నిజానికి 54 ఏళ్లు అనేది పెద్ద వయస్సు ఏమీ కాదు… డెబ్భయి దాటిన హీరోలే నడుముకు బద్దలు కట్టుకుని, వంగిపోకుండా, హీరోయిన్ల పిరుదులపై దరువులేస్తూ గెంతులేయడానికి ఆయాసపడుతున్నారు… పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రౌడీలను వందలుగా, మందలుగా నరికిపారేస్తున్నారు… ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు… వందల కోట్లను తెరపైకి వెదజల్లుతూనే ఉన్నారు… హుమ్… ఒకప్పుడు ఎన్టీయార్, ఏఎన్నార్, శోభన్, కృష్ణ, కృష్ణంరాజు తదితరులు ముసలోళ్లయినా ఇంకా ఈ యూత్ వేషాలేమిటీ అని చీదరగా చిరంజీవి వైపు, రాజశేఖర్ వైపు, సుమన్ వైపు చూశాం… ఇప్పుడూ అదే జరుగుతోంది…
విషయం ఏమిటంటే..? రవితేజ… ఒకప్పుడు చిన్నాచితకా ఎక్సట్రా పాత్రలేసి, క్రమేపీ హీరోగా ఎదిగి, తనదైన మేనరిజంతో, డైలాగ్ డిక్షన్‌తో దూసుకుపోయాడు… అలాగని ఇక ఎప్పుడూ అదే ప్రేక్షకుడు నచ్చుతాడని భ్రమపడటం ఫాఫం, రవితేజ దురదృష్టం… తన రొటీన్ ఫార్ములా చట్రం నుంచి బయటపడలేకపోతున్నాడు… భయ్యా రవితేజా… నీ ప్రపంచం నుంచి బయటికి రా… సినిమా కంటెంట్, ప్రేక్షకుల టేస్ట్ వేగంగా మారిపోతున్నయ్…
ఇంకా ఇప్పటికీ అవే ఫైట్లు, అదే మేనరిజం, మొహంలోకి ముసలితనం ప్రవేశిస్తున్నా అవే కుర్రవేషాలు, ఇద్దరు హీరోయిన్లు, పాటలు, అవే సోకాల్డ్ రవితేజ మార్క్ డైలాగులు, డిక్షన్…. వెనక్కి వెనక్కి వెళ్దాం… క్రాక్, డిస్కోరాజా, నేలటికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్, బెంగాల్ టైగర్, కిక్-2……. ఎన్నేళ్లయింది రవితేజ నుంచి చప్పట్లు కొట్టే నటనను చూసి..? మంచి ప్రతిభ గల నటుడిని సినిమా కమర్షియలిజం తొక్కిపారేసింది…
Ads
ఇప్పుడూ అంతే… ఖిలాడీ అనే సినిమా చూస్తే మళ్లీ జాలేసింది… ఆ పాత్ర ఏమిటో, ఆ సినిమా ఏమిటో… నిజానికి ఈ సినిమాకు రివ్యూ అక్కర్లేదు… ఉన్నంతలో కాస్త అర్జున్ బెటర్… ఇక మిగతాదంతా సోది, సుత్తి… పక్కా రొటీన్ రవితేజ ఫార్ములా… బహుశా ఇక రవితేజ మారడు… ఇతర భాషల్లో హీరోలు చేస్తున్న ప్రయోగాలు తనకు కనిపించవు… 2009లో చివరగా కిక్ వోకే… ఆ తరువాత ఇక ఎవరో ఓ నిర్మాత దొరికితే చాలు, తోచిన కథను ప్రేక్షకుల మెదళ్ల మీదకు వదిలేయడం, ఎలాగూ ఓటీటీలు, టీవీల హక్కులతో డబ్బులు బాగానే వస్తున్నాయి కదా… ఇక మారడు…
మీనాక్షి చౌదరి అయితేనేం, డింపుల్ హయతి అయితేనేం… అందాల ప్రదర్శన, బుర్రల్లేని పాత్రలు… తెలుగు టీవీల్లో కొన్ని సీరియళ్లు వస్తుంటయ్… కథలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఫాఫం, కొన్నిసార్లు ఆ దర్శకుడికి కూడా తెలియదు… ఇదీ అంతే… లాజిక్కులు అక్కర్లేదు, జనం నవ్వుకుంటారనే సోయీ ఉండదు… ఖిలాడీ కూడా అంతే… కామెడీ నవ్వించదు, పాటలు ఆకట్టుకోవు, ఆ ట్విస్టులు కనెక్ట్ కావు, అన్నింటికీ మించి అదే రొటీన్ రవితేజ మార్క్ హీరోయిజం, సగటు నాసిరకం తెలుగు సినిమా పోకడలు…
రవితేజ ఇకనైనా మారకపోతే… ఫాఫం, ఎవరూ ఏం చేయలేరు… జనమే మరిచిపోతారు… ఈ సినిమా ఓ ప్రమాదహెచ్చరిక..!! ష్… ఈ సారుగారి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నయ్, ప్రేక్షకులకు ఉందిలే ఇక… రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు… ఇక రవితేజ బోటు మునిగేదీ తేలేదీ అవే తేల్చేస్తాయన్నమాట… అన్నట్టు ఈ సినిమాలో అనసూయ, వెన్నెల కిషోర్, తదితరులూ కలరు… కలరంటే కలరు… అంతే…
Share this Article