చెప్పు సారూ, చెప్పు… కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పావు… ఫేట్, డెస్టినీ, టైం అన్నావు… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పావు… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్ అని చెప్పావు… యశ్ బాడీగార్డును ఓ మెయిన్ విలన్‌గా మార్చిన తీరు కూడా చెప్పావు… సరే, కానీ కేజీఎఫ్ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం సినిమాటోగ్రఫీ కదా…
మ్యూజిషియన్, విలన్, హీరో, డైరెక్టర్, ఎడిటర్లకు భిన్నమైన కథలున్నాయని అంటున్నావు కదా… సినిమాటోగ్రాఫర్‌కూ అలాంటి కథేమీ లేదా…? అని ఆస్కాడు ఓ మిత్రుడు కాస్త వ్యంగ్యాన్ని దట్టించి…! నిజమే కదా… కేజీఎఫ్ సీన్ల ఎలివేషన్‌కు ప్రాణం సినిమాటోగ్రాఫరే… డౌట్ లేదు… ఏమైనా చెప్పదగిన కథ ఉంటే తప్పకుండా రాయాల్సిందే అనుకుని కాస్త చెక్ చేస్తే… కొంత ఆసక్తికరమైన కంటెంటు ఉంది నిజంగానే… ఈ సినిమాటోగ్రాఫర్ పేరు భువన్ గౌడ…
ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం… దాంతోనే కదా తను పికపయ్యాడు, నిలబడ్డాడు… ఆరు కోట్ల వరకూ ఖర్చయిన ఆ సినిమాకు తొలుత వేరే సినిమాటోగ్రాఫర్ ఉండేవాడు… ఇందులో హీరో శ్రీమురళి, నిర్మాత కూడా తనే… ప్రశాంత్ నీల్‌కు చుట్టం తను… టెక్నికల్ టీం మీద ఫుల్ స్వేచ్ఛ ప్రశాంత్‌కు… మధ్యలోనే ప్రశాంత్ అంచనాల్ని అందుకోలేక ఆ సినిమాటోగ్రాఫర్ వదిలేశాడు… దాంతో ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవివర్మన్‌ను అడిగాడు…
Ads
ఫుల్ టైమ్ చేయలేను అన్నాడు తను… సరే, గెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండు, గైడ్ చేయి అన్నాడు ప్రశాంత్… అనుకోకుండా ఆ సినిమాకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా కెమెరాతో కుస్తీపడుతున్న భువన్ గౌడ కనిపించాడు… నిశితంగా పరిశీలించాడు… తను తీసిన ఫొటోల్లో లైటింగ్, షేడ్స్ భిన్నంగా తనకు అక్కరకొచ్చేలా ఉన్నాయనిపించింది… దగ్గరకు పిలిచాడు…
‘‘నువ్వు గతంలో ఏం చేసేవాడివి..?’’ అడిగాడు…
ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాలేదు… కొంపదీసి తన ఫోటోలు నచ్చలేదేమో అనుకున్నాడు…
‘‘సర్, వాచ్ రిపేరింగ్ షాపులో పనిచేసేవాడిని’’… బదులిచ్చాడు తను…
‘‘మరి ఇందులోకి ఎలా వచ్చావు..?’’
‘‘నా ఫ్రెండ్ ఒకతనికి ఫోటోలంటే పిచ్చి, నాకు సొంతంగా కెమెరా లేదు… వాడి కెమెరాతో ఆడీ ఆడీ, వాడితో తిరిగీ తిరిగీ అంటుకుంది సర్…’’
‘‘ఈ లైటింగ్, షేడ్స్ ఎలా ఒంటబట్టాయి..?’’
‘‘సర్, మీకు నచ్చలేదా..? మీరు చెప్పండి సార్, మారుద్దాం…’’ అన్నాడు బెరుకుబెరుకుగా…
‘‘అస్సలు మార్చొద్దు… ఇలాగే ఉండు… నువ్వే ఈ సినిమాకు ఫుల్ టైమ్ సినిమాటోగ్రాఫర్ (DoP)… రవివర్మన్ గైడ్ చేస్తాడు’’ అన్నాడు… భువన్ షాక్… తను డీఓపీ ఏమిటి..? తనకేమీ తెలియదు… ఎక్కడా పనిచేసిన అనుభవం లేదు… పైగా రవివర్మన్‌తో కలిసి పనిచేయడం… అర్థం కావడం లేదు, అంతుపట్టడం లేదు… ప్రశాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు… ప్రశాంత్ కూల్‌గా ‘‘నాకు వదిలెయ్, నీ పని నువ్వు చెయ్’’ అన్నట్టుగా లుక్కు ఇచ్చి, భుజం తట్టాడు… ఇది 2014లో సంగతి…
ఆ తరువాత రెండు సినిమాలేవో చేశాడు… తన కెరీర్ మొత్తం చేసింది ఐదే సినిమాలు… అందులో మూడు ప్రశాంత్ నీల్ సినిమాలే… (ఉగ్రమ్, కేజీఎఫ్-1, కేజీఎఫ్-2) ప్రత్యేకించి కేజీఎఫ్-2లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది… కొన్ని సీన్లు హాలీవుడ్ చిత్రీకరణతో పోటీపడ్డాయి… ఇప్పుడు అదే ప్రశాంత్‌తో సలార్‌కు వర్క్ చేస్తున్నాడు తను…
‘‘పొద్దున్నే డైరెక్టర్‌తో కలిసి షూటింగ్ స్పాట్ చేరుకోవాలి… ఔట్ డోర్ గానీ, సెట్ గానీ… ఒంటి గంట వరకే షూటింగ్… తరువాత నాలుగు నుంచి… తనకేం కావాలో ప్రశాంత్ వివరంగా చెబుతాడు… కొన్నిసార్లు కంటిసైగతో సూచనలు చేస్తాడు… సీన్ సరిగ్గా వచ్చిందా లేదా జస్ట్, అలా కళ్లతో కమ్యూనికేట్ చేస్తాడు… తనతో పనిచేయడం భలే ఉంటుంది… నాకు ఈ ప్రొఫెషన్‌లో ట్రెయినింగ్ ఏమీలేదు… ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలోనే అన్నీ నేర్చుకున్నాను… నేచురల్ లైటింగ్, షేడ్స్ అద్భుతమైన ఔట్‌పుట్ ఇస్తాయి… ఆర్టిఫిషియల్ లైటింగ్‌తో ప్రయోజనం కొద్దిగానే… ’’ అని చెప్పుకొచ్చాడు ఏదో ఇంటర్వ్యూలో..!!
Share this Article