సపోజ్, పర్ సపోజ్… సరదాగా… ఓ చిన్న ఊహ… చిరంజీవి ఈ వయస్సులోనూ యంగ్ స్టెప్పులేసిన అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ పాట గురించి ప్రస్తావిస్తూ… హబ్బ, మీరూ, మీ పక్కన మీ మనమరాలు కాజల్ భలే ఉన్నారండీ అని ఎవరైనా సినిమా విమర్శకుడు రాస్తే…! ఎఫ్2 సినిమాలో వెంకటేష్, తమన్నాల విషయంలో గానీ… మన్మథుడు2 సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడిపై గానీ… పైసా వసూల్ సినిమాలో బాలయ్య, ముస్కాన్‌పై గానీ… పోనీ, మరేదో సినిమాలో రాజశేఖర్, హీరోయిన్‌పై గానీ ఇవే కామెంట్లతో రివ్యూలు రాస్తే ఎలా ఉంటుంది..? అభిమానులు పెద్ద ఎత్తున తిట్టిపోస్తారు, బెదిరిస్తారు ఎట్సెట్రా… తమ దేవుళ్లపై ఈగ కూడా వాలనివ్వరు… ఆ హీరోలు పట్టించుకోరు, కానీ ప్రఖ్యాత బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ అలా కాదు… తనే స్వయంగా రియాక్టవుతాడు… మొన్న రాధే అనే సినిమా వచ్చింది కదా.., సల్మాన్‌ఖాన్ నటించాడు… అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్… అందులో దిశాపటాని… సల్మాన్, దిశను చూసేకొద్దీ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ఉన్నాడు కదా, తనకు చిరాకేసినట్టుంది…
‘‘సల్లూ తాతా భలే ఉన్నాడు, తన మనమరాలు దిశాపటానీతో ఉన్న సీన్లు భలే ఉన్నయ్… కొన్నిచోట్ల గ్రాఫిక్స్ టీం వాళ్లు కూడా సల్మాన్ పాతికేళ్ల వయస్సప్పటి ఫోటోల్ని వాడి, భలే కవర్ చేశారు…’’ అంటూ వెక్కిరించేశాడు తన వీడియో రివ్యూలో… ‘‘నీ డబుల్స్ (డూప్స్) కూడా భలే కష్టపడ్డారు యాక్షన్ సీన్లలో… ఆ కథ, స్క్రీన్ ప్లే ఓ టార్చర్, ప్రతి సీన్లోనూ సల్మాన్ తాత ఒకేరకం ఫీలింగ్ పెట్టేశాడు మొహంలో… విలన్లు అయితే ఒకటే పరుగు.., చంపాలి, ఉరకాలి, అదే పని… రణదీప్ హుడా మంచి విలన్, సమస్య ఏమిటంటే తను హీరో అనుకుంటాడు, ఫైట్లు చేస్తాడు, అవి రిక్షావాళ్లకు, వీథిబళ్ల వాళ్లకు భలే నచ్చేస్తాయి… నిజానికి ఈ కరోనా సమయంలో మాస్కు లేకుండా జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు వెళ్లడం ఎంత రిస్కో, ఈ సినిమా చూడటం కూడా అంతే రిస్క్… ఒకటి రేటింగ్ ఇస్తున్నాను దీనిక…’’ ఇలా సాగిపోయింది తన రివ్యూ…
Ads
నిజాలే కావచ్చుగాక, కానీ నిజంగానే ఇలా రివ్యూ చదివితే ఎక్కడో కాలుతుంది కదా… సల్మాన్ ఖాన్ కూడా మనిషే కదా… తనకూ కాలింది… దొరికితే పట్టుకుని ఖైమా కొట్టేసేవాడేమో, కానీ దొరకనట్టుంది… తన లాయర్ల టీంను పిలిచి వాడి సంగతేమిటో చూడండి కాస్త అన్నాడు… వాళ్లు అర్జెంటుగా కమాల్ఖాన్కు ఓ పరువునష్టం దావాా నోటీసు జారీ చేశారు… అంతేకాదు, వెంటనే ఈ కేసు విచారించేయాలంటూ సివిల్స్ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు పెట్టారట… నోటీసు అందుకున్నాక మొదట్లో… బింకంగా… ‘‘నువ్వు ఎంత హతాశుడవయ్యావో, ఎంత నిరాశకు గురయ్యావో నీ లాయర్ నోటీసే చెబుతోంది… నన్ను ఆపడం కాదు, నా రివ్యూల్ని ఆపడం కాదు, మంచి సినిమాలు తీయవయ్యా, నేనయితే సత్యం కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని ట్వీటాడు… కానీ సల్మాన్ లాయర్ల పరుగులు చూశాక, ఇదేదో భారీ తేడా కొట్టేస్తున్నట్టుంది అనుకుని… ‘‘అబ్బే, నా రివ్యూలు ఫర్ ఫన్ ఓన్లీ… నీకు నచ్చకపోతే పోనీ, ఇక నీ సినిమాలపై రివ్యూ వీడియోలు చేయను, సరేనా..?’’ అని మరో ట్వీట్ కొట్టాడు, ఐనా ఫలితం రాలేదు… దాంతో సల్మాన్ తండ్రికి ఓ ట్వీట్ చేశాడు… ‘‘సలీం సాహెబ్, ఇకపై ఆయన సినిమాలపై రివ్యూలు పెట్టను, హర్టయితే సారీ, ఆ కేసు వాపస్ తీసుకొమ్మని చెప్పు’’ అని వేడుకున్నాడు… అదండీ… ఒక సినిమా రివ్యూ, ఆ తరువాత కష్టాల కథ… బయటివాళ్లు తిట్టేస్తే వోకేనేమో గానీ, ఇండస్ట్రీలో పార్ట్ అని చెప్పుకునేవాళ్లు తిడితే ఊరుకుంటారా ఎవరైనా… ఇదీ అంతే……. ఎందుకో గానీ, తెలుగులో ఏదైనా వృద్ధ హీరో సినిమాపై ఇలాంటి ఖతర్నాక్ రివ్యూ ఎవరైనా సాహసులు రాస్తే చదవాలని ఉంది..!! ఆశ, దోశ, అప్పడం, వడ అంటారా… అవును, రాసినవాడి ఒల్లు అప్పడమే…!!
Share this Article