ఆర్ఆర్ఆర్ సినిమా ముందుగా విడుదలై బతికిపోయింది… లేకపోతే కేజీఎఫ్-2 ముందు వెలవెలబోయేదేమో…! కేజీఎఫ్ మీద నెలకొన్న హైప్, దాని ముందస్తు వసూళ్లు సినిమా పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్నయ్… లక్షల అడ్వాన్స్ బుకింగులతో కేజీఎఫ్ గల్లాపెట్టె గలగలమంటోంది… కేజీఎఫ్ ఓ సంచలనాన్ని సృష్టించింది అప్పట్లో… అసలు సౌతిండియా ఇండస్ట్రీలో బాగా వెనుకబడినట్టుగా ఇన్నేళ్లూ కనిపించిన శాండల్‌వుడ్ చరిత్రను యశ్ తిరగరాస్తున్నాడు… అది మాత్రం నిజం… ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో విడుదల అంటే మాటలా..?
మరీ రాజమౌళిలా 400 కోట్లు, 500 కోట్ల అసాధారణ లెక్కల్ని ఏమీ ఏకరువు పెట్టడం లేదు ఈ నిర్మాతలు… 100 కోట్ల బడ్జెట్ అంటున్నారు… ఆ బడ్జెట్‌తో ఈ రేంజ్ సినిమా తీయడం విశేషమే… అయితే, ఇప్పటి హైప్ మేరకు చూసుకుంటే రెండుమూడు రోజుల్లో డబ్బులు తిరిగి వచ్చేయడం గ్యారంటీ… వెరీ సేఫ్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ ప్రాజెక్ట్….
సినిమా గురించి కాసేపు పక్కనపెడితే… ఏం తక్కువ..? ఎవరికి తక్కువ..? కేజీఎఫ్-2లో కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ గుర్తుకొస్తుంది… సినిమాటోగ్రఫీ, బీజీఎం అదరగొట్టేశారు… ఆ సెట్టింగులు, ఆ లొకేషన్లు, కొన్ని సీన్ల చిత్రీకరణ చూస్తే బాలీవుడ్ కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిందే… ఇది మనం ఎరిగిన కన్నడ సినిమాయేనా..? తారాగణం కూడా ప్యూర్ లోకలేమీ కాదు… రవీనా టాండన్, సంజయ్ దత్ హిందీ మార్కెట్ కోసం అనుకోనక్కర్లేదు… తమ పాత్రల్లో ఒదిగిపోయారు…
Ads
రావు రమేష్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరిరావు తదితరులు వోకే అంటే వోకే… హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కాస్త ప్రాధాన్యం దక్కింది… యశ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? ఈ జోరు ఇలాగే కొనసాగిస్తే పాన్ ఇండియా స్టార్‌గా స్థిరపడిపోతాడు… తనే కాదు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి తాత అవుతాడు… ఆ స్టామినా ఉంది వాళ్ల దగ్గర… ఎటొచ్చీ దాన్ని కాపాడుకోవాలి… బాహుబలితో పోలిస్తే బాహుబలి-2 లో నవ్వొచ్చే సన్నివేశాలు బోలెడు… కానీ ఓ మాయ మనల్ని కమ్మేసి, నిర్మాతలకు 1000 కోట్లు ముద్రించి ఇచ్చేసింది…
ఆర్ఆర్ఆర్‌లో కూడా నవ్వొచ్చే సీన్లు బోలెడు… అయితేనేం..? ఓ మాయ కమ్మేసినప్పుడు అవేమీ కనిపించవు… సేమ్, కేజీఎఫ్-2 … కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే పలుచోట్ల గందరగోళం, తద్వారా చికాకు… కానీ స్థూలంగా చూస్తే కేజీఎఫ్ సీక్వెల్‌ను సాఫీగానే లాంచ్ చేసినట్టు లెక్క… ఇంత భారీ హైప్ నడుమ సినిమాను కూల్‌గా, సక్సెస్ ఫుల్‌గా తీసుకురావడం విశేషమే…
బీస్ట్ సినిమాలో హీరో అలా కరాచీ వెళ్లిపోయి, ఇలా నొటోరియస్ టెర్రరిస్టును పట్టుకురాలేదా..? ఆర్ఆర్ఆర్‌లో రాంచరణ్ ఓ లాఠీతో వేల మందిని కంట్రోల్ చేయలేదా..? జూనియర్ బోలెడన్ని వన్యమృగాల్ని ఢిల్లీ వీథుల్లో కదం తొక్కించలేదా..? అలా మతిభ్రమింపజేసే సీన్లు ఉంటేనే సౌతిండియన్ మూవీ అనబడుతుంది… కేజీఎఫ్‌లో కూడా అంతే… ప్రధానికి సవాల్ విసరొచ్చు… పార్లమెంటుకు వెళ్లి ఓ ఎంపీని కాల్చేయవచ్చు… మరీ తెలుగు టీవీ సీరియల్ పాత్రలాగే, కథముగిసిందీ అనుకున్న అధీరా ఏళ్ల తరువాత కళ్లముందుకొస్తాడు…
ఫస్ట్ పార్టుతో పోలిస్తే ఇందులో లవ్ ట్రాక్… మరింత ఎలివేషన్… కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ జస్ట్ సూపర్ హీరోయిజం… కానీ సెకండ్ పార్ట్‌లో సూపర్ డూపర్ సుప్రీం మెగా పవర్ డైనమిక్ ఎక్సట్రా సూపర్ నేచురల్ హీరోయిజం… లక్షల మంది ప్రైవేటు సైన్యం, హెలికాప్టర్లు, వందల వాహనాలు, ఎడాపెడా బంగారు నిక్షేపాల తవ్వకం కథ వరకూ వోకే… కానీ ఏ రాజ్యమూ దాన్ని సహించదు… ఉక్కుపాదంతో కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుంది… చిన్నాభిన్నం చేస్తుంది… అంతటి గాలి జనార్ధనరెడ్డిని ఆగమాగం చేయలేదా..? అఫ్‌కోర్స్, మన సినిమా హీరోలు అంటేనే వాళ్లు లాజిక్కులకు అతీతులు కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు…
ప్రేక్షకులకు కూడా లాజిక్కులు పెద్దగా పట్టవు… మరీ హీరోల సూపర్ మ్యానిజం కూడా వాళ్లు ఇష్టపడగలరు… కథనంలో గందరగోళాన్ని కూడా క్షమించేయగలరు… సినిమా చివరి వరకూ థ్రిల్ ఫుల్‌గా దర్శకుడు మనల్ని కూర్చోబెట్టాడా లేదా… అంతే… నిజానికి ఈ కన్నడ దర్శకుడు విస్మరించిన మాటొకటి ఉంది… పుష్ప బంపర్ హిట్‌కు కారణం పాటలు… కేజీఎఫ్-2 కూడా కాస్త దానిపై దృష్టి పెట్టి ఉంటే కథ ఇంకా హైరేంజులో ఉండేది… ఒక్కటి మాత్రం నిజం… కన్నడ సినిమా గతంలోలాగా లేదు..!!
అన్నట్టు… ఈ దర్శకుడు ప్రశాంతే ప్రభాస్‌తో సాలార్ తీస్తున్నాడు… తనూ పాన్ ఇండియా హీరో… రాధేశ్యామ్‌తో చెడగొట్టుకున్నాడు గానీ తనవీ సూపర్ డైనమిక్ హీరోయిజం పాత్రలే… ఇక ప్రశాంత్ నీల్ సరేసరి… కేజీఎఫ్ బంగారు గనులయితే, సాలార్ బొగ్గు గనులు… వచ్చెయ్ వచ్చెయ్…!!
Share this Article