీఎంల భేటీ పెడతాను అన్నాడు కదా ఆమధ్య కేసీయార్… నిన్న శివసేన స్టీ‘రింగ్ లీడర్’ సంజయ్ రౌత్ తామే అలాంటి భేటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు… మరోవైపు కాంగ్రెస్ కూటమికి చెందిన 13 పార్టీలు దేశంలో పెరుగుతున్న మతోన్మాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ బహిరంగ లేఖ జారీ చేస్తే అందులో కేసీయార్‌కు చోటు ఇవ్వలేదు… సో, కాంగ్రెస్‌ను ఇగ్నోర్ చేసి, బీజేపీ మీద పోరాటం చేయడం అనేది అసాధ్యం…
కాంగ్రెస్ దెబ్బతిన్నమాట నిజమే… కానీ ఈరోజుకు బీజేపీకి కొంతైనా పోటీ ఇవ్వగల జాతీయ పార్టీ అదొక్కటే… ఓ బలమైన కూటమి కట్టగలదు… ఎటొచ్చీ దానికి నాయకత్వలోపమే ప్రధాన సమస్య… దాన్ని అధిగమించడమే దాని పరీక్ష… మొన్నమొన్నటిదాకా కేసీయార్‌లాగే కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమిని బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్ కూడా వెళ్లి కాంగ్రెస్ క్యాంపులో పడిపోయాడు…
నిజమే… 2024 సాధారణ ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి… (డిసెంబరు, జనవరి వరకు)… అన్నిచోట్లా కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి… కీలక రాష్ట్రాలే… గుజరాత్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తీసిపారేయడానికి లేదు… మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరం చిన్న రాష్ట్రాలు కాబట్టి పెద్ద ఫరక్ పడదు… ఒకవేళ ఆ ఆరు రాష్ట్రాల్లో గనుక బీజేపీ దెబ్బతిని, కాంగ్రెస్ పుంజుకుంటే అది రాబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేస్తుంది… కూటముల మీద కూడా స్పష్టత వస్తుంది… ఏతావాతా తేలేదేమిటయ్యా అంటే కేసీయర్ ఎదుట ప్రస్తుతానికి బ్లాంక్ పిక్చర్ మాత్రమే ఉంది…!!
Share this Article