శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా 1974 లో వచ్చిన ఈ ఖైదీ బాబాయ్ సినిమా . ఆ తర్వాత మెచ్చుకోవలసింది జానకి , జగ్గయ్యలే . హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో స్క్రీన్ ప్లే బిర్రుగా చేసుకుని ఉంటారు .
సినిమాలో ఏ సీనునూ , డైలాగుని కట్ చేయాలని అనిపించదు . బొల్లిముంత శివరామకృష్ణ డైలాగులు వ్రాసారు . దర్శకుడు టి కృష్ణ . ఇండస్ట్రీలో ఇద్దరు టి కృష్ణలు ఉన్నారు . ఒకరు ఈ టి కృష్ణ . వరంగల్ కు సంబంధించిన వారు . మరొక టి కృష్ణ ప్రకాశం జిల్లా వారు .
కృష్ణ , బాలయ్యలు నటించిన నేరము శిక్ష సినిమా లాంటిదే ఇది కూడా . ఖైదీ బాబాయ్ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది . వాణిశ్రీ , గుమ్మడి , నిర్మలమ్మ , సుమ , రమాప్రభ , సత్యనారాయణ , నాగయ్య , సాక్షి రంగారావు , అల్లు రామలింగయ్య , పద్మనాభం , రామకృష్ణ , చంద్రమోహన్ , కె వి చలం , ముక్కామల ప్రభృతులు నటించారు .
Ads
సినిమా టైటిల్సులో నేరెళ్ళ వేణుమాధవ్ పేరు వేసారు . సినిమాలో ఏ పాత్రలో నటించారో నాకు తెలియలేదు . ఆయన మొత్తం మూడు సినిమాలలో కనిపించారు . గూఢచారి 116 , దేవుని గెలిచిన మానవుడు , ఖైదీ బాబాయ్ . (17 సినిమాల్లో నటించినట్టు వేణుమాధవ్ కొడుకు నేరెళ్ల శ్రీనాథ్ చెప్పారు)
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ఎక్కడి వాడో గాని చక్కనివాడే , ఓరబ్బీ చెపుతాను ఓలమ్మీ చెపుతాను , బైస్కోప్ పిల్లొచ్చింది , ఒట్టంటే మాటలు కాదు చిలకమ్మా పాటలు హిట్టయ్యాయి .
తమిళంలోకి నీతి అనే టైటిల్ తో రీమేక్ అయింది . శివాజీ , జయలలిత , జానకి నటించారు . కన్నడంలోకి హోస తీర్పు అనే టైటిల్ తో రీమేక్ అయింది . అంబరీష్ నటించారు .
మంచి సందేశాత్మక , సంస్కరణాత్మక మాస్ సినిమా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడతగ్గ చిత్రం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )
టి.కృష్ణ అనగానే చాలామంది గందరగోళానికి గురవుతారు… ఈ టి కృష్ణ గురించి సంక్షిప్తంగా… టి.కృష్ణ అసలు పేరు టి.కృష్ణమాచారి. మేనమామ హయగ్రీవాచారి. మొదట్లో గోల్కొండ పత్రికలో సినిమా సమీక్షలు రాయడం… హైదరాబాద్ ఆలిండియా రేడియోలో తెలంగాణ యాసలో గ్రామీణ వార్తలు… ఇందుకోసం లింగడు అనే క్యారెక్టర్‌ను సృష్టించారు… సినిమా నటుడు, గాయకుడవ్వాలనే కోరిక…
కొన్నాళ్లు ఎడిటింగ్ శాఖలో కూడా పనిచేశాడు… బోలెడు తెలుగు, హిందీ సినిమాలకు ఎడిటర్ ఆయన… ప్రేమలేఖలు సినిమాలో ప్రాణ్‌కు తెలుగులో గాత్రధారణ చేసింది కృష్ణనే! ఇలా పొట్ట గడవడం కోసం అన్ని రకాల పనులు చేశారాయన… ఉపాయంలో అపాయం అన్న సినిమాతో దర్శకుడయ్యారు కృష్ణ. ఆ సినిమాను 21 రోజుల్లోనే పూర్తి చేశారు కృష్ణ.
ఖైదీ బాబాయ్ సూపర్ హిట్… తరువాత మంచిబాబాయ్, మొనగాడు, లక్ష్మీ నిలయం, అందరికంటే మొనగాడు, బలిపీఠంలో భారతనారి, అమ్మో పోలీసోళ్లు అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు… నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా ఇలా అన్ని శాఖల్లోనూ రాణించిన టి.కృష్ణ 2001 మే 9న హైదరాబాదులో కన్ను మూశాడు…
Share this Article