కొన్ని యాదృచ్ఛికాలు అని తేలికగా కొట్టిపారేయలేం… అవి అద్భుతాలు… అంతే… చూడాలి, వినాలి, చదవాలి… అబ్బురపడాలి… అంతకుమించి వివరణలు, విశ్లేషణలు, కారణాలు దండుగ… ఏదీ, ఎవరూ తేల్చలేరు… ఇదీ అంతే… కేదారనాథ్… సగటు హిందువు ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే చార్ ధామ్ యాత్రలో ఈ ఆలయం కూడా ఒకటి… పాండవులు కట్టారా..? ఆదిశంకరాచార్యుడు కట్టించాడా..? అంత పాతదా..? జియాలజిస్టులు చెప్పినట్టు ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం మందిరమా..?
400 ఏళ్లు మంచులోనే కప్పబడి ఉందా..? ఆ చర్చలోకి కూడా ఇప్పుడు పోవడం లేదు మనం… ఓ ప్రవాహం మధ్యలో, వచ్చీపోయే వరదల్లో ఇంతకాలం అంత దృఢంగా ఎలా నిలిచి ఉంది..? ఏ మహత్తు దాన్ని అలా బలంగా నిలబెడుతోంది..? అసలు అదికాదు, 2013 నాటి వరదల గురించి చెప్పుకోవాలి… మందాకిని ప్రవాహ ఉధృతికి కేదారనాథుడు గల్లంతే అని జనం గగ్గోలు పెడుతున్నవేళ జరిగిన ఆ అద్భుతం ఏమిటంటే..?
Ads
పైన ఫోటో ఓసారి పరిశీలించండి… ఇది కేదారనాథ్ గుడి వెనుక ఉంటుంది… దీన్ని భీమశిల అంటారు… ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో ఈ శిలకు కూడా పుష్పాలంకరణ చేస్తుంటారు… నిజానికి ఇది మొదట్లో లేదు… అదే ఈ కథ… 2013 జూన్‌లో ఒక్కసారి వరదలు… ఎంత ఉధృతి అంటే… భారీ కొండ చరియలు విరిగిపడుతూ విధ్వంసాన్ని సృష్టించింది… అధికారిక లెక్కల ప్రకారమే 197 మంది మరణించారు, 236 మంది గాయపడ్డారు…
4021 మంది మిస్సింగ్… ఏమయ్యారో తెలియదు… నిజానికి ఈ సంఖ్యలు చాలా ఎక్కువ అంటారు… 2119 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి… 3001 ఇళ్లు ధ్వంసమయ్యాయి…. 11,759 ఇళ్లకు పాక్షిక ధ్వంసం… పెద్ద పెద్ద కట్టడాలే అట్టబొమ్మల్లా కుప్పకూలిపోయాయి… ఆ సమయంలో గుళ్లో దాదాపు మూడు నాలుగు వందల మంది చిక్కుకుపోయారు… కొందరు సాధువులు గుడి బయట ఓ ఎత్తయిన ప్రదేశం మీదకు ఎక్కి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఇవి తమ చివరి క్షణాలు అనుకుంటూ దేవుడిని ధ్యానించడం మొదలుపెట్టారు… పై నుంచి వస్తున్న వరద ఉధృతి అది… గుడి పరిస్థితేమిటి..?
ప్రవాహ వేగం ప్రమాదకరంగా మారిన పీక్ స్టేజ్‌లో కొండలా ఉన్న ఓ పెద్ద రాయి ఎగువ నుంచి కొట్టుకొచ్చింది… ఇక అది తాకితే గుడి పని అయిపోయినట్టే అని సాధువులు భయపడుతూనే ఉన్నారు… ఆ రాయి వచ్చీ వచ్చీ సరిగ్గా గుడి వెనక్కి కొన్ని అడుగుల దూరానికి వచ్చి ఆగిపోయింది… ఇప్పుడు అదొక ఏకరాతి రక్షణ దుర్గం… ఆ రాయి ప్రవాహాన్ని రెండు భాగాలు చేసింది… గుడికి ఇరువైపులా నీళ్లు వెళ్లిపోయాయి… వేగం తగ్గిపోయింది… ఫలితంగా గుడికి ఏ నష్టమూ జరగలేదు…
బయట ప్రహారీకి అక్కడక్కడా కొన్ని పగుళ్లు తప్ప గుడి సేఫ్… గుళ్లో భక్తులూ సేఫ్… దాన్నే భీమశిల అంటూ కేదారనాథ్ వెళ్లే భక్తులు మొక్కుతుంటారు… విలయంలో సైతం ప్రకృతే ఆ గుడిని ఓ రాయిని అడ్డుపెట్టి కాపాడుకోవడం యాదృచ్ఛికం అందామా..? ఆ దైవసంకల్పం అందామా..? మీ ఇష్టం… కానీ ఆరోజు అదొక అద్భుతం… మరి అసలైన కారణం ఏమిటి..? ఈ అనంతానంత విశ్వంలో మనమెంత..? అంతుచిక్కని అనంత విజ్ఞానంలో మన బుర్రలకు తెలిసిందెంత..?!
Share this Article