Subramanyam Dogiparthi ……… పేరు కోటిగాడు, ఊరు తెనాలి అంటూ ఎంట్రీ ఇచ్చిన కృష్ణ ఫుల్ జోష్ తో అభిమానులను ఖుషీ చేసిన కోదండరామిరెడ్డి మార్క్ సినిమా ఈ కిరాయి కోటిగాడు .
మార్చి 17, 1983న రిలీజయి హిట్టయిన కృష్ణ- శ్రీదేవి సినిమా . కృష్ణ మాస్ ఇమేజి , శ్రీదేవి గ్లామర్ , సత్యమూర్తి కధ , సత్యానంద్ డైలాగ్స్ , కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే దర్శకత్వం , చక్రవర్తి సంగీతం , వేటూరి వారి పాటలు , బాలసుబ్రమణ్యం సుశీలమ్మ యస్ జానకిల గాత్రం , రావు గోపాలరావు అల్లు రామలింగయ్య సుత్తి వేలు కాంబినేషన్ సినిమాను అయిదు కేంద్రాలలో వంద రోజులు అడించాయి . ఆ అయిదింట్లో మా గుంటూరు కూడా ఉంది .
ఎవరి ఐడియా ఏమో కానీ ఈ సినిమాలో ఓ వినూత్న ఎబ్బెట్టు ప్రయోగం ఉంది . ఆ ఊరి కీచకుడు విలనాసురుడు అయిన రావు గోపాలరావు ఊళ్ళో ఏ స్త్రీని అయినా ఇష్టపడితే మంచం పరుపు పంపిస్తాడు . సుత్తి వేలు చీకట్లో ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళి పక్క సరిచేస్తాడు . కొద్దిగా జుగుప్సాకరంగా ఉన్నా అవుడియా వినూత్నమే .
Ads
సినిమా మధ్యలో ఖైదీ బాబాయ్ ఛాయలు కనిపిస్తాయి . హీరో కిరాయి రౌడీ . పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది . ఎవడు డబ్బులిస్తే వాడు చెప్పినోడిని ఏసేస్తా అని . ఆ డైలాగ్ వాళ్ళ నాన్నదే . ఈ సినిమాలో ఉంటుంది .
ఓ చిన్న గ్రామంలో ఇద్దరు విలనాసురులు జాయింటుగా ఊరి ప్రజల మీద దాష్టీకం చేస్తూ ఉంటారు . మిలిటరీ నుండి తిరిగొచ్చిన ఆ ఊరి రాంబాబు వీళ్ళ దాష్టీకాలను ప్రతిఘటిస్తాడు . అతన్ని ఎదుర్కుంటానికి పట్నం నుండి హీరో కోటిగాడిని తెప్పిస్తారు లంబు జంబులు .
ఆ కోటిగాడి వలన రాంబాబు చనిపోతాడు . అతనిలో మార్పు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు . రాంబాబు చెల్లెలి పెళ్ళి సమయంలో తాను చేయని హత్యను మీద వేసుకుని అరెస్ట్ అవుతాడు . హీరోయిన్ చాకచక్యంతో హత్యకు సంబంధించిన ఫొటోలను సంపాదించి హీరో గారిని కాపాడటంతో శుభం కార్డ్ పడుతుంది .
కధ రొటీనుదే అయినా మలుపులు , ఊపులు , మెరుపులు కోదండరామిరెడ్డి శైలిలో ఉండటం వలన సినిమా హిట్టయింది . ముఖ్యంగా పాటలు . కృష్ణ శ్రీదేవి డ్యూయెట్లు అభిమానులకు పండగ చేస్తాయి . నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం అజంతా ఎల్లోరా శిల్పాలు ఇస్తున్నా అంకితం పాట చాలా బాగా చిత్రీకరించబడింది .
మరో మూడు డ్యూయెట్లు కూడా చాలా అందంగా ఉంటాయి . కూడబలుక్కొని కన్నారే మీ అమ్మ మా యమ్మ , ఎక్కితొక్కి నీ అందం , పట్టు మీద ఉన్నది మూడు డ్యూయెట్లనూ కృష్ణ శ్రీదేవిల మీద అందంగా చిత్రీకరించాడు దర్శకుడు .
జయమాలిని కృష్ణల మీద పాట చీకటెప్పుడవుతుందా శ్రీరామ చీమ కుట్టుడెక్కువాయె శ్రీరామ చాలా హుషారుగా ఉంటుంది . జయమాలినితో పాటు సమానంగా కష్టించాడు కృష్ణ .
ఇతర ప్రధాన పాత్రల్లో ముచ్చెర్ల అరుణ , నిర్మలమ్మ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , గిరిబాబు , సుత్తి వేలు , జయవిజయ , శ్రీధర్ , ప్రభృతులు నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . కృష్ణ శ్రీదేవి అభిమానులు తప్పక చూడవచ్చు . A 100% entertaining , feel good movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
వేటూరి కలం చిందులు చిలిపిగా “కూడబలుక్కుని కన్నారమ్మా, నీయమ్మా నాయమ్మా !” అని సాగుతూ బూతు పదాలను నీటు పదాలుగా మార్చేస్తాయి.. చీకటేప్పుడప్పుతాదిరో శ్రీరామ అన్న పాట విన్నప్పుడు కూడా రామ రామ అనుకోవలసి వచ్చేది… మరీ ‘నీయమ్మ నా అత్తో నాయమ్మ నీ అత్తో’ వంటి పిచ్చి పదాల కూర్పులు, నిట్టూర్పులు బోలెడు… (Vasudha B Rao)
Share this Article